9 నుంచి దళిత దండోరా

ABN , First Publish Date - 2021-07-25T08:26:49+05:30 IST

దళిత బంధు పథకం పేరిట సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కార్యాచరణను టీపీసీసీ ప్రకటించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు...

9 నుంచి దళిత దండోరా

  • దళిత బంధు పేరిట మోసంపై ప్రచారం
  • టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం
  • అసైన్డ్‌, పోడు భూములపై ఉద్యమం: యాష్కీ, జగ్గారెడ్డి 

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకం పేరిట సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కార్యాచరణను టీపీసీసీ ప్రకటించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు ‘దళిత దండోరా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివా్‌సకృష్ణన్‌ పాల్గొన్నారు. సమావేశంలో హుజూరాబాద్‌ ఎన్నికలు, దళిత బంధు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను మధుయాష్కీగౌడ్‌, జగ్గారెడ్డి వెల్లడించారు. దళితబంధు పేరుతో సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను దళిత దండోరా ద్వారా బయటపెడతామని మధుయాష్కీ గౌడ్‌ చెప్పారు. ఆ తర్వాత గిరిజన, బీసీ దండోరా కార్యక్రమాలనూ చేపడతామన్నారు. ‘‘ఏడేళ్లలో ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం వంచనకు గురి చేసింది. వారి కోసం ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు. కోకాపేట భూముల అవినీతిపై తదుపరి ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. ఇక నుంచి టీఆర్‌ఎస్‌ చేసే ప్రతి అవినీతిపైనా పోరాటం చేస్తామన్నారు. కోకాపేట భూములపై ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి, సీబీఐలకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పోడు భూముల రక్షణ, ప్రభుత్వం లాక్కోకుండా కార్యాచరణ అమలు కోసం ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, దీనిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని, కోర్టుల్లో ప్రైవేటు కేసు వేస్తామని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. 


ప్రవీణ్‌కుమార్‌ వస్తానంటే ఆహ్వానిస్తాం

తమతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కలిసి వస్తానంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని మధుయాష్కీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కోదండరాం, చెరుకు సుధాకర్‌, గద్దర్‌, విమలక్క సహా తెలంగాణవాదులందరూ కాంగ్రె్‌సతో చేయి కలపాలని కోరుతున్నామన్నారు.


అసైన్డ్‌ భూములపై కార్యాచరణ: జగ్గారెడ్డి

అసైన్డ్‌ భూములపై కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించినట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా విలువైన అసైన్డ్‌ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని, కలెక్టర్లకు ఫిర్యాదు చేద్దామంటే వారు కలెక్టరేట్లలో కాకుండా ప్రైవేటు ఫాంహౌసుల్లో ఉంటున్నారని ఆరోపించారు. సదాశివపేటలో 5వేల మందికి ఇళ్ల స్థలాలిస్తే అక్కడి నుంచి పేదలను తరిమికొట్టి ఆ భూములను అమ్మాలని చూస్తున్నారన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో పేదలకు ఇచ్చిన 200 ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా లాక్కొందన్నారు. ఉమ్మడి మెదక్‌లో బినామీ పేర్లతో మంత్రి హరీశ్‌ అసైన్‌ భూములు కొన్నారని ఆరోపించారు. దళితుల విషయంలో మాట తప్పిన కేసీఆర్‌ను ప్రవీణ్‌కుమార్‌ నిలదీయాలని, అప్పుడు కాంగ్రెస్‌ ఆయన్ను పిలుస్తుందని చెప్పారు.


హుజూరాబాద్‌లో కేకే మహేందర్‌ రెడ్డిపై చర్చ..!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపై సమావేశంలో చర్చ జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నేత కేకే మహేందర్‌ రెడ్డిని హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కొంత చర్చ జరిగినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను మరింత అధ్యయనం చేసేందుకు టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ సోమ, మంగళవారాల్లో నియోజవర్గంలో పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు.


Updated Date - 2021-07-25T08:26:49+05:30 IST