వైసీపీ సర్కారు తప్పిదాలతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం

ABN , First Publish Date - 2022-06-30T10:33:59+05:30 IST

‘‘వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బతింది.

వైసీపీ సర్కారు తప్పిదాలతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం

  • ఎలా జరిగిందో ప్రజల ముందు ఉంచండి
  • నిర్మాణ జాప్యంతో దేశానికి, ఏపీకి నష్టం
  • జోక్యం చేసుకుని సత్వరం పూర్తి చేయించాలి
  • కేంద్ర మంత్రి షెకావత్‌కు చంద్రబాబు లేఖ


అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. కేంద్రం చెప్పినా వినకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సిన ప్రాజెక్టు అధోగతి పాలైంది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. జరిగిన సంఘటనలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, తత్ఫలితంగా దేశానికి కలిగిన నష్టాన్ని ప్రజల ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ఆయన ఒక లేఖ రాశారు. నిర్మాణ జాప్యంతో దేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా అపారమైన నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చాలని నిర్ణయం తీసుకొంది. పనులు నిలిపివేసి ఆ తర్వాత ఆరు నెలలకు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 


ఈ ఆరు నెలల్లో ప్రాజెక్టు వద్ద పనులను ఏ కాంట్రాక్టర్‌ కూడా పర్యవేక్షించలేదు. కాంట్రాక్టర్‌ను మార్చడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బ తింది. ఈ వాల్‌ను ఒక ప్రఖ్యాత ఏజెన్సీ నదీగర్భంలో 40 నుంచి వంద మీటర్ల లోతు వరకూ నిర్మించింది. ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా నడుస్తున్న సమయంలో కాంట్రాక్టర్‌ను మార్చడం కానీ, మళ్లీ టెండర్లు పిలవడం కానీ చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది. ఆర్థిక భారం పెరుగుతుందని, పని జాప్యం అవుతుందని కూడా హెచ్చరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వినకుండా పనులు ఆపేసి కాంట్రాక్టర్‌ను మార్చే ప్రక్రియ చేపట్టింది. ఈ తప్పిదం మూలంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. దెబ్బతిన్న విషయం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. ఎప్పుడు జరిగిందో నిర్ధారించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. పోలవరం నిర్మాణ జాప్యంతో దేశానికి, రాష్ట్రానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అపార నష్టం జరిగింది’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, ఏడు మండలాలను రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించడం ద్వారా పురోగతికి సాయపడిందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పరిణామాలు తనను కలవరపెడుతున్నాయని, వాటిని పరిష్కరించి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృషి చేస్తారన్న విశ్వాసంతో ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2022-06-30T10:33:59+05:30 IST