కనుపూరు, నెల్లూరు కారాదు జల్లేరు!!

ABN , First Publish Date - 2021-12-20T04:59:01+05:30 IST

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో పది మంది మృతి చెందిన విషయం విదితమే. ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలు నెలూరు రూరల్‌లోనూ ఉన్నాయి.

కనుపూరు, నెల్లూరు  కారాదు జల్లేరు!!
కనుపూరు కాలువపై రక్షణ గోడ దెబ్బతినడంతో ప్రమాదకరంగా వంతెన

కనుపూరు కాలువపై ప్రమాదఘంటికలు

దెబ్బతిన్న వంతెన రక్షణ గోడలు

జొన్నవాడ మలుపులో పొంచి ఉన్న ముప్పు

మేల్కొనకపోతే ప్రమాదాలకు నిలయం



ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో పది మంది మృతి చెందిన విషయం విదితమే. ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలు నెలూరు రూరల్‌లోనూ ఉన్నాయి. నెల్లూరు - పొదలకూరు మార్గంలో ఆమంచర్ల వద్ద కనుపూరు కాలువ వంతెన, నెల్లూరు నుంచి దేవరపాళెం మీదుగా తాటిపర్తి వెళ్లే మార్గంలో జొన్నవాడ మలుపులో నెల్లూరు కాలువ వంతెన వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 


నెల్లూరు రూరల్‌, డిసెంబరు 19 : 

ఆమంచర్ల వద్ద కనుపూరు కాలువ వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు, ప్రయాణికులు భయాందోళన చెందుతు న్నారు. నెల్లూరు నుంచి రాపూరు, పెంచలకోన, కలువాయి, సోమశిలతోపాటు కడప జిల్లాలోని రాజంపేటకు పొదలకూరు మీదుగా నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఒకవైపు రక్షణ గోడ దెబ్బతిని ఉంది. ఇటీవల ఇదే వంతెనపై బైకును తప్పించబోయిన టిప్పరు రక్షణ గోడలను ఢీకొట్టుకుంటూ వెళ్లి కాలువకు పది అడుగుల దూరాన ఆగింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘట నతో స్థానికులు హడలిపోయారు. జల్లేరు వాగు తరహా ఘటనే 2009లో ఈ వంతెనపై జరిగింది. నెల్లూరు నుంచి కలువాయి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ వంతెనపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి 50 అడుగుల లోతున్న కాలువలో పడటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 

ఇదేవిధంగా నెల్లూరు నుంచి వేదగిరిక్షేత్రం, సౌత్‌మోపూరు మీదుగా తాటిపర్తి, సంగం వెళ్లే మార్గంలో జొన్నవాడ వద్దనున్న మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. జొన్నవాడ సర్కిల్‌ నుంచి నరసింహపురానికి తిరిగే మలుపు వద్ద నెల్లూరు కాలువపై వంతెనకు రక్షణ గోడ చాలా తక్కువ ఎత్తున ఉంది. ఏమాత్రం వాహనాలు అదుపుతప్పినా కాలువలో బోల్తాపడే ప్రమాదం ఉంది. నెల్లూరు రూరల్‌లోని ఈ రెండు వంతెనలపై ప్రమాదాల నివారణకు అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-20T04:59:01+05:30 IST