దళితబంధు వేగవంతం

ABN , First Publish Date - 2022-05-27T06:03:05+05:30 IST

జిల్లాలో దళితబంధు పథకం అమలుపై అధికారులు వేగం పెంచనున్నారు. రెండో విడత దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అధికారులు ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నారు.

దళితబంధు వేగవంతం
జగిత్యాలలో పంపిణీకి సిద్ధంగా ఉన్న దళితబంధు వాహనాలు

 - రెండో విడత అమలుకు ఏర్పాట్లు

 - ఈ నెలాఖరులోపు కనీసం 300 ప్రతిపాదనల స్వీకరణ

- దృష్టి సారించిన అధికార యంత్రాంగం

- కసరత్తు చేస్తున్న ఎమ్మెల్యేలు

జగిత్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దళితబంధు పథకం అమలుపై అధికారులు వేగం పెంచనున్నారు.  రెండో విడత దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అధికారులు ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో తొలివిడత దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇటీవల ఆస్తుల పంపిణీ కార్య క్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. ప్రధానంగా వాహనాలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారు లకు వాటిని పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.పది లక్షల విలువ చేసే ఆస్తులను పంపిణీ చేస్తున్నారు.  

నియోజకవర్గానికి 1500 యూనిట్ల కేటాయింపులు

జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత 1500 దళితబంధు యూనిట్లను కేటాయించి పంపిణీ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. దీంతో యూనిట్ల ఎంపికకు అవసరమైన లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలకు ఒక్కొక్క సెగ్మెంట్‌కు 1500 చొప్పున జిల్లాకు 4,500 యూనిట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు కానున్నాయి. దీంతో పాటు కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జగిత్యాల జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు, సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి, వేములవాడ మండలాలకు సైతం అదనంగా పలు యూనిట్లు అందే అవకాశాలున్నాయి. వేములవాడ, చొప్పదండి ఎమ్మెల్యేలు జగిత్యాల జిల్లాకు చెందిన అర్హులైన లబ్ధిదారుల జాబితాను అధికారులు అందిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్‌

దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించింది. ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయమే తుదిగా ఉండనుంది. తొలి విడత దళిత బంధు పథకంలో సైతం ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన లబ్ధిదారులకే అధికారులు యూనిట్ల కేటాయింపులు జరిపారు. మలి విడతలోనూ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వ్యక్తులకే యూనిట్లను అందించనున్నారు. దీంతో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు. నియోజక వర్గంలోని అన్ని మండలాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అన్ని వర్గాలతో మమేకమై జాబితా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ధర్మపురి నియోజకవర్గ లబ్ధిదారుల జాబితాను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కోరుట్ల నియోజకవర్గం జాబితా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల నియోజకవర్గ జాబితా ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఖరారు చేయనున్నారు. అదే విధంగా వేములవాడ, చొప్పదండి ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌ బాబు, సుంకె రవి శంకర్‌ లబ్ధిదారుల జాబితా రూపొందించడంపై దృష్టి సారించారు. మే నెలాఖరులో ప్రతి నియోజకవర్గంలో 300 మందితో కూడిన జాబితాను అందించాలని ఎమ్మెల్యేలను అధికారులు కోరుతున్నారు. ఎమ్మెల్యేలు లబ్ఢిదారుల జాబితాను అందించగానే తదుపరి కార్యాచరణను పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో రెండో విడత దళిత బంధు పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్లు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.  

తొలివిడతలో 345 మంది లబ్ధిదారులు

జిల్లాలో తొలిసారిగా అమలు చేసిన దళితబంధు జాబితాలో 345 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించారు. ఇందులో ధర్మపురి నియోజకవర్గంలో 81 మంది, జగిత్యాలలో 100, కోరుట్లలో 100, చొప్పదండి నియోజకవర్గంలో 32, వేములవాడ నియోజకవర్గంలో 30 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. 345 మంది లబ్ధిదారుల్లో 91 మంది ట్రాక్టర్లు, 48 మంది ఇతర వ్యవసాయ వాహనాల యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో 89 మంది, రిటైల్‌ రంగంలో 54 మంది, సేవా రంగంలో 40 మంది, మాన్యుఫాక్చర్‌ రంగంలో 23 మంది వివిధ రకాల యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. వీరిలో ట్రాన్స్‌పోర్టు, వ్యవసాయ రంగంలో ఎంపిక చేసుకున్న యూనిట్లను ఇటీవల జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, సుంకె రవిశంకర్‌ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మిగిలిన యూనిట్లను పంపిణీ చేయడానికి అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెలాఖరులోపు సెగ్మెంట్‌కు 300 ప్రతిపాదనలు ఆశిస్తున్నాం

- గుగులోతు రవి నాయక్‌, కలెక్టర్‌, జగిత్యాల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం అమలు చేయనున్నాము. ఈ నెలాఖరు వరకు కనీసం 300 మంది పేర్లు ప్రతిపాదించాలని ఎమ్మెల్యేలను కోరాలని సంబందిత అధికారులకు సూచించాము.

రెండో విడత దళితబంధుపై దృష్టి 

- లక్ష్మీనారాయణ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌, జగిత్యాల

జిల్లాలో తొలివిడత దళితబంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాము. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పనులు పూర్తి చేస్తున్నాము. ఇదే సమయంలో రెండో విడత దళితబంధు పథకం కింద లబ్ధిదారుల జాబితా సేకరణపై దృష్టి సారించాము. ప్రజాప్రతినిధుల వద్ద నుంచి జాబితా అందాల్సి ఉంది. 


 

Updated Date - 2022-05-27T06:03:05+05:30 IST