ఆనకట్టకు ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-13T04:44:47+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణానదిపై తెలంగాణలో నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాల ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉంది.

ఆనకట్టకు ప్రమాదం
జూరాల ప్రాజెక్టు మీదుగా రాకపోకలు సాగిస్తున్న ప్రజా రవాణా వాహనాలు

జూరాల డ్యాం మీదుగా వాహనాల రాకపోకలు

ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న  ఇసుక, బియ్యం లారీలు, ఇతర ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు

కేంద్రానికి నివేదిక అందించిన జలాశయాల భద్రత సమీక్ష కమిటీ

ప్రాజెక్టు వద్ద ఇప్పటికే దెబ్బతిన్న ప్యారాపెట్‌ వాల్‌, విజిటర్స్‌ గ్యాలరీ

డ్యాం దిగువన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నా మంజూరు నిల్‌


గద్వాల/వనపర్తి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణానదిపై తెలంగాణలో నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాల ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉంది. రోడ్‌ కం బ్యారేజీ పద్ధతిలో డ్యాం నిర్మాణం చేపట్టినప్పటికీ.. భారీ లోడ్‌లతో వెళ్తున్న వాహనాలతో కట్ట మన్నిక దెబ్బతినే అవకాశం ఉంది. ఈ మేరకు జలాశయాల భద్రత సమీక్ష కమిటీ తన అధ్యయన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆనకట్టపై రాకపోకలను వెంటనే నిలిపేయకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని బృందం పేర్కొంది. 2019లో వచ్చిన వరదల కారణంగా పూర్తి స్థాయి గేట్లు ఎత్తడంతో కట్ట దిగువ భాగంలో ఉన్న ప్యారాపెట్‌ వాల్‌ కూలిపోయింది. కట్టపై నుంచి గ్యాలరీ ప్రదేశం పూర్తిగా మట్టితో నిండిపోయింది. దీంతో కట్టకు ప్రమాదం పొంచి ఉందని గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు వార్తా కథనాలు ప్రచురించింది. కొంతమేర మట్టితో స్వల్ప మరమ్మతులు చేశారు. అలాగే గ్యాలరీకి వెళ్లేందుకు లిఫ్టులు పని చేయడం లేదని కమిటీ తెలిపినప్పటికీ.. అక్కడ అసలు లిఫ్టులనే ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు బృందావనం పార్కు, బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. గత సంవత్సరం మంత్రి కేటీఆర్‌ బృందావనం పార్కుకు శంకు స్థాపన కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎ లాంటి పనులు ప్రారంభించ లేదు. 1995లో అందుబాటులోకి వచ్చిన జూరాల ప్రాజెక్టు వద్ద నిర్వహణ పనులు మినహా ఇప్పటివరకు చెప్పుకోగదగ్గ మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పుడు డ్యామ్‌ రీహాబిలిటేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రాజెక్టులో తెలంగాణ చేరడంతో మరమ్మతులు చేసే అవకాశం ఉంది. 


భారీ వాహనాలతోనే ఇబ్బందులు..

జూరాల ప్రాజెక్టు ఆనకట్ట రోడ్‌ కం బ్యారేజీ పద్ధతిలో నిర్మించినందున ఆనకట్టపై నుంచి వాహనాల రాక పోకలు సాగించవచ్చు. కానీ హెవీ లోడ్‌ వాహనాలు వెళ్లడానికి వీలు లేదు. అవి వెళ్తే కట్ట మన్నిక దెబ్బతినే ప్రమాదం ఉందని నిబం ధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే డ్యాం నిర్మిం చిన నాటి నుంచి ఇప్పటివరకు భారీ వాహ నాలు ప్రాజెక్టు మీదుగా వెళ్తూనే ఉన్నాయి. జలాశయాల భద్రత సమీక్ష కమిటీ కూడా తన నివేదికలో ఇదే విషయాన్ని పేర్కొంది. జాతీయ రహదారిపై నుంచి వెళ్తే దూరభారం కావడం వల్ల, గద్వాల జిల్లా మీదుగా నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని వాహనదారులు ఎంచుకుం టున్నారు. అయితే పబ్లిక్‌ ట్రాన్స్‌ ఫోర్ట్‌ వాహనాలతో పెద్దగా ఇబ్బంది లేక పోయినప్పటికీ, గూడ్స్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ వెహికిల్స్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా బియ్యం లారీలు, ఇసుక లారీలు కట్ట మీదుగా వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో మక్తల్‌లో ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో గద్వాల ఇసుకాసురులు హెవీ లోడ్‌ టిప్పర్లను జూరాల మీదుగా గద్వాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో కనీసం 21 నుంచి 25 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలిస్తుండటంతో ఆ భారం కట్టపై అధికంగా పడుతోంది. ఒక్కో లారీలో టన్నుల కొద్ది బియ్యం తరలిస్తున్నారు. అలాగే గద్వాల నుంచి మక్తల్‌, నారాయణపేటకు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలతో కట్టపై లోడ్‌ ఎక్కువగా పడుతోంది. మొదటి నుంచి హెవీ లోడ్‌ వాహనాలను కట్టపై నుంచి అనుమతించక పోయినట్లయితే ఇబ్బందులు ఉండేవి కావు. కానీ జూరాల అధికారుల నిర్లక్ష్యంతో ఈ రోజు కట్టకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వచ్చింది.


ప్రతిపాదనలతోనే సరి..

రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల ఆనకట్టలపై వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. కానీ కొన్ని ప్రాజెక్టులు ఎక్కువ ప్రాంతాలకు కనెక్టివిటీ సెంటర్లు కావడంతో రోడ్‌ కం బ్యారేజీ పద్ధతిలో కట్టల నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రాజెక్టుల దిగువన కచ్చితంగా బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండగా, జూరాల దిగువన ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. గతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా, ఆ తర్వాత నేషనల్‌ హైవే ఆత్మకూరు నుంచి జూరాల గ్రామం మీదుగా గద్వాల మండలంలోని కొత్తపల్లిని కలిపేందుకు సర్వే జరిగింది. ఇందులో జూరాల గ్రామం కొత్తపల్లి మధ్యలో ఉన్న నదిపై బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే ప్రతిపాదనల దశ దాటి మంజూరుకు నోచుకోవడం లేదు.  ఫలితంగా అందరూ రోడ్‌ కం బ్యారేజీనే రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. జలాశయాల భద్రత సమీక్ష కమిటీ కూడా జూరాలకు దిగువను బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సూచించింది. దిగువ భాగంలో బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల గద్వాల నుంచి ఆత్మకూరు, మక్తల్‌, అమరచింత, దేవరకద్ర, నారాయణపేట తదితర ప్రాంతాలకు రవాణా సులభం కానుంది. త్వరితగతిన బ్రిడ్జి ఏర్పాటు చేయకపోతే జూరాల మీదుగానే రాకపోకలు జరిగి, భవిష్యత్‌లో కట్ట ఉనికికి ప్రమాదం ఏర్పడటం ఖాయమనే అభిప్రాయం ఉంది. మరి డ్యామ్‌ రీహాబిలిటేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రాజెక్టు ద్వారానైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో వేచిచూడాలి. 





Updated Date - 2022-08-13T04:44:47+05:30 IST