డిఏ రద్దు సమర్ధనీయం కాదు

ABN , First Publish Date - 2020-11-12T06:02:07+05:30 IST

కరువుభత్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బకాయి పడి ఉన్న రెండు కరువుభత్యాలు, జనవరి నుంచి...

డిఏ రద్దు సమర్ధనీయం కాదు

కరువుభత్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బకాయి పడి ఉన్న రెండు కరువుభత్యాలు, జనవరి నుంచి రాబోయే కరువుభత్యం మొత్తం మూడు కరువుభత్యాలను ఇవ్వలేంటూ ఏకంగా వాటిని రద్దు చేసేసింది. తన చర్యకు సమర్థించుకో వడానికి కేంద్రం తన ఉద్యోగులకు కరువుభత్యాలపై విధిస్తున్న తాత్కాలిక నిషేధాన్ని ఉదాహరణగా జగన్ ప్రభుత్వం చూపిస్తోంది. కరువుభత్యం అదనంగా ఇచ్చే జీతం కాదు, అది జీతంలో భాగం మాత్రమే. పెరుగుతున్న ధరల సూచీ ప్రకారం ఉద్యోగుల కుటుంబ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా కరువు భత్యం ఇస్తారు. ఈ ఆనవాయితీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇది ఉద్యోగుల హక్కు, విలాసవంతమైన కోరిక కాదు. కరువుభత్యం కథ ఇలాఉంటే వేతన సవరణ కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడిపోయినట్లే అన్నది పరోక్ష సూచన. కొవిడ్ వల్ల ఆర్థికవ్యవస్థ పతనాన్ని చూపిస్తున్న రాష్ట్రప్రభుత్వం ఓటు బ్యాంకును పదిలం చేసుకోడానికి అడిగిన వారికీ అడగని వారికీ ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రకటించి ఉద్యోగులకు మాత్రం మొండిచెయ్యి చూపించడంతో ఆయావర్గాల నుంచి తీవ్ర నిరసన చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు కూడా కరువు భత్యం ఒక పెద్ద ఆసరా అన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి, ఇప్పటికైనా తమ విధానాలపై పునఃసమీక్షలు జరిపి కరువుభత్యంపై విధించనున్న నిషేధాన్ని ఎత్తివెయ్యాలి.

మీగడ వీరభద్రస్వామి

పుల్లిట, శ్రీకాకుళం జిల్లా

Updated Date - 2020-11-12T06:02:07+05:30 IST