నాన్న కల ఇది!

Sep 20 2021 @ 01:46AM

విలనిజం పండించాలంటే లోపల విషయం ఉండాలి. ఒక్క షాట్‌లో విభిన్నమైన హావభావాలు ముఖంపై పలికించగలగాలి. అప్పుడే సన్నివేశం రక్తి కడుతుంది. కథ ఆసక్తి రేపుతుంది. అందులో దిట్ట సునంద మాలశెట్టి. మయసు చిన్నదే... కానీ పోషించే పాత్రలు పెద్దవి. డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి... ప్రతినాయకిగా బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్న తెలుగమ్మాయి సునంద చెప్పే విశేషాలు ‘నవ్య’కు ప్రత్యేకం... 


పర్సనల్‌ టచ్‌


  1. మంచి డ్యాన్సర్‌ కావాలనుకుంది... నటి కూడా అయింది
  2. వైవిధ్య పాత్రలు ధరించినా ప్రతినాయకిగానే ప్రత్యేకత  
  3. నటిగా ప్రశంసలు పొందింది. పురస్కారాలూ అందుకుంది
  4. ‘సునంద మాల’ పేరుతో కొత్తగా యూట్యూబ్‌ చానల్‌ తెస్తోంది
  5. డ్రీమ్స్‌, గోల్స్‌ లేవు. వచ్చింది, నచ్చింది చేసుకొంటూ పోవడమే 
  6. నచ్చే నటులు చిరంజీవి, శ్రీదేవి, నాని, సమంత.


ఇవాళ్టి నేను నిన్నటి మా నాన్న కల. ఆయన నన్ను టీవీలో చూడాలనుకున్నారు. మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకొంటే నలుగురికీ చెప్పుకొని మురిసిపోవాలనుకున్నారు. కానీ అవేవీ చూడకుండానే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆ బాధ నన్ను కుంగదీసింది. అదే సమయంలో ఆయన కల నిజం చేయాలన్న కసినీ పెంచింది. విశాఖపట్నంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాలుగో తరగతిలో కూచిపూడి నాట్య సాధన ప్రారంభించాను. తరువాత వెస్ట్రన్‌ డ్యాన్స్‌ కూడా నేర్చుకున్నా. రవీంద్రభారతి వంటి ప్రముఖ కళావేదికల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. అభినందనలు అందుకున్నాను. ఆ ఉత్సాహంతో ‘ఆట జూనియర్స్‌’ టెలివిజన్‌ షోకి వెళ్లాను. కానీ ఎంపిక కాలేదు. 


తోడుగా వెళ్లి... 

ఏ మూలో నిరాశ... తొలి ప్రయత్నం ఫలించలేదని. కానీ నిరుత్సాహపడలేదు. వేచిచూద్దామనుకున్నా. అలా కొన్నాళ్ల తరువాత ఓ చిన్న అవకాశం వచ్చింది. నేను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు అవి. మా ఇంటి దగ్గర మా గురువు ఒకరు ‘ఆట జూనియర్స్‌’ డ్యాన్స్‌ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు. తన కో-డ్యాన్సర్‌గా నన్ను తీసుకువెళ్లారు. ఊహించని అవకాశంతో అలా 2008లో బుల్లితెరపై నా కెరీర్‌ ఆరంభమైంది. 


పెద్ద కుదుపు... 

ఒక పక్క చదువు... మరో వైపు టీవీ షోలు... నిదానంగా పుంజుకొంటోంది కెరీర్‌. ఓ డ్యాన్స్‌ షోకు నేను కంటెస్టెంట్‌గా ఎంపికయ్యాను. 2010 జూలై 5న ఆ షో లాంచింగ్‌. నా పుట్టినరోజు కూడా అదే రోజు! ఆ షో కోసం సన్నద్ధమవుతుండగా మా కుటుంబంలో పెద్ద కుదుపు. షోకి వారం పది రోజుల ముందు అనారోగ్యంతో నాన్న మరణించారు. ఒక్కసారిగా ఇల్లంతా విషాదం. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ షోలకు వెళ్లడం తగదని బంధువులు చెప్పారు. నాకూ ఏంచేయాలో అర్థం కాలేదు. కానీ మా అమ్మ, అన్నయ్య ప్రోత్సహించారు. ‘ఇన్నాళ్లూ నువ్వు ఎదురు చూస్తున్నది... నాన్న కోరుకున్నది ఇలాంటి అవకాశం కోసమే కదా. వెళ్లు...’ అని అమ్మ చెప్పింది. ఆ మాటలు నాలో ఆత్మస్థైర్యం నింపాయి. షోలో మంచి ప్రదర్శన ఇవ్వడానికి స్ఫూర్తినిచ్చాయి. 


ఊహల్లో కూడా లేదు... 

డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలన్న ధ్యాసే కానీ నటి కావాలన్న ఆలోచన నాకు ఏ రోజూ లేదు. ఓ డ్యాన్స్‌ షో చేస్తుంటే అది చూసి ‘గోకులంలో సీత’ సీరియల్‌కు అడిగారు. పెద్ద బ్యానర్‌. కాకినాడలో ఆడిషన్స్‌కు పిలిచారు. ‘సెలెక్ట్‌ కానులే’ అనుకుని సరదాగా వెళ్లాను. కట్‌ చేస్తే ఆ సీరియల్‌లో నాది కీలకమైన ‘గాయత్రి’ పాత్ర. ఈ పాత్ర కోసం డ్యాన్స్‌ బాగా వచ్చి, ముఖంలో హావభావాలు పలికించగల అమ్మాయి కోసం వాళ్లు వెతుకుతున్నారట. వెతగ్గా వెతగ్గా నేను కనిపించానట. సీరియల్‌ సాగే క్రమంలో నాదే ప్రధాన పాత్రగా మారింది. అది మొదలు నా బీఎస్సీ డిగ్రీ పూర్తయ్యే సరికి నటిగా బిజీ అయిపోయాను. 


వరుస అవకాశాలు...  

మా నాన్న చనిపోయిన తరువాత ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. కొంత కాలం అమ్మ ఉద్యోగం చేసింది. తను కూడా కూచిపూడి నర్తకి. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోనే కాలేజీ ఫీజులు కట్టుకున్నా. కావల్సినవి కొనుక్కున్నా. అప్పుడప్పుడు ఇంట్లో కూడా సర్దుబాటు చేసేదాన్ని. నాకంటూ ఒక గుర్తింపు వచ్చాక ఆ కష్టం మరిచిపోయాను. తొలి సీరియల్‌ తరువాత వరుస అవకాశాలు లభించాయి. ‘ముద్దమందారం, నిన్నే పెళ్లాడతా, నా పేరు మీనాక్షి, నా మొగుడు, పవిత్ర బంధం’... మొత్తం ఏడు సీరియల్స్‌లో నటించాను. ప్రస్తుతం ‘జీ-తెలుగు’లో ‘హిట్లర్‌ గారి పెళ్లాం’ చేస్తున్నా. 


పేరు తెచ్చిన ‘నీలాంబరి’... 

నేను పోషించిన పాత్రల్లో నాయకి, ప్రతినాయకి... రెండూ ఉన్నాయి. వీటిల్లో నాకు బాగా ఇష్టమైన పాత్ర ‘గోకులంలో సీత’లో ‘గాయత్రి’. మంచి పేరు తెచ్చింది, జనాలకు దగ్గర చేసింది మాత్రం ‘ముద్దమందారం’లో ‘నీలాంబరి’. అది నెగెటివ్‌ రోల్‌. తొలిసారి చేశాను. ప్రస్తుతం ‘జీ-తెలుగు’లో ‘హిట్లర్‌ గారి పెళ్లాం’లో అయితే నెగెటివ్‌, పాజిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఇంటి పెద్ద కోడలు దక్ష పాత్ర నాది. తనని నడి వయసు మావయ్యకు ఇచ్చి రెండో పెళ్లి చేస్తారు. ఆ పరిస్థితులను దక్ష ఎలా నెగ్గుకొచ్చింది అన్నది కథ. 


అవే కష్టం... 

‘పవిత్ర బంధం’ తరువాత అన్నీ ప్రతినాయకి పాత్రలే వచ్చాయి. పరిశ్రమలో ఒక కేరెక్టర్‌ చేస్తే... ఇక అన్నీ ఆ తరహావే చేయమని అడుగుతుంటారు. నాకూ అదే పరిస్థితి ఎదురైంది. అందరూ అలాంటి పాత్రలతోనే నా ముందుకు వచ్చారు. నేనేమో పాజిటివ్‌ రోల్‌ వస్తేనే చేద్దామని అవకాశాలన్నీ వదులుకొంటూ వెళ్లాను. ఏడాదిన్నర ఖాళీగా కూర్చున్నా. అయినా పూర్తి స్థాయి కథానాయకి పాత్రలు రాలేదు. ఈ క్రమంలోనే ‘హిట్లర్‌ గారి పెళ్లాం’ ఒప్పుకున్నా. ఎందు కంటే ఇది రెండు షేడ్లు ఉన్న పాత్ర... వైవిధ్యమైన కథ.  


నిజానికి నా దృష్టిలో కథానాయకి కంటే ప్రతినాయకిగా మెప్పించడం చాలా కష్టం. విలన్‌ అంటే డిఫరెంట్‌ షేడ్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, వేరియేషన్స్‌ చూపించాలి. వాళ్లతో వీళ్లతో దెబ్బలు, తిట్లు తినాలి. ఒక్కోసారి సన్నివేశం అయిపోయాక మనం పలికించిన హావభావాలకు నరాలు చిట్లిపోయినట్లు ఉంటుంది. ఓ సీరియల్‌ షూటింగ్‌లో అయితే కింద పడినట్టు, పొగలో చిక్కుకున్నట్టు, రెండు కాళ్లూ లాక్‌ అయిపోయినట్టు నటించాలి. ఒక్కోసారి గాయాలు కూడా అయ్యేవి. అయితే తెర మీద మనల్ని చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టినప్పుడు ఇవన్నీ మరిచిపోతాం. ఏ పాత్రయితే ఏంటి... జన హృదయాల్లో నిలిచిపోతే చాలు కదా!  

హనుమా

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.