ప్రమాదకరంగా పాజిటివిటీ

Sep 22 2021 @ 01:03AM

రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా యాక్టివ్‌లు

రోజువారీ కేసుల్లో  మూడు, నాలుగు స్థానాల్లో జిల్లా

ఈనెలలో 2,620 మందికి వైరస్‌..36 మంది మృతి 

ఒంగోలు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరోసారి కరోనా తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న క్రియాశీలక (యాక్టివ్‌) కేసుల్లో జిల్లా అగ్రస్థానంలో ఉంది. రోజువారీ కేసుల నమోదులోనూ మూడు, నాలుగు స్థానాల్లో ఉంటుండమే కాక జిల్లాలో పాజిటివిటీ రేటు ఆందోళనకు గురి చేస్తోంది. అధికారికంగా ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన కరోనా బులెటిన్‌ వివరాలను పరిశీలిస్తే జిల్లాలో 2,370 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.  కరోనా రెండో వేవ్‌ గత నెలాఖరుకు బాగా తగ్గినట్లు కనిపించినప్పటికీ తిరిగి రోజువారీ కేసుల నమోదు పెరుగుతోంది. గడిచిన వారం పది రోజులుగా జిల్లాలో నమోదవుతున్న కేసుల సంఖ్య పరిశీలిస్తే నిత్యం వంద నుంచి 150 వరకు ఉండటమే కాక ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు మృతిచెందారు. ఈనెలలో ఇప్పటివరకు 2,620 మంది కరోనా బారినపడగా 36మంది మరణిం చారు. పాజిటివిటీ రేటు వారం పదిరోజులుగా గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ఈనెల 11న 2.51 శాతంగా ఉన్న పాజిటివిటీ 20వతేదీకి ఏకంగా 5 శాతానికి చేరింది. మరోవైపు పలు పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడుతున్నారు. గతంలో రోజువారీ పదివేల మందికి పరీక్షలు చేయగా ప్రస్తుతం అందులో సగంమందికి కూడా చేయడం లేదు. మిగతావి పూర్తిగా నిలిపేసి కేవలం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దీంతో అనేకమంది అనధికారికంగా పరీక్షలు చేయించుకొని ప్రైవేటుగా వైద్యం పొందుతుండగా అవి ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు.  


124 కొవిడ్‌ కేసులు.. ఇద్దరు మృతి

 జిల్లాలో మంగళవారం కొత్తగా 124 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకూ 1,36,200 మంది కొవిడ్‌ బారిన పడగా 1,32,745మంది కోలుకున్నారు. 1085 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,370 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం 162 కేంద్రాల్లో 52,741 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకూ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య  26,27,374 మందికి చేరింది. 





Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.