అడుగుకో గుంత.. తీరని చింత!

ABN , First Publish Date - 2021-07-26T05:07:01+05:30 IST

కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిని నరకానికి దారులుగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలమయంగా మారాయి. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు.

అడుగుకో గుంత.. తీరని చింత!

  • వర్షాలతో రోడ్లన్నీ ఆగమాగం
  • ఎక్కడ చూసినా గుంతలే దర్శనం
  • చిత్తడిగా మారి.. దిగబడుతున్న వాహనాలు
  • మరమ్మతులకు నోచుకోక ప్రయాణికుల ఇబ్బందులు
  • ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు


కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిని నరకానికి దారులుగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలమయంగా మారాయి. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఎటు చూసినా మోకాల్లోతు గుంతలు, వాటిలో బురద.. అక్కడక్కడా కనిపించే తారు రోడ్డు ఆనవాళ్లు.. గుంతలు తప్పించేందుకు సర్కస్‌ ఫీట్లు చేసే వాహనదారులు.. ఇదండీ.. ఉమ్మడి జిల్లాలో కనిపించే రహదారుల దుస్థితి. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌ ) 

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లపై వర్షం నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు దాటే క్రమంలో కారు కింది భాగం రోడ్డుకు తగిలి వాహనం పాడైపోతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. అంతర్గత రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది. చినుకు పడితే చిత్తడిగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

రంగారెడ్డి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు 1094.501 కిలో మీటర్లు ఉండగా వర్షానికి 169 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడ.. కేశంపేట, ఫరూఖ్‌నగర్‌, నందిగామ, కొత్తూరు మండలాల్లో సుమారు 50 కిలో మీటర్ల వరకు రోడ్లు ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. చౌదరిగూడ మండలంలోని లాల్‌పహడ్‌-చలివేంద్రంపల్లి రోడ్డు 14 కిలోమీటర్ల వరకు దెబ్బతిన్నది. అలాగే చేగిరెడ్డి ఘనపూర్‌-గాలిగూడ 7 కిలోమీటర్ల వరకు, జాకారం-మల్కపహడ్‌ 3 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. కేశంపేట మండలం-కాకునూరు 5 కి.మీ., అల్వాల-మంగళగూడ 3 కి.మీ. వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఫరూఖ్‌నగర్‌ మండలం అయ్యవారిపల్లి వద్ద గల చెరువు అలుగు పారడంతో సుమారు 2 కిలోమీటర్ల రోడ్డు పాడైపోయింది. ఇక్కడ రూ.3 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అప్పారెడ్డిగూడ వద్ద చెరువు అలుగు పారడంతో 2 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఇక్కడ రూ.కోటితో బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కొత్తూరు మండలం నుంచి ఫరూఖ్‌నగర్‌ మండలం సోలీపూర్‌ వరకు 17 కిలోమీటర్ల రోడ్డు వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో మరో వారం రోజుల్లో రూ.67 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. గుంతల రోడ్లతో చౌదరిగూడ మండలంలో ఇప్పటి వరకు 10 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

చేవెళ్ల డివిజన్‌ పరిధి చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లోని పలు గ్రామల్లో దాదాపుగా 33 కిలోమీటర్ల మేర రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. చేవెళ్ల మండలం ఆలూర్‌-శంక్‌పల్లి రోడ్డు, చేవెళ్ల-శంషాబాద్‌ వెళ్లే రోడ్లు ధ్వంసం కాగా,  చేవెళ్ల-షాబాద్‌ రోడు నగర్‌గూడ బిడ్ర్జి వద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం నరకంగా మారింది. షాబాద్‌ మండలం రేగడిదోస్వవాడ-తిరుమలపూర్‌ మూడు కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.80కోట్లు మంజూరయ్యాయి కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అలాగే షాబాద్‌ మండలం నారెడ్లగూడ, గోపిగడ్డ, పోలారం, ఎర్రోనిగూడ తదితర గ్రామాలకు బీటీ రోడ్లు లేవు. శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం, పిల్లిగుండ్ల, పొద్దుటూర్‌, సంకేపల్లి, అంతప్పగూడ, ఇంద్రారెడ్డినగర్‌, శంకర్‌పల్లి మున్సిపాలిటీ, ఫత్తేపూర్‌, తదితర గ్రామాల్లో రోడ్లు గుంతల మయంగా మారాయి. అలాగే శంకర్‌పల్లి మున్సిపాలిటీ చౌరస్తా నుంచి కొత్తూర్‌ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరైనప్పటికీ.. పనులు ప్రారంభం కాలేదు. మహేశ్వరం మండలంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రధానంగా తుమ్మలూరు, మచాన్‌పల్లి చౌరస్తా గుంతలమయంగా మారాయి. ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గులలో సుమారు 80 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో..

 ఇటీవల కురిసిన వర్షాలకు మేడ్చల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయి. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 400 కిలోమీటర్లు, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 497 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. వర్షాలకు మేడ్చల్‌-శామీర్‌పేట రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. కంకరతేలి కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. తూంకుంట మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్‌-పూడూరు రహదారి మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. మేడ్చల్‌ మున్సిపల్‌ శాంతాబయోటెక్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిన రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు  ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. 

ప్రయాణం నరకం

తాండూరు/వికారాబాద్‌/కొడంగల్‌/పరిగి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్‌ జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ నష్టం కాగా, పరిగి నియోజకవర్గంలో తక్కువ నష్టం జరిగినట్లు చెబుతున్నారు. వికారాబాద్‌ నియోజకవర్గంలోని ధారూరు, కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి, మోమిన్‌పేట్‌, వికారాబాద్‌ మండలాల పరిధిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరోడ్లపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఎబ్బనూర్‌-బుగ్గ, బాచారం-కెరెల్లి మధ్య రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మోమిన్‌పేట్‌-మొరంగపల్లి శివారులో తాండూరు వైపు వెళ్లే మార్గంలో కిలోమీటరు రోడ్డంతా అధ్వానంగా మారింది. ఏన్కతల-టేకులపల్లి రోడ్డు కూడా ధ్వంసమైంది. బంట్వారం, కోట్‌పల్లి మండలాల పరిధి కోట్‌పల్లి-మర్పల్లి, కోట్‌పల్లి-నాగసమందర్‌, బంట్వారం-తొరమామిడి రోడ్లు గుంతలమయంగా మారాయి. వికారాబాద్‌-అనంతగిరి, వికారాబాద్‌-సిద్దులూరు, రామయ్యగూడ, వెంకటాపూర్‌తండా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాండూరు పట్టణంలో పలు రోడ్లు ధ్వంసమై ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్లు చిత్తడిగా మారడంతో వాహనాలు అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలు ఉన్నాయి. తాండూరు, పెద్దేముల్‌, యాలాల్‌, బషీరాబాద్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరా్‌సపేట్‌ మండలాల్లోనూ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. పరిగి నియోజకవర్గం పరిధి సుల్తాన్‌పూర్‌-ఊట్‌పల్లి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల రోడ్డు దెబ్బతిన్నది. పూడూరు మండలం, అంగడి చిట్టంపల్లి-లాల్‌పహడ్‌ వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. రోడ్ల మరమ్మతుల కోసం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఇంత వరకు నిధులు విడుదల కాలేదు. 

Updated Date - 2021-07-26T05:07:01+05:30 IST