మార్చి 7లోగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు

ABN , First Publish Date - 2022-01-23T08:16:28+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

మార్చి 7లోగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు

  • ప్రతి నియోజకవర్గంలో 100 మంది ఎంపిక
  • లబ్ధిదారులను గుర్తించేది ఎమ్మెల్యేలు, కలెక్టర్లు
  • ఫిబ్రవరి 5లోగా సర్కారుకు జాబితా ఇవ్వాలి
  • మార్చి 7లోగా యూనిట్లు గ్రౌండ్‌ చేయాలి
  • కలెక్టర్లకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశాలు
  • 2, 3 రోజుల్లో 1200 కోట్లు ఇస్తాం: సీఎస్‌


కరీంనగర్‌/హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. మార్చి 7లోగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకానికి సంబంధించిన యూనిట్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దళిత బంధు పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన దళితబంధు పథకం సత్ఫలితాలతో దళితులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి.. దళితబంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొదటి దశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు చేస్తామని వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు నిర్వహించి ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి అందించాలని సూచించారు. జాబితాను జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రితో ఆమోదింపజేయాలన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 



నిధుల కొరత లేదు: సీఎస్‌

దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఇందులో నుంచి రూ.10 వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. దశలవారీగా దళితబంధు పథకం అమలవుతుందని తెలిపారు. దళితబంధు పథకం అమలుకు శనివారం రూ.100 కోట్లు విడుదలయ్యాయని, మరో రెండు మూడు రోజుల్లో రూ.1,200 కోట్లు విడుదల చేసి జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరవడం, జాబితాలు సిద్ధం చేయడం, యూనిట్లను గ్రౌండింగ్‌ చేయడం, తదితర అంశాలపై సీఎస్‌ సమీక్షించారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన దళితబంధు పథకం ఫలాలను దళితులు అందుకుంటున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, దళిత బంధు పథకం ఇప్పటికే సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమల్లోకి వచ్చింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూలు జిల్లాలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలాల్లో అమలుకు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-01-23T08:16:28+05:30 IST