ముదపాకలో దళిత రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-07T06:25:53+05:30 IST

భూ సమీకరణలో భాగంగా సాగులో వున్న తమ భూములను బలవంతంగా లాక్కొని పరిహారంగా ఇస్తామన్న స్థలం పట్టా ఇవ్వకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారంటూ మండలంలోని ముదపాకకు చెందిన దళిత రైతులు ఆందోళన బాట పట్టారు.

ముదపాకలో దళిత రైతుల ఆందోళన
ముదపాకలో ఆందోళన చేస్తున్న దళిత రైతులు

తమకు పరిహారమివ్వకుండా లబ్ధిదారులకు ఎలా కేటాయిస్తారని ఆవేదన

పెందుర్తి, జూలై 6: భూ సమీకరణలో భాగంగా సాగులో వున్న తమ భూములను బలవంతంగా లాక్కొని పరిహారంగా ఇస్తామన్న స్థలం పట్టా ఇవ్వకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారంటూ మండలంలోని ముదపాకకు చెందిన దళిత రైతులు ఆందోళన బాట పట్టారు. ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చేది లేదని తమ సమ్మతి లేకుండా భూ సమీకరణ చేపట్టడం పట్ల కోర్టును తాము ఆశ్రయించామని  వారు పేర్కొన్నారు. కాగా బుధవారం పలువురు లబ్ధిదారులు ముదపాక వచ్చి తమకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన ప్లాట్ల హద్దులు చూసుకుంటున్నట్టు తెలుసుకుని దళిత రైతులు అక్కడకు చేరుకున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌లో లాక్కొన్న భూముల రైతులకు పరిహార స్థలం పట్టా ఇవ్వకుండా పట్టణ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూ సమీకరణ పేరుతో ఆరేళ్లుగా ఫలాదాయాన్ని నష్టపోయమాని వాపోయారు. దళిల రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని ఆరోపించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు తమకు మద్దతుగా భూములను యథాస్థానంలో కొనసాగించాలని ఆదేశిస్తూ ఆర్డర్‌ ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం ప్రకారం ఎకరా భూమికి రైతులకు ఇవ్వాల్సిన  900 గజాల ప్లాట్‌ పట్టా ఇవ్వకుండా తమ స్థలాల్లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గృహ నిర్మాణాలు జరిగితే అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఆందోళనలో రైతులు పర్రి శివ, సారిపల్లి భీమేశ్వరరావు, నీలాపు రమణ, ముదపాక అప్పారావు, రాజు, బోని అప్పలనర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T06:25:53+05:30 IST