దళితబంధు యూనిట్లు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:56:50+05:30 IST

దళితబంధు మంజూరై ఇంకా యూనిట్లు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వారం రోజుల్లోగా యూనిట్లు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

దళితబంధు యూనిట్లు ప్రారంభించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

 - లబ్ధిదారులను ప్రోత్సహించాలి

- అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ 

కరీంనగర్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దళితబంధు మంజూరై ఇంకా యూనిట్లు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వారం రోజుల్లోగా యూనిట్లు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, గ్రౌండింగ్‌ అధికారులు, క్లస్టర్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో దళితబంధు పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూరాబాద్‌, మానకొండూర్‌, చొప్పదండి, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం కింద యూనిట్లు మంజూరైనప్పటికీ ఇంకా యూనిట్లు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వారం రోజుల్లోగా యూనిట్లను ప్రారం భించేలా ప్రోత్సహించాలని తెలిపారు. డెయిరీ యూనిట్లు పెట్టి షెడ్లు నిర్మించుకొని ఉన్న లబ్ధిదారులను వేరే యూనిట్‌కు మార్చరాదని ఆదేశించారు. గూడ్స్‌, కార్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండి, బ్యాడ్జీ లైసెన్స్‌ లేకున్నా వాహనాలు మంజూరు  చేసేందుకు వెసులుబాటు కల్పించినట్లు ఆమె తెలిపారు. సెంట్రింగ్‌ యూనిట్లు, సూపర్‌బజార్‌, టెంట్‌హౌస్‌, కిరాణం యూనిట్లను ఇప్పటి నుంచి మంజూరు చేయరాదని, వీటికి బదులు ఫుడ్‌ కోర్టు, జ్యువెల్లరీషాపు, పెయింట్‌ షాపు, లేడీస్‌ ఎంపోరియం యూనిట్లు అనుమతి మంజూరు చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డినేటర్‌ రాంబాబు, ఎల్‌డీఎం ఆంజనేయులు, హార్టికల్చర్‌ డీడీశ్రీనివాస్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, మెప్మా పీడీ రవీందర్‌, జిల్లా వైద్యాధికారి నరేందర్‌, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్‌రావు, వయోజన విద్యాశాఖ అధికారి జయశంకర్‌, పౌరసరఫరాల అధికారి సురేశ్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి నతానియేలు, స్పోర్ట్స్‌ అధికారి రాజు, ట్రాన్స్‌పోర్టు అధికారి చంద్రశేఖర్‌గౌడ్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:56:50+05:30 IST