డామిట్‌.. కథ అడ్డం తిరిగింది!

ABN , First Publish Date - 2022-02-06T05:58:12+05:30 IST

ప్రజలు అధికారం ఇచ్చింది ప్రశ్నించేవాళ్లను అణచివేయడానికే అన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనకు చెక్‌ పడుతోందా? మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఉద్యోగులు...

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది!

ప్రజలు అధికారం ఇచ్చింది ప్రశ్నించేవాళ్లను అణచివేయడానికే అన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనకు చెక్‌ పడుతోందా? మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ర్యాలీ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ వర్గం, ఆ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాలపై అధికార జులుం ప్రదర్శిస్తూ వచ్చిన జగన్‌ సర్కార్‌కు ఈ నిరసన ర్యాలీ ఒక హెచ్చరిక వంటిది. పోలీసులను ప్రయోగించి ఎదిరించిన వారందరినీ అణచివేయాలని ప్రయత్నించిన జగన్‌రెడ్డికి, అది కుదరని పని అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తేల్చిచెప్పారు. ఉద్యోగుల ఆందోళనలకు మామూలుగా అయితే ప్రజల మద్దతు పెద్దగా ఉండదు. అయితే గురువారం చోటుచేసుకున్న సన్నివేశాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ పోకడలపై సమాజంలోని వివిధ వర్గాలలో పేరుకుపోయిన అసహనం ఉద్యోగులు, ఉపాధ్యాయుల రూపంలో ప్రతిబింబించింది. పోలీసులను ఎదిరించలేక మౌనంగా ఉంటూ వస్తున్న ప్రజలు ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సహకరించడం ద్వారా ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. నాయకులను కట్టడి చేసినా, అడుగడుగునా తనిఖీల పేరుతో వేధించినా, కడలి కెరటాల్లా ఉద్యోగులు విజయవాడకు తరలిరావడం ప్రభుత్వ వర్గాలను సహజంగానే ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఉద్యోగులు ప్రదర్శించిన తెగువకు ప్రజల నుంచి జేజేలు లభించడం విశేషం. దీన్నిబట్టి జగన్‌ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని చెప్పవచ్చు. పీఆర్సీ అమలు చేసేలోపు ఇచ్చే మధ్యంతర భృతిని అడ్వాన్స్‌గా పరిగణించి రికవరీ చేయాలనుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కడుపు మండింది. ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధపడ్డారు. ప్రజల మూడ్‌ని గమనించి ప్రభుత్వం ఆలస్యంగానైనా  వెనక్కి తగ్గింది. అధికారం చేతిలో ఉందని.. తాను ఏం చేసినా చెల్లుతుందని జగన్‌రెడ్డి ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. ఇప్పటికైనా ఆయన వైఖరిలో మార్పు వస్తే ప్రభుత్వం సజావుగా సాగుతుంది. లేని పక్షంలో జగన్‌ సర్కార్‌ మరింత వేగంగా పతనం అవుతుంది. సంక్షేమం పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ పంచి పెట్టడం ద్వారా ఓటు బ్యాంకును స్థిరీకరించుకున్నానని ముఖ్యమంత్రి భావిస్తూ ఉండవచ్చు గానీ అది కుదరని పని. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించారు. అప్పుడు మాకెందుకని ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కో సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా మనకెందుకులే అని సరిపెట్టుకున్నారు. రాజధాని అమరావతిని చంపేసి.. మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో కూడా ప్రజలు స్పందించ లేదు. హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివెళ్లడానికి అప్పట్లో మొరాయించిన ఉద్యోగులు, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినప్పుడు ‘మేం రెడీ’ అని ప్రకటించారు. పోలీసుల వేధింపులు పెరిగిపోతున్నా బాధితులకు బాసటగా ఎవ్వరూ నిలబడలేదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాలా అంచున నిలబడింది. ప్రభుత్వం అప్పు చేస్తే మనకు పోయేదేముందిలే అని ప్రజలు భావించారు. ప్రభుత్వ పోకడలను ప్రశ్నించాల్సిన విద్యావంతులైన మేధావులు తమ నోళ్లు కట్టేసుకున్నారు. ఇదంతా చూసి అధికార జులుం ప్రదర్శించినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి భావిస్తూ వచ్చారు. అయితే ప్రజల మౌనం నిస్సహాయత మాత్రమే కానీ ప్రభుత్వాన్ని వారు సమర్థించడం లేదని ప్రస్తుత పరిణామాలు చాటిచెబుతున్నాయి.


ఎల్లకాలం భయపెట్టలేరు!

‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరిట రాజధాని అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలపడం ద్వారా ప్రజలు తమ మనోభావాలను మొదటిసారిగా వ్యక్తీకరించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మూడు రాజధానుల అంశం మూలన పడేశారు. అమరావతిని పడుకోబెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించే విషయం మర్చిపోయారు. దీంతో జగన్‌రెడ్డి చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అనే చర్చ ప్రజల్లో మొదలైంది. మూడేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసినా ఒక్కటంటే ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్‌ కూడా పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ కూడా మూలనపడింది. ఫలితంగా జగన్‌రెడ్డి పాలనా సామర్థ్యంపైనే ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. రాష్ట్రం నాశనం అవుతోందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యాపించింది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లకుండా, మీడియాను చెరబట్టడానికి ప్రయత్నించారు. నిర్బంధాలను అధిగమించి చీమల దండులా విజయవాడకు తరలివెళ్లి ర్యాలీ చేసిన ఉద్యోగుల గురించి కొన్ని న్యూస్‌ చానళ్లు ప్రసారం చేయకుండా కట్టడి చేశారు. సామాజిక మాధ్యమాలు విస్తరించిన ఈ రోజుల్లో కొన్ని మీడియా సంస్థలను కట్టడి చేసినప్పటికీ ఫలితం ఉండదని జగన్‌ అండ్‌ కో తెలుసుకోవాలి. ప్రజల మద్దతు ఉద్యోగులకు ఉండదని భావించిన జగన్‌ అండ్‌ కో అంచనాలు పటాపంచలయ్యాయి. ఉద్యోగులకు వ్యతిరేకంగా నీలి మీడియా ద్వారా ప్రసారం చేయించినా ఫలితం లేకుండా పోయింది. జగన్‌రెడ్డి సొంత మీడియాను బహిష్కరించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిర్ణయించుకునే వరకు పరిస్థితి వెళ్లింది. గురువారం ఉదయం 10 గంటల వరకు ఎక్కడున్నారో తెలియని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ తర్వాత పుట్ట పగిలినట్టుగా రోడ్డు మీదకు చేరుకున్నారు. విజయవాడ రోడ్లన్నీ వారితో నిండిపోయాయి. నాయకులు ఏర్పాట్లేమీ చేయలేదు. ఉద్యోగులే ఎవరికి వారుగా విజయవాడ చేరుకున్నారు. మారువేషాల్లో సైతం ర్యాలీల్లో పాల్గొన్నారంటే వారిలో ఎంత కసి ఉందో స్పష్టమవుతోంది. ఇప్పటివరకు పోలీసులకు భయపడి ఎవరూ బహిరంగంగా నోరెత్తలేదు కనుక ఉద్యోగులను సైతం భయపెట్టి విజయవాడకు రాకుండా అడ్డుకోవచ్చని జగన్‌ అండ్‌ కో భావించినట్టున్నారు. డామిట్‌ కథ అడ్డం తిరిగింది. పోలీసులు కూడా ఉద్యోగులలో భాగమే అన్న విషయం మర్చిపోయారు. ర్యాలీ జరిగిన తీరు చూసి కంగుతిన్న ముఖ్యమంత్రి, పోలీసు అధికారుల వద్ద తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి పీఆర్సీ విషయంలో పోలీసులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పోలీసులపైన మాత్రమే ఆధారపడి పాలించాలనుకున్నవారు ఎవ్వరూ సక్సెస్‌ కాలేదు. నిర్బంధాలు విధించినా ఇంతమంది ఎలా వచ్చారని పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్న జగన్‌రెడ్డి.. ఆ ప్రశ్న కాకుండా ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు? అని తనను తాను ప్రశ్నించుకోవాలి. ఉద్యోగ సంఘాల నాయకుల అంచనాలకు కూడా అందని రీతిలో ఉద్యోగులు భారీ సంఖ్యలో వచ్చారంటే క్షేత్రస్థాయిలో ఏం జరిగి ఉంటుందో జగన్‌రెడ్డి దృష్టిపెడితే ఆయనకే మంచిది. జీతాలు పెరగకపోగా తగ్గడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సహజంగానే జీర్ణించుకోలేకపోయారు. కొవిడ్‌ కారణంగా ఆదాయం తగ్గిందని చెప్పి ఉద్యోగుల జేబు కొట్టేందుకు ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో ఉద్యోగులు చూపించారు. రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మార్చి ఓట్లు తెచ్చిపెడతాయనుకుంటున్న పథకాల పేరిట డబ్బు పంచుతున్న జగన్‌రెడ్డి, తమ కడుపు కొట్టడం ఏమిటంటూ ఉద్యోగులు రగిలిపోయారు. గ్రామస్థాయి నుంచి అమరావతి వరకు అధికార జులుం ప్రదర్శించడానికి అలవాటుపడిన అధికారపక్ష నాయకులకు ప్రస్తుత పరిణామాలు మింగుడుపడటం లేదు. ఎమర్జెన్సీని సైతం ఎదిరించి నిలబడ్డ దేశం ఇది. జగన్‌రెడ్డి వినాశకర విధానాలు, నియంతృత్వ పోకడలను ప్రతిఘటించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తన ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారా? ఉంటే ఎందుకు? వంటి ప్రశ్నలకు సమాధానం అన్వేషించే ప్రయత్నం చేయడం ఆయనకే మంచిది. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డికి ఇంకా కాళ్లనొప్పి తగ్గినట్టు లేదు. మూడేళ్లు అయినా తాడేపల్లి ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. అధికారం ఉన్నదే అనుభవించడానికి అన్నట్టుగా జగన్‌రెడ్డి వ్యవహరించడమే సమస్యకు ప్రధాన కారణం. అధికార పార్టీ నేతలు కింది స్థాయిలో జులుం ప్రదర్శించడానికి అలవాటుపడ్డారు. అధికార పార్టీకి ఊడిగం చేసీ చేసీ పోలీసులు కూడా అలసిపోయారు. ప్రభుత్వం చెప్పినట్టు అడ్డగోలుగా నడచుకోవడానికి పోలీసులు కూడా విముఖత ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పలు జిల్లాల్లో పోలీసులు కూడా విజయవాడకు బయల్దేరిన ఉద్యోగులకు సహకరించారు. జగన్‌రెడ్డి ఇంకో రెండేళ్లు అధికారంలో ఉంటారు. ఇప్పటికైనా సుపరిపాలన అందించడానికి జగన్‌రెడ్డి ప్రయత్నించకపోతే ఎంత భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారో అంతే భారీ ఓటమి ఆయన కోసం వేచి ఉంటుంది. ప్రభుత్వం విధించిన చెత్త పన్ను వసూలుకు వెళ్లిన సిబ్బందిపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఖజానా నింపుకోవడం కోసం తీసుకొచ్చిన ఓటీఎస్‌ పథకం విషయంలో కూడా ప్రజల్లో ప్రతిఘటన వస్తోంది. ప్రజల్లో భయం పోతోంది. ఎల్లకాలం భయపెట్టి పాలించలేమని జగన్‌ అండ్‌ కో తెలుసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల రూపంలో ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడింది. ఈ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయని పక్షంలో అసంతృప్తి, అసహనం కాస్తా కసిగా మారుతుంది.


కేసీఆర్‌ జంగ్‌లో నిజమెంత?

ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు వద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2022–23 సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పొట్టుపొట్టుగా తిట్టిపోశారు. కేంద్రంలోని దరిద్రపుగొట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించారు. పనిలో పనిగా ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ప్రకటించారు. రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంకెన్నో మాటలు అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్‌ అంతసేపు తిట్టినా, హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న రెండు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు డుమ్మా కొట్టినా కేసీఆర్‌ నిజంగానే భారతీయ జనతా పార్టీతో తలపడతారా? అనే సందేహం మాత్రం తొలగిపోవడం లేదు. ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒకసారి ఇలాగే విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చి చల్లబడిపోయారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి ముఖ్యమంత్రి పదవి నుంచి తాను తప్పుకొని తన కుమారుడికి అప్పగించాలని అనుకుంటున్నానని అందుకు మీ సహకారం కూడా కావాలని కోరారు. అమిత్‌ షాతో మనసులో మాట పంచుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు మళ్లీ జూలు విదిల్చినప్పటికీ ఆయనపై నమ్మకం కుదరడం లేదు. నాలుక మడతేయడం కేసీఆర్‌కు అలవాటే కనుక జాతీయ స్థాయిలో కూడా ఆయన ప్రకటనను ఇతర నాయకులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్‌ పుంజుకుందన్న అభిప్రాయం వ్యాపించింది. దీంతో భారతీయ జనతా పార్టీని కేసీఆర్‌ మళ్లీ టార్గెట్‌గా ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. కేసీఆర్‌ మనసులో ఏముందో తెలియకపోయినా బీజేపీ వైఖరి స్పష్టంగా ఉంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఉన్నారు. ఉత్తరాదిన తిరుగులేని పరిస్థితి ఉన్నా.. దక్షిణాదిలో వారికి పట్టుచిక్కడం లేదు. ఇంతకుముందు దక్షిణాదిన మొదటిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ తమ హయాంలో తెలంగాణలోనైనా అధికారంలోకి రావాలని మోదీ–-షా ద్వయం సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో బీజేపీకి ఏ మాత్రం అవకాశం లేదు. ఇక మిగిలింది తెలంగాణనే కనుక ఈ రాష్ట్రంపై వారి దృష్టిపడింది. తెలంగాణను చేజిక్కించుకోవడం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా వారిరువురూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి కొంతకాలం పనిచేసిన ఒకరిని తన కోసం పనిచేయవలసిందిగా కొంతకాలం క్రితం కేసీఆర్‌ కోరారు. ఈ విషయం తెలుసుకున్న అమిత్‌ షా, సదరు వ్యక్తికి కబురు చేసి పిలిపించుకుని ‘తెలంగాణలో మేం అధికారంలోకి రావాలనుకుంటున్నాం.. మీరు కేసీఆర్‌ కోసం పనిచేయవద్దు’ అని సూచించారు. దీన్నిబట్టి కేంద్ర పెద్దల మనసులో ఏముందో మనకు తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు మాట మార్చే అలవాటు ఉన్న కేసీఆర్‌ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. కేసీఆర్‌ ఎంతగా దూషణభూషణలకు పాల్పడినా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కేంద్ర పెద్దలు పట్టించుకోరని చెబుతున్నారు. జూలైలో రాష్ట్రపతి ఎన్నిక కూడా ఉన్నందున అప్పటివరకు కేసీఆర్‌ విషయంలో మోదీ–-షా ద్వయం సంయమనంతో ఉంటారని చెబుతున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌కు సినిమా చూపించేందుకు స్కెచ్‌ సిద్ధం చేసినట్టు సమాచారం. పరిస్థితులు ప్రతికూలంగా మారితే కేసీఆర్‌ వెంటనే యూ టర్న్‌ తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఉద్దేశించి తాజాగా తిట్టిన తిట్లను మరచిపోతారు. రాష్ట్రంలో తనకు ఏ మాత్రం గిట్టని రేవంత్‌రెడ్డిని నిలువరించడమే కేసీఆర్‌కు ముఖ్యం. అందుకే బీజేపీపై ఆయన ప్రకటించిన జంగ్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ విషయం అలా ఉంచితే కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఉన్నట్టుండి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరించడానికి, రాజ్యాంగానికి సంబంధం లేదు. కేంద్రం, రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి? రాష్ర్టాలకు కేంద్ర సహాయం ఏ ప్రాతిపదికన ఉండాలి? కేంద్ర–-రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార పరిధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం రాజ్యాంగానికి రూపకల్పన చేసింది. అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్‌ వ్యాఖ్యానించడంతో దళితుల్లో సహజంగానే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు నియంతృత్వ పోకడలు పోవచ్చునని రాజ్యాంగంలో చెప్పలేదు. ఇప్పుడు కేంద్రంలోని పాలకులతో పాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు నియంతలుగా మారిపోయారు. ఈ పాపం రాజ్యాంగానిది కాదు కదా? నియంతృత్వ పోకడల విషయంలో తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు వ్యవహరించినట్టుగా కేసీఆర్‌, జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. మంత్రులు ఉండాలి కనుక నియమించుకుంటున్నారు కానీ వారికి కనీస స్వేచ్ఛ ఉండడం లేదు. ఏ మంత్రి కూడా కేసీఆర్‌, జగన్‌ల ముందస్తు అనుమతి లేకుండా తమ శాఖకు సంబంధించిన విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేరు. ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించిన తర్వాత ఏక వ్యక్తి పాలన మొదలైంది. అది ఇప్పుడు కేసీఆర్‌, జగన్‌ రూపంలో పరాకాష్ఠకు చేరింది. ఈ పరిస్థితికి రాజ్యాంగాన్ని ఎలా నిందించగలం? కేసీఆర్‌, జగన్‌ ముఖ్యమంత్రులు కావడానికి ఇదే రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా ఇదే రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో రూపొందిన రాజ్యాంగం ఇప్పటికే పలుమార్లు సవరణలకు గురైంది. తాము రూపొందించిన రాజ్యాంగానికి సవరణలు చేసే వెసులుబాటును కూడా రాజ్యాంగ నిర్మాతలే కల్పించారు. రాజ్యాంగ రచనకు 13 కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో డ్రాఫ్ట్‌ కమిటీకి అంబేడ్కర్‌ చైర్మన్‌ కాగా, కేఎం మున్షి, మహమ్మద్‌ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌, న్యాపతి మాధవరావు (అనారోగ్యంతో బీఎల్‌ మిట్టర్‌ రాజీనామా చేశాక), టీటీ కృష్ణమాచారి (డీపీ ఖైతాన్‌ మరణానంతరం) సభ్యులుగా ఉండేవారు. వారందరి కంటే తానే గొప్ప మేధావినని కేసీఆర్‌ భావిస్తుంటే చేయగలిగిందేమీ లేదు. లోపం రాజ్యాంగంలో ఉందా? అధికార పీఠం ఎక్కిన వారిలో ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. రాజ్యాంగంలో లోపం ఉంటే సవరించుకునే వెసులుబాటు ఉంది. అందుకోసం కొత్త రాజ్యాంగం అవసరం లేదు. లోపం పాలకుల్లో ఉంటే ఏం చేయాలి? వారిని దారిలో పెట్టాల్సింది ప్రజలే. ప్రజాస్వామ్యంలో ప్రజలదే సర్వాధికారం అనే మౌలిక సూత్రాన్ని విస్మరించి ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్రవీగుతూ సర్వభోగాలు అనుభవిస్తున్నవారు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడటం విషాదం. దళితులను బుట్టలో వేసుకోవడం కోసం దళితబంధు అమలు చేస్తానంటున్న కేసీఆర్‌, ఇప్పడు రాజ్యాంగాన్ని రద్దు చేయాలనడం ద్వారా దళితులకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతోనే దళితబంధు వంటి పథకాలను తీసుకురాగలిగానని కేసీఆర్‌ తెలుసుకోవాలి. రాజ్యాంగం సంగతి తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మెలగడం ఎలా అనేది కేసీఆర్‌ ముందుగా తెలుసుకుంటే మంచిది. సర్వాధికారాలను ముఖ్యమంత్రి అనేవాడు చెరబట్టవచ్చునని రాజ్యాంగం చెప్పలేదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేవాళ్లు కూడా రాజ్యాంగాన్ని ఎగతాళి చేయడం విషాదం!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-02-06T05:58:12+05:30 IST