ప్రమాదకరంగా అర్వపల్లి జంక్షన్‌

ABN , First Publish Date - 2022-06-28T06:34:48+05:30 IST

రెండు జాతీయ రహదారుల కూడలి అర్వపల్లి జంక్షన్‌ ప్రమాదకరంగా మారింది. అర్వపల్లి జంక్షన్‌లో తరుచుగా పలు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.

ప్రమాదకరంగా అర్వపల్లి జంక్షన్‌
తరుచుగా ప్రమాదాలు జరుగుతున్న అర్వపల్లి జంక్షన్‌

తరుచుగా ప్రమాదాలు 

నిలిచిన పనులు

అర్వపల్లి, జూన్‌ 27: రెండు జాతీయ రహదారుల కూడలి అర్వపల్లి జంక్షన్‌ ప్రమాదకరంగా మారింది. అర్వపల్లి జంక్షన్‌లో తరుచుగా పలు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ జంక్షన్‌ వద్ద ఎలాంటి సూచిక బోర్డులు, సిగ్నల్‌ లైట్లు, రేడియం స్టిక్కర్లు లేవు. దీంతో గత ఆరు నెలల్లో 30 ప్రమాదాలు జరిగాయి. నెల రోజుల క్రితం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ  మరుసటి రోజు కారు, లారీ ఢీకొనగా,  కారులో బెలూన్లు ఓపెన్‌ కావడంతో భారీ ప్రమాదం తప్పింది.

 ఈ జంక్షన్‌లో మహారాష్ట్ర సిరోంచా, ఏపీ రాష్ట్రంలోని రేణిగుంట జాతీయ రహదారి 365, సూర్యాపేట-జనగాం జాతీయ రహదారి  365(బి) కలుస్తాయి. దీంతో అర్వపల్లి జంక్షన్‌ నుంచి నిత్యం వేలాదిగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ రెండు జాతీయ రహదార్లను రూ.600కోట్లతో నిర్మించారు. జంక్షన్‌ పనులను రెండేళ్ల నుంచి కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. సూచిక బోర్డులు లేనందున వాహనదారులు అతివేగంగా వస్తూ జంక్షన్‌లో ప్రమాదాల బారిన పడుతున్నారు. జంక్షన్‌ చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టర్‌, అధికారులు స్పందించి జంక్షన్‌లో అభివృద్ధి పను లను త్వరగా పూర్తిచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

అధ్వానంగా సూర్యాపేట-జనగాం రహదారి 

చిన్నపాటి వర్షం కురిసినా  సూర్యాపేట-జనగాం రహదారిపై ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచి అధ్వానంగా మారింది. ఈ రహదారిపై తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డు, పెట్రోల్‌ బంక్‌, రామన్నగూడెం చెరువు, సహకార సంఘం బ్యాంక్‌ సమీపంలో రోడ్డుపై నీరు నిలుస్తున్నందున వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫుట్‌ పాత్‌లు కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో దారి అధ్వానంగా మారింది. మండల కేంద్ర ంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద రోడ్డుకు అడ్డంగా చేతి పంపు ఉన్న తొలగించకుండా రోడ్డు వేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

జంక్షన్‌ పనులు వెంటనే పూర్తి చేయాలి

అర్వపల్లి మండల కేంద్రంలోని జంక్షన్‌ పనులు పూర్తి కాకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్‌, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 బైరబోయిన సైదులు, అర్వపల్లి 

 నెలరోజుల్లో జంక్షన్‌ పనులు పూర్తి చేస్తాం

అర్వపల్లి మండల కేంద్రంలో గల జాతీయ రహదారుల మార్గంలో ఉన్న జంక్షన్‌ను నెల రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రమాదాలు జరుగకుండా సూచికబోర్డులు ఏర్పాటు చేస్తాం. రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. త్వరగా పూర్తి చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. 

ప్రవీణ్‌రెడ్డి, హైవే డీఈ




Updated Date - 2022-06-28T06:34:48+05:30 IST