ప్రాధాన్యమేది?

ABN , First Publish Date - 2021-12-06T05:32:24+05:30 IST

ప్రకాశం బ్యారేజికి దిగువునున్న కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సాగయింది.

ప్రాధాన్యమేది?
చక్రాయపాలెం వద్ద రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులు

కొనుగోళ్లపై కబుర్లేనా

కేంద్రాల ప్రారంభంలో నిర్లక్ష్యం

ప్రభుత్వ వైఖరితో రైతుల్లో ఆందోళన 

రోడ్లపై.. కల్లాల్లో ఆరబెట్టి ఎదురుచూపులు 

ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్నా స్పందన శూన్యం


వరుస వాయుగుండాలు.. ప్రభుత్వ తాత్సారంతో అన్నదాత విలవిలలాడుతున్నాడు. వర్షాల భయంతో దక్కిందిచాలని కోత కోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొంటాం.. రైతు ఇంటికే వస్తాం... పొలాల్లోనే కొంటామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు. వర్షాల భయంతో ఎంతోకొంత దక్కితే చాలనుకొని రైతులే కాళ్లావేళ్లా పడుతున్నా వారి గోడు ఆలకించేవారే లేరు.  తడిచిన ఽధాన్యాన్ని చేలల్లో ఉంచలేక, కోతకోసి ఒడ్డుకు చేర్చుకుంటే కొనే దిక్కులేక రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే నేలవాలిపోయిన పంటను కొయ్యాలంటే తడిచిమోపెడవుతుంటే, కోసిన ధాన్యాన్ని ఏం చెయ్యాలనేది ప్రశ్నగా మారింది. కొయ్యకుంటే ఒక సమస్య, కోస్తే మరో సమస్యలా మారిందని అన్నదాత విలవిలలాడుతున్నాడు. 


తెనాలి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజికి దిగువునున్న కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. వీటిలో సుమారు 4.5 లక్షల ఎకరాల వరకు పంట వాయుగుండాల కారణంగా దెబ్బతిన్నది. లక్ష ఎకరాల్లో వరి పంట వాన నీటిలో నానుతూనే ఉంది. వర్షాలకు అంతగా దెబ్బతినని పంటను కోతకోసి, కుప్పలు వేసేందుకు రైతులు సిద్ధపడుతుంటే, నేలవాలి, మొక్క మొలిచి, రంగు మారిపోతున్న ధాన్యాన్ని దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎకరాకు రూ.5 వేల వరకు కూలి చెల్లించి కోత కోయిస్తున్నారు. మరికొందరు యంత్రాలతో గంటకు రూ.3 వేలు చెల్లించి కోయిస్తున్నారు. ఈ పరిస్థితిలో రైతుంటే, ప్రభుత్వ పెద్దల్లోకానీ, ఆయా శాఖల అధికారుల్లో కానీ చలనమే లేదు.   కోతకోయించి ఇంటికి తెచ్చిన ధాన్యాన్ని ఏం చెయ్యాలనేది రైతులకు అంతుబట్టని ప్రశ్నగా మారింది. తడిచిన ధాన్యాన్ని  కొంటామని, రైతులు అధైర్యపడాల్సిన అవసరంలేదని ఎప్పుడో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను మాత్రం  ప్రారంభించలేదు. రైతులు ఆర్బీకేల వద్దకు వెళ్తే మాకే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని  చెప్పడం కొసమెరుపు. ప్రభుత్వం ఇచ్చిన టోల్‌ఫ్రీ నంబరు 1907కు కాల్‌ చేస్తే కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ప్రారంభించటమేంటి! గత నెలలోనే ప్రారంభించారుకదా! అనే సమాధానం రావటంతో రైతులు విస్తుపోతున్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రం లేకున్నా, మీ పరిధిలోని ఆర్‌బీకే దగ్గరకు వెళ్లి వివరాలిస్తే ఎక్కడికి వెళ్లాలో, ఎవరు ధాన్యం కొంటారో చెబుతారని సమాధానం ఇస్తున్నారు. అయితే ఆర్బీకేల్లో అడిగితే ఏ సమాధానం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కోతకోసిన రైతులు ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చుకుని ఆరబెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు పెడతారో! ధాన్యం ఎప్పుడు కొంటారనే స్పష్టత లేకపోవడంతో చాలామంది రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే వ్యాపారులు ఇదే అదనుగా భావించి బాగున్న ధాన్యాన్ని 75 కిలోల బస్తా రూ.1100 కొంటామని చెబుతుంటే, తడిచిన ధాన్యాన్ని రూ.700 నుంచి రూ.900 వరకు రేటు చెబుతున్నారు. అసలే దిగుబడులు సగానికి సగం పడిపోతే, మిగిలిన దానికి దారుణంగా కోతకోసి రేటు చెబుతుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంత దయనీయంగా తమ పరిస్థితి మారుతుందని ఎప్పుడూ అనుకోలేదని తెనాలి రైతు ఉదయశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ-క్రాప్‌ మాయ

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనాలన్నా, నష్టపోయిన పంటకు పరిహారం దక్కాలన్నా ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరి అని ప్రభుత్వం షరతులు పెట్టింది. 60 శాతం మంది కౌలు రైతులే కావడంతో ఈ-క్రాప్‌ నమోదు అంతంతమాత్రంగానే పూర్తయింది. అధికారులు చాలా మండలాల్లో నూరు శాతం ఈ-క్రాప్‌ పూర్తయిందని చెబుతున్నారు. అయితే జిల్లా సంయుక్త పాలనాధికారి సమీక్షలో జిల్లాలో 50 శాతం మాత్రమే పూర్తిచేశామని, మిగిలినది వేగవంతం చేయాలని సూచించడం గమనార్హం. ఈకేవైసీ కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే  రైతు భరోసా కేంద్రాలకు వెళితే ఈకేవైసీపై అక్కడి సిబ్బంది చెప్పే మాటలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల గడువు అయిపోయిందని, మరికొన్ని చోట్ల తమ పరిధిలో మొత్తం నమోదైపోయిందని, ఇంకా అదనంగా చేర్చడానికి అవకాశంలేదని మరికొందరు సమాధానం ఇస్తున్నారు. దీంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. సాగు చేస్తున్న రైతులు తాము చేయించుకోకుండా టార్గెట్‌ ఎట్లా పూర్తవుతుందనేది వారి ప్రశ్న. ఏటా భూమి విస్తీర్ణం తగ్గిపోతుందా! లేక రైతులు కొత్తగా పుట్టుకొస్తారో అనేది వారి లెక్కలు చెబుతున్న ప్రకారం అర్ధం కావటంలేదనేది వారి ప్రశ్న. పంట వేశాక ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోవటం పరిపాటి అయితే, ఈకేవైసీ మాత్రం గడువుతో పనిలేకుండా పంట అమ్మిన సమయంలోకూడా ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌, ఆధార్‌ నంబరు తీసుకుని అప్‌లోడ్‌ చేస్తేనే అర్హులైన రైతులకు న్యాయం జరుగుతుందనేది రైతు సంఘాల వాదన.


ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ఇప్పటికే వరుస వాయుగుండాలు, అకాల వర్షాలతో పంటను నష్టపోయిన రైతులకు పావు వంతు దిగుబడి దక్కుతుంది. అదైనా చాలని, పెట్టుబడులు దక్కకున్నా, అప్పులు తీరితే చాలులే అనుకుని ఆశపడుతున్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కోత కోయడానికే ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చవుతుంటే, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులే రూ.32 వేల వరకు సగటున ఉండటం ఆవేదన కలిగించే విషయం. ఇంతా ఖర్చుపెట్టి కోత కోసినా కొనుగోళ్ల లేక ఇంత కష్టం దక్కేలా లేదని రైతులు వాపోతున్నారు. ఆరిపోయిన ధాన్యాన్ని బస్తాలకెత్తి.. ధాన్యం కొనుగోలు చెయ్యండి బాబూ అంటూ ఆర్బీకేల చుట్టూ, వ్యాపారులు, మధ్య దళారుల చుట్టూ తిరుగుతున్న రైతులున్నారు. 


 

Updated Date - 2021-12-06T05:32:24+05:30 IST