ప్రమాదపుటంచులు

ABN , First Publish Date - 2020-11-25T04:13:49+05:30 IST

మండలంలో రోడ్డు అంచులు ప్రమాదభరితంగా ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదపుటంచులు
జాతీయ రహదారి రోడ్డు అంచులు

పట్టించుకోని అధికారులు


వెంకటాచలం, నవంబరు 24 : మండలంలో రోడ్డు అంచులు ప్రమాదభరితంగా ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో రోడ్డు అంచులు సక్రమంగా లేక ప్రయాణికులు ప్రమాదాలకు గురువుతున్నారు. మండలంలోని కసుమూరు - పాలిచెర్లపాడు, వెంకటాచలం - తిరుమలమ్మపాళెం, గొలగమూడి - తిక్కవరప్పాడు, సర్వేపల్లి - పూడిపర్తి, సర్వేపల్లి - ఈదగాలి మార్గాలతో పాటు పల్లె ప్రాంతాలకు వెళ్లే మరికొన్ని మార్గాల్లో ఇదే సమస్య నెలకొని ఉంది.అలాగే మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొన్ని చోట్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్‌ రోడ్డు అంచున గ్రావెల్‌ తరలించి రోలింగ్‌ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల రోలింగ్‌ పనులు చేసినా వర్షాలకు రోడ్డు అంచుల్లో వేసిన మట్టి కొట్టుకుని పోవడం, మరికొన్ని చోట్ల శుద్ధమట్టిని వాడటంతో వాహనాలు రోడ్డు అంచులో దిగిన సమయంలో ద్విచక్ర వాహనాలు దిగబడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కొన్నిచోట్ల రోడ్డుకు ఇరువైపులా శుద్ధమట్టిని తరలించి రోలింగ్‌ చేయకుండా వదిలేశారు. మరికొన్ని చోట్ల రోలింగ్‌ పనులే సక్రమంగా చేయకపోవడంతో వాహన చోదకులు వాహనాలు నడిపే సమయంలో అదుపుతప్పి బోల్తాపడి ప్రమాదాలకు గురువుతున్నారు. వెంకటాచలం - తిరుమలమ్మపాళెం మార్గంలో ఎక్కువగా భారీ వాహనాలు తిరుగుతుండటంతో ఆ మార్గంలో రోడ్డు అంచులు దెబ్బతినడంతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల రోడ్డు అంచున కేబుల్‌ పనులు చేపట్టి  రోడ్డు అంచులు చదును చేయకుండా వదిలి వేయటంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నింటిపై సంబంధిత అధికారులు పట్టించుకోవాలని  వాహన దారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-25T04:13:49+05:30 IST