గందరగోళం!

ABN , First Publish Date - 2022-01-24T04:26:28+05:30 IST

షాద్‌నగర్‌ మున్సిపల్‌ పట్టణ పరిధిలో అనుమతుల్లేకుండా

గందరగోళం!
షాద్‌నగర్‌లో నిర్మాణాన్ని కూలుస్తున్న అధికారులు (ఫైల్‌)

  • అనుమతుల్లేని ఇళ్ల కూల్చివేతలపై రోజుకో ప్రచారం
  • బెంబేలెత్తుతున్న షాద్‌నగర్‌ మున్సిపల్‌ పట్టణ ప్రజలు
  • ఇంటి నెంబర్‌ ఇచ్చి.. ట్యాక్స్‌ కట్టించుకొని కూల్చుతున్నారని ఆరోపణ
  • అనుమతుల్లేని వాటిని క్రమబద్ధీకరించాలంటూ కోర్టుకు వెళ్లనున్న బిల్డర్స్‌


షాద్‌నగర్‌, జనవరి 23 : షాద్‌నగర్‌ మున్సిపల్‌ పట్టణ పరిధిలో అనుమతుల్లేకుండా కట్టిన ఇళ్లను హెచ్‌ఎండీఏ, పట్టణ మున్సిపల్‌ అఽధికారుల సమక్షంలో కూల్చివేసిన ఇళ్ల వ్యవహారంపై రోజుకో తీరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనుమతుల్లేకుండా కట్టిన ఇళ్లకు ఇంటి నెంబర్లు, కట్టిన పన్నులు ఉత్తవే అని తేలడంతో భవన యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన అనుమతులు సరైనవో కావో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు మున్సిపల్‌ అధికారులు వస్తారో.. ఏ సమయంలో ఇళ్లను కూలుస్తారోనన్న భయంలో పట్టణ ప్రజలు ఉన్నారు. యజమానులకు ఎలాంటి నోటీసులు  ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలపై పట్టణంలో పలు వదంతులు పుట్టుకొస్తున్నాయి.


జరిగిన పరిణామాలు

మున్సిపల్‌పరిధిలో ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాల జాబితాను రూపొందించాలని హైదరాబాద్‌ మెట్రో డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలో 36 కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాలు పర్మిషన్‌ లేనివిగా గుర్తించి ఆ జాబితాను హెచ్‌ఎండీఏకు అందజేశారు. వాటికి సంబంధించి ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేయకుండానే పోలీస్‌ బందోబస్తుతో మూడు నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో తమవద్ద మున్సిపల్‌ అధికారులు జారీచేసిన అనుమతులు ఉన్నా ఇళ్లను కూల్చివేశారంటూ ఆందోళనకు దిగారు. ఇక ఆ రోజు నుంచి పట్టణంలో అనుమతుల్లేకుండా మరో 300 నుంచి 400 ఇళ్ల జాబితాను మున్సిపాలిటీ అధికారులు గుర్తించారని, త్వరలోనే వాటిని కూడా కూల్చేస్తారన్న వదంతులు పుట్టించడం గమనార్హం.


ఇంటి నెంబర్‌ ఇచ్చి.. ట్యాక్స్‌ కట్టించుకొని 

పట్టణంలో అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలకు పట్టణ మున్సిపల్‌ అధికారులు ఇంటి నెంబర్‌ కేటాయించడంతోపాటు జరిమానా కింద ఆయా బిల్డింగ్‌లకు వంద శాతం పన్ను కట్టించుకున్నారు. దీంతో తమ భవనాలను మున్సిపల్‌ అధికారులు క్రమబద్ధీకరించారన్న ఆలోచనలో ఇంటి యజమానులు ఉన్నారు. మున్సిపల్‌ అనుమతుల్లేని ఇంటికి ఇంటి నెంబర్‌తోపాటు ఇంటికి వందశాతం పన్ను చెల్లించినా కూల్చివేయక తప్పదని మున్సిపల్‌ అధికారులు అంటున్నారు. అలాంటప్పుడు తమతో లక్షల రూపాయల పన్ను ఎందుకు కట్టించుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని సాయి బాలాజీ వెంచర్‌లో ఉన్న ఇంటికి మున్సిపల్‌ అధికారుల పర్మిషన్‌ ఉన్నప్పటికీ ఆ ఇంటిని కూడా కూల్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


కోర్టును ఆశ్రయించనున్న బిల్డర్లు

అనుమతుల్లేని బిల్డింగ్‌లను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. తాము ఇప్పటికే వందశాతం మున్సిపల్‌ ట్యాక్స్‌ కట్టామని, రూ.కోట్లు ఖర్చుచేసి కట్టిన భవనాలను కూల్చకుండా ఉండేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు బిల్డింగ్‌ యజమానులు హైకోర్టు న్యాయవాదులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. 


అన్నీ వదంతులే..

షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలో 27 భవనాలను మాత్రమే గుర్తించాం. అందులో ఐదు భవనాలను గతంలోనే కూల్చివేశాం. మూడు రోజుల క్రితం మరో మూడు భవనాలను కూల్చాం. త్వరలోనే మిగతా వాటిని కూడా కూల్చుతాం. అలాగే అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీరించుకునే అవకాశం ఉందా? అనే అంశంపై కూడా చర్చిస్తున్నాం. అలాంటి అవకాశం ఉంటే వాటిని క్రమబద్ధీకరిస్తాం. బిల్డింగ్‌ నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి మైక్‌ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాం. కూల్చివేతలపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దు. 

 - జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌



Updated Date - 2022-01-24T04:26:28+05:30 IST