డేంజర్‌ వేవ్‌..!

ABN , First Publish Date - 2021-04-13T06:35:26+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లావాసులను కలవరపెడుతుంది. రోజురోజుకూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.

డేంజర్‌ వేవ్‌..!

భారీగా నమోదవుతున్న కరోనా కేసులు

అప్రమత్తమైన అధికారులు

జిల్లాలో 15 కొవిడ్‌ ఆసుపత్రులు

రిమ్స్‌లో అదనపు పడకలు

కట్టుతప్పుతున్న జనం

రాబోయే రోజులపై ఆందోళన 

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 12 : కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లావాసులను కలవరపెడుతుంది. రోజురోజుకూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పాజిటివ్‌ బాధితుల సంఖ్య పెరగడంతోపాటు మరణాలు కూడా సంభవిస్తుండటం అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఒంగోలుతోపాటు కందుకూరు, చీరాల, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరిలో బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఒకవైపు నియంత్రణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నా, మరోవైపు జనం కట్టడి తప్పుతుండటంతో సమస్యకు చెక్‌పడే పరిస్థితులు కనిపించడం లేదు. కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సమస్య ఏర్పడకుండా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గడిచిన వారం రోజులుగా పరిస్థితిని పరిశీలిస్తే.. ఒంగోలులోనే 350కిపైగా బాధితులుండగా, మార్కాపురంలో 100మంది, చీరాలలో 98మంది, కందుకూరు 72, కనిగిరిలో 50మందితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పలువురు వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటికే ఒంగోలులో 21 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించగా, సోమవారం జిల్లాలో కొత్తగా 107 కేసులు నమోదయ్యాయి. 


రెడ్‌జోన్లుగా పలు ప్రాంతాలు 

జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు రెడ్‌ జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఒంగోలు, మార్కాపురం, చీరాల, కందుకూరు, కనిగిరి, వేటపాలెం, టంగుటూరు, గిద్దలూరు, పెదారవీడు, కారంచేడు, నాగులుప్పలపాడు, ఉలవపాడు, దర్శి ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. 


అదనపు ఆసుపత్రులు, పడకలు ఏర్పాటు 

జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో 15 కొవిడ్‌ ఆసుపత్రులను ప్రకటించారు. వాటిలో ఇప్పటికే పన్నెండు సిద్ధం చేశారు. ఐసీయూ బెడ్‌లు 123, నాన్‌ ఐసీయూ బెడ్లు 798, నాన్‌ ఆక్సిజన్‌ పడకలు 462, మొత్తం 1,383 పడకలను సిద్ధం చేయగా, అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను 1,800కు పెంచనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 148 వెంటిలేటర్స్‌ అందుబాటులో ఉంచారు. అయితే ఇప్పటికే రిమ్స్‌లో 344మంది చికిత్స పొందుతున్నారు. 


భవిష్యత్‌పై భయం.. భయం..!

ప్రజల్లో కరోనా భయం బొత్తిగా లేదని, నియంత్రణ చర్యలు చేపట్టినా కట్టడికి కలిసిరాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవైపు పోలీసులు తనిఖీలు నిర్వహించి, పెనాల్టీలు విధిస్తుండగా, జనం మాత్రం అవేమీ పట్టనట్లు ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరగడం కేసుల పెరగడానికి కారణంగా వెల్లడిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


కొత్తగా 107 పాజిటివ్‌లు 

జిల్లాలో కొత్తగా 107 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒంగోలులో అధికంగా 32 ఉన్నాయి. కందుకూరులో 15, చీరాలలో 9, కనిగిరిలో 8, త్రిపురాంతకంలో 7, టంగుటూరులో 6 కేసులు వెలుగుచూశాయి. వాటితోపాటు తర్లుపాడు, వేటపాలెం, వీవీపాలెం, శింగరాయకొండ, పెదారవీడు, పామూరు, పుల్లలచెరువు, మార్కాపురం, ముండ్లమూరు, ఎన్‌జీపాడు, కారంచేడు, దోర్నాల, దర్శి, కంభం, దోర్నాల, సీఎస్‌పురం, బేస్తవారిపేట, చీమకుర్తి, చిన్నగంజాంతో పాటు కొత్తగా మరికొన్నిచోట్ల కేసులు వచ్చాయి. 


Updated Date - 2021-04-13T06:35:26+05:30 IST