రైతులను దాటి... వ్యాపారుల గుప్పిట్లోకి...

ABN , First Publish Date - 2022-08-11T07:14:17+05:30 IST

ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట వారి చేతుల్లో ఉన్నంత వరకూ పెరగని ధర.. వారి చేతులు దాటగానే ఒక్కసారిగా భగ్గుమంది.. ఏకంగా మినుమలు క్వింటాల్‌కు రూ.2,800 పెరిగింది.. ప్రతి పం ట సమయంలోను ఇదే పరిస్థితి.. రైతులవద్ద తక్కువ ధరకు కొని వ్యాపారుల వద్దకు చేరగానే ధర పెరిగిపోవడం.. రైతులు నష్టపోవడం జరుగుతోంది.

రైతులను దాటి...   వ్యాపారుల గుప్పిట్లోకి...

  • ఒక్కసారిగా భగ్గుమన్న మినుముల ధర
  • క్వింటాల్‌ బస్తాకు రూ.2,800 పెరుగుదల
  • సన్నరకం ధాన్యంది అదే పరిస్థితి
  • పెరుగుదల బాటలో వేరుశెనక్కాయలు

పిఠాపురం, ఆగస్టు 10: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట వారి చేతుల్లో ఉన్నంత వరకూ పెరగని ధర.. వారి చేతులు దాటగానే ఒక్కసారిగా భగ్గుమంది.. ఏకంగా మినుమలు క్వింటాల్‌కు రూ.2,800 పెరిగింది.. ప్రతి పం ట సమయంలోను ఇదే పరిస్థితి.. రైతులవద్ద తక్కువ ధరకు కొని వ్యాపారుల వద్దకు చేరగానే ధర పెరిగిపోవడం.. రైతులు నష్టపోవడం జరుగుతోంది.


మార్కెట్‌ మాయాజాలం...

మార్కెట్‌ మాయాజాలంలో రైతులు మరోసారి మోసపోయారు. రైతులు పంట పండించినంత కాలం ఏనాడు రూ.100-200కి మించి పెరగని మినుముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు ధర పెరుగుతూనే ఉంది. సాధారణంగా మెట్ట ప్రాంతాల్లో రైతులు తొలిపంటగా అపరాలు పెసర, మిను ము సాగుచేస్తూ ఉంటారు. మినుమ సాగులో లాభాలు అధికంగా వస్తున్న నేపథ్యంలో తొలిపంటగానే కాకుండా సార్వా, దాళ్వా వరి తర్వాత మినుము పంటను రైతులు సాగుచేస్తున్నారు. జిల్లాలో మినుమ సాగు 2021-22 సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. గతంతో పోల్చుకుంటే దిగుబడులు స్వల్పంగా తగ్గినా పెట్టుబడులు తక్కువ కావడంతో రైతులు ఇటువైపు మొగ్గుచూపారు. గతేడాది అక్టోబరు నెలలో రైతులు పండించిన మినుమలను క్వింటాల్‌కు రూ.6వేలకు కొనుగోలు చేశారు. సార్వా తర్వాత అపరాలను అదే ధరకు కొనుగోలు చేయగా వేసవిలో సాగు చేసిన పంటకు అదే ధర లభించింది. నాణ్యత ఆధారంగా క్వింటాల్‌కు రూ.6,000 నుంచి 6,500 వరకూ చెల్లించారు. ప్రస్తుత సార్వా సీజన్‌లో పెట్టుబడులకుగాను రైతులు తమ వద్ద ఉన్న మినుమలను 95శాతంపైగా వ్యాపారులకు విక్రయించేశారు. ఎప్పుడయితే మినుమల నిల్వలు వ్యాపారుల వద్దకు చేరాయో రేటు పెరగడం ప్రారంభించింది. నెలరోజుల వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.2,800 వరకూ పెరిగింది. ప్రస్తుతం మినుమల క్వింటాల్‌ బస్తా ధర రూ.8,600 నుంచి 8,800 వరకూ ఉంది. మినుమలను నిల్వ చేసిన వ్యాపారులు భారీగా లాభపడ్డారు. మినుమ మార్కెట్‌పై ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాపారుల ప్రభావం అధికంగా ఉంటుంది. జిల్లాలోని గొల్లప్రోలు, పెద్దాపురం, పిఠాపురం, తుని, కాకినాడ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ సారి భారీగా మినుమలను నిల్వ చేశారు. గతంలో మాదిరిగా తనిఖీలు లేకపోవడంతో ధరలపై వ్యాపారుల నియంత్రణ అధికంగా ఉందని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. రైతువద్ద పంట ఉన్న సమయంలో ఏ నాడు ధరలు అంతా పెరగవని వారు తెలిపారు.



మిగిలిన పంటలది అదే పరిస్థితి

మినుముతో పెసల ధర పెరుగుతూ వస్తోంది. పెసలు క్వింటాల్‌ ధర గతంలో రూ.6వేలు ఉండగా, ప్రస్తుతం రూ.6,700కు చేరింది. సన్నాలుగా పేరొందిన మసూరి రకం ధాన్యాన్ని సార్వా, దాళ్వా సీజన్‌ సమయాల్లో 75కిలోల బస్తాను రూ.1,400 నుంచి రూ.1,500 వరకూ కొనుగోలు చేశారు. అదే మిషన్‌ కటింగ్‌ను రూ.1200కు కొనుగోలు చేశారు. రైతులవద్ద ఉన్న సార్వా, దాళ్వా ధాన్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు పూర్తిగా కొనుగోలు చేశారు. ఇప్పుడు సన్నరకం ధాన్యం ధర పెరగడం ప్రారంభించింది. ఇప్పుడు సన్నరకం ధాన్యం ధర రూ.1800 నుంచి రూ.1,900 వరకూ ఉంది. సన్నరకాలను వ్యాపారులు, దళారులు ఎక్కువగా నిల్వ వేశారు. కొందరు గొడౌన్లు అద్దెకు తీసుకుని మరీ నిల్వ చేయడంతో వారికి లాభాల పంట పండింది. రైతులవద్ద పండిన పంట అయిపోగానే ధర పెరుగుతుండడంవల్ల రైతులకు ప్రయోజనం లేకపోగా వ్యాపారులు, దళారులు బాగుపడుతున్నారని, ఇది మార్కెట్‌ మాయాజాలమని, ఇందులో అందరూ పాత్రదారులేనన్నది బహిరంగ రహస్యంగానే మారింది. వేరుశెనగకాయల ధర పంట వచ్చిన సమయంలో క్వింటాల్‌ రూ.4,500 నుంచి రూ.6వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ.7,200 వరకూ పెరిగింది. ధరలపై ప్రభుత్వ నియంత్రణ అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ప్రతిఏటా ఇదే పరిస్థితి నెలకొంటోందని, గతంలో ధర తక్కువ ఉంటే మార్కెట్‌యార్డుల్లో నిల్వ చేసుకుని రుణం పొందే సదుపాయం ఉండేదని పలువురు రైతులు తెలిపారు. ఇప్పుడు ఆ సౌకర్యం లేకపోవడంతో అయినకాడికే పండిన పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, ఎక్కడైనా పంట నిల్వ చేసుకునే సదుపాయం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-11T07:14:17+05:30 IST