అవగాహనారాహిత్యం.. దళారీ చేతుల్లోకి ధాన్యం

ABN , First Publish Date - 2021-03-07T04:48:02+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నూర్పిడి దశలో దళారుల పాలవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కూడా పక్కనపెట్టి దళారుల మాటలకు తలొగ్గి వారు నిర్ణయించిన ధరకే కల్లాల్లోనే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అవగాహనారాహిత్యం..  దళారీ చేతుల్లోకి ధాన్యం
ధాన్యాన్ని కల్లాల్లో పోసి కాటా వేస్తున్న దృశ్యం

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం


పెళ్లకూరు, మార్చి 6 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నూర్పిడి దశలో దళారుల పాలవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కూడా పక్కనపెట్టి దళారుల మాటలకు తలొగ్గి వారు నిర్ణయించిన ధరకే కల్లాల్లోనే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెళ్లకూరు మండలంలోని 13 రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతులు ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ, నెల్లూరు జిలకర మసూరి, 1010 వంటి రకాల పంటలను నాలుగు వేల హెక్టార్లలో సాగు చేశారు. గ్రేడ్‌-ఏ రకానికి ఒక క్వింటం రూ.1888, సాధారణ రకానికి రూ.1868ల మద్దతు ధర ప్రకటించింది. అయితే దళారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వ మద్దతు ధరకన్నా 100 కేజీల బస్తా మీద 100 నుంచి 150 రూపాయల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం తరలిస్తే నెలల తరబడి డబ్బులు రావన్న ఉద్దేశంతో దళారుల వైపే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బంది వ్యవసాయ సీజన్‌ మొదలైనప్పటి నుంచి రైతులకు ప్రభుత్వ పథకాలు, గిట్టుబాటు ధర వివరాలు, తదితర వాటిపై అవగాహన కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  దళారులతో మమేకం కాకుండా లోపాయికారి ఒప్పందాలను పక్కనపెట్టి రైతులతో నేరుగా సంప్రదింపులు జరిపి అవగాహన కల్పిస్తే అటు రైతులకు మేలు జరగడమేకాకుండా ప్రభుత్వ లక్ష్యం కూడా నేరవేరినట్లు అవుతుంది.  

Updated Date - 2021-03-07T04:48:02+05:30 IST