చిన్నారి చేతిలో తుపాకీ! గన్నుల కంపెనీ ప్రకటన వైరల్... నెటిజన్లలో ఆగ్రహావేశాలు..!

ABN , First Publish Date - 2022-05-28T02:53:12+05:30 IST

డానియల్ డిఫెన్స్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతూ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం కల్పిస్తోంది.

చిన్నారి చేతిలో తుపాకీ! గన్నుల కంపెనీ ప్రకటన వైరల్... నెటిజన్లలో ఆగ్రహావేశాలు..!

ఎన్నారై డెస్క్: టెక్సాస్ కాల్పుల ఘటన యావత్ అమెరికాను ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసింది. నిందితుడు రామోస్ విచక్షణా రహితంగా స్కూల్ విద్యార్థులపై కాల్పులు జరపడంతో ఏకంగా 19 మంది మరణించారు. చనిపోయిన వారిలో 11 ఏళ్ల లోపున్న విద్యార్థులతో పాటూ వారి టీచర్లు కూడా ఉన్నారు. డానియల్ డిఫెన్స్ సంస్థ తయారు చేసిన అసాల్ట్ రైఫిళ్లతోనే నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ నరమేధానికి కొద్ది రోజుల ముందు రామోస్ తన పుట్టినరోజును పురస్కరించుకుని రెండు ఆసాల్ట్ రైఫిళ్లను కొన్నాడు. అయితే.. అంతకు కొద్దిరోజుల మునుపే డానియల్ డిఫెన్స్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతూ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం కల్గిస్తోంది.


ఓ చిన్నారి చేతిలో అసాల్ట్ రైఫిల్ పెట్టిన చిత్రాన్ని ఆ సంస్థ అప్పట్లో ట్విటర్ షేర్ చేసింది. ‘‘బయట ప్రపంచానికి తగినట్టు సిద్ధంగా ఉండేలా చిన్నారులకు తగిన శిక్షణ ఇవ్వండి. పెద్దయ్యాక తప పథం మారకుండా జాగ్రత్త పడండి’’ అంటూ ఓ కామెంట్ కూడా జత చేసింది. అప్పటి ప్రకటన తాజాగా వైరల్ అవడంతో నెటిజన్లు ఆ సంస్థపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ తన ట్విటర్ ఖాతాపై ఆంక్షలు విధించింది. తను అనుమతించిన ఫాలోవర్లు మాత్రమే సంస్థ ట్వీట్లు చూడగలిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.



Updated Date - 2022-05-28T02:53:12+05:30 IST