ఐదు నెలల తర్వాత.. అమెరికాలో ఇదే తొలిసారి..

ABN , First Publish Date - 2021-03-05T17:12:28+05:30 IST

అమెరికాలో మహమ్మారి కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఐదు నెలల తర్వాత.. అమెరికాలో ఇదే తొలిసారి..

వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఐదు నెలల తర్వాత తొలిసారి డైలీ కేసులు తగ్గడం కొంత ఊరటనిచ్చే విషయం. గురువారం యూఎస్ వ్యాప్తంగా 40వేల కంటే తక్కువ కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. థ్యాంక్స్‌గివింగ్ డే, క్రిస్మస్ సమయాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 8న అయితే రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 3లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా కొత్త కేసులు కాస్తా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని చెప్పొచ్చు.


ఇక బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా మహమ్మారి నివారణ చర్యలపైనే దృష్టిసారించడం కూడా కలిసొచ్చింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. దీని ఫలితంగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడం మొదలైంది.  తన తొలి 100 రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి టీకా అందించడమే లక్ష్యంగా బైడెన్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యకు సమానంగా వ్యాక్సిన్ డోసులు వేయడం పూర్తి చేసినట్లు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. అమెరికా  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.95 కోట్ల మంది వైరస్ బారిన పడగా.. 5.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.  

Updated Date - 2021-03-05T17:12:28+05:30 IST