క్రాంతి పథంలో చీకటి కోణం

Jun 17 2021 @ 01:31AM

అంతా అవినీతి వెలుగులు

పేదలను దోచుకుంటున్న ఉద్యోగులు.. 

అవినీతికి సై అంటున్న కొందరు..

నిధులు నిలువునా దోచేస్తున్నా అడిగే దిక్కేలేరు

అవినీతి రుజువైనా చర్యలు శూన్యం

చీరాల ఏరియాలో తాజాగా వెలుగుచూసిన మరో అవినీతి బాగోతం


పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అక్కడ పనిచేసే ఉద్యోగులే పక్కదారి పట్టిస్తున్నారు. పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వారి అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిర క్రాంతిపథం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెలుగు, తర్వాత ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్‌ క్రాంతి పథంగా ఎన్ని పేర్లు మార్చి పథకాలను అమలుచేస్తున్నా.. పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపకపోగా ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం జేబులు నింపుకొంటున్నారు. వెలుగులో రోజుకో ఉద్యోగి అవినీతి బయటపడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు లేకపోవటంతో మిగిలిన వారు కూడా బరితెగించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు డీఆర్‌డీఏ- వైఎస్సార్‌ క్రాంతిపథంలో జరుగుతున్న అవినీతి పుట్టలుపుట్టలుగా బయటకొస్తున్నా ఇదేమిటని అడిగే దిక్కే లేదు. ఇదే అదనుగా అవినీతిపరులైన ఉద్యోగులు పేద మహిళల సొమ్మును నిలువునా దోచేస్తున్నారు.

ఒంగోలు నగరం, జూన్‌ 16 : పొదుపు సంఘాల మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు, సిబ్బంది అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. వైఎస్సార్‌ క్రాంతిపథం (వెలుగు) ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా రుజువవుతున్నా చర్యలు శూన్యం. ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణంగా వారు మరింత బరితెగించేస్తున్నారు. గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై రుజువయ్యాయి. అయితే వారికి కేవలం షోకాజ్‌ నోటీసులు ఇచ్చి మిన్నకున్నారు. ఇలా వదిలేయటంతో తాజాగా చీరాల ఏరియా మరో   బాగోతం ఇటీవల బటయపడింది. మహిళలకు టోకరా వేసి రూ.లక్షలు కాజేసిన వెలుగు ఉద్యోగుల అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. అవినీతి జరిగినట్లుగా ఆ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయినా అందుకు బాధ్యుతలైన వారిలో ఏ మాత్రం భయం అన్నదే కనిపించకపోవటం గమనార్హం. రుజువైనా ఏం కాదులే అనే ధీమాతో వెలుగులోని కొంతమంది ఉద్యోగులు అవినీతితో అంటకాగుతున్నారు. 


చీరాలలో నిలువు దోపిడీ

చీరాల ఏరియా అక్కడ పనిచేసే వెలుగు ఉద్యోగులు చేసిన దోపిడీ ఇటీవల  బయటపడింది. మహిళా సంఘాల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్మును వాటాలు వేసుకుని పంచుకోవటంలో విభేదాలు తలెత్తి అవినీతి బయటకు పొక్కినట్లు సమాచారం. మీకు సేవలు అందించినందుకు సేవా రుసుం చెల్లించాలంటూ చీరాల మండలంలోని వీవోఏల నుంచి రూ.15లక్షలు వసూలు చేశారు. ప్రభుత్వం పొదుపు సంఘాలకు తగిన సహకారం అందించేందుకు వీవోఏలను నియమించి వారికి రూ.8వేల వేతనం ఇస్తోంది. సంఘాల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయవద్దనేది ప్రభుత్వ నిబంధన. దీనిని పక్కనబెట్టి వెలుగు ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే చీరాల ఏరియాలో అది శ్రుతిమించింది. ఇక్కడ సంఘాల నుంచి సేవా రుసుం పేరుతో భారీగా దండుకొని పంచేసుకున్నారు. 


వన్‌టైం సెటిల్మెంట్‌లో చేతివాటం 

వన్‌ టైం సెటిల్‌మెంటులోనూ చేతివాటం చూపించారు. పొదుపు మహిళలు ఎవరైనా లోను తీసుకుని చనిపోయినా... లేదా  ఎక్కువ కాలం మొండిబకాయిగా ఉన్నా అలాంటి వారికి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ వన్‌టైం సెటిల్‌మెంటు సౌకర్యం కల్పించింది. మీ రుణం చాలా ఉంది కొంత కట్టండి మొత్తం మాఫీ చేస్తామంటూ అందినకాడికి దండుకున్నట్లు చీరాల ఏరియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమ్యూనిటీ ఇన్‌వెస్ట్‌మెంటు ఫండ్‌ను కూడా పక్కదారి పట్టించేశారు. పేదల జీవనోపాధుల కోసం ఖర్చు చేయాల్సిన సీఐఎఫ్‌ నిధులను వీవోఏలకు వాహనాలు కొనుగోలు చేసేందుకు రుణంగా ఇచ్చారు. మూకుమ్మడిగా వాహనాలు కొనుగోలు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.7 వేలు కమీషన్‌ తీసుకున్నట్లు  ఆరోపణలు ఉన్నాయి. చీరాల మండంలోని ఇవికాక అనేక అక్రమాలు జరిగినట్లు బయటకొచ్చింది. అయితే ఆ సొమ్మును పంచుకునే విషయంలో వివాదం రావడంతో వ్యవహారం బహిర్గతమైంది. అధికారులు ప్రాథమికంగా చేపట్టిన  విచారణలో అవినీతి రుజువైనట్లు తెలుస్తోంది. 


మొక్కలను మెక్కిన వారికి నోటీసులతో సరి..

గతంలో ఉపాఽధి హామీ నిధులతో ప్రభుత్వం మొక్కలు పెంపకాన్ని చేపట్టింది. మొక్కల కొనుగోలు, నాటడం, నీరు పోయించటం, ఎరువులు వేయించటం వంటి పనుల పర్యవేక్షణ వెలుగు శాఖకు అప్పగించారు. బిల్లులు చెల్లించే పగ్గాలు కూడా వెలుగులోని ఏపీఎంలకు పట్టించారు. ఇంకేముంది అందివచ్చిన అవకాశాన్ని ఆ శాఖలోని ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నారు. మొక్కలు లేకుండానే ట్రీగార్డ్స్‌ ఏర్పాటు చేసినట్లు, వాటికి రోజూ నీళ్లు పోయించినట్లు, ఎరువులు వేయించినట్లు లెక్కలు చూపించి డబ్బులు తినేశారు. వారి బంధువుల పేర్లతో బిల్లులు డ్రా చేసుకున్నారు. ఈ అవినీతి కుంభకోణంలో మొత్తం రూ.22 కోట్లు వెలుగు ఉద్యోగులే దోచేసినట్లు రుజువైంది. దీంతో ఏడాది క్రితం అప్పటి వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎలీషా 130 మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వాటిని అందుకున్న వారిలో కొంతమంది చిన్నచిన్న తప్పులు చేసిన వారు ఉన్నప్పటికీ అనేక మంది రూ.50లక్షల నుంచి రూ.కోటి దాకా దోచేసినట్లు రుజువైంది. అవినీతిపరులకు షోకాజ్‌ నోటీసులు జారీచేసిన అధికారులు ఆ తర్వాత నోరు మెదపకుండా ఉండిపోయారు. ఇలా వదిలేయడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రభుత్వం సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండగా ఇక్కడ రూ.కోట్లు కాజేసినా ఇసుమంతైనా చర్యలు తీసుకోకపోవటంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివెనక పెద్ద ఎత్తున సర్దుబాటు వ్యవహారం నడిచినట్లు ప్రచారం ఉంది.


సీఐఎఫ్‌ నిధులూ నొక్కేశారు..

పేదల జీవనోపాధులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అన్ని మండల సమాఖ్యలకు పదేళ్ల క్రితం రూ.50లక్షల వంతున నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 56 మండలాలకు రూ.50లక్షల వంతున విడుదల చేసింది. ఈ సొమ్మును పొదుపు సంఘాలకు రుణంగా ఇచ్చి తిరిగి కట్టించుకోవాల్సి ఉంది. అయితే అనేక మండలాల్లో ఈ సొమ్ము ఎక్కడ ఉందో తెలియటం లేదు. ఎక్కువ చోట్ల ఉద్యోగులే బినామీ పేర్లతో సీఐఎఫ్‌ నిధులను కొల్లగొట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో సీఐఎఫ్‌ నిధులను అక్రమంగా వాడుకున్నా వారిని గుర్తించినా వారిపైనా ఎలాంటి చర్యలు లేవు.


వాహనాలు.. విలాసవంతమైన గృహాలు..సొంత భూములు..

వెలుగు ఉద్యోగుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారు. ఒంగోలు నగరంలో వి  లాసవంతమైన ఇళ్లు, అపార్టుమెంట్లు కొనుగోలు చేశారు. కోటీశ్వరులు ఉండే అపార్టుమెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఒకరు అయితే ఏటా వంద ఎకరాల్లో శనగ సాగు చేస్తున్నారు. ఇక్కడ అక్రమార్జనతో విలువైన సాగుభూములు కొనుగోలు చేసిన వారు ఉన్నారు. వెలుగులో పనిచేసే ఉద్యోగుల్లో సగంమందికి సొంత కార్లు ఉన్నాయి. వీటిని వారి బంధువుల పేర్లతో కొనుగోలు చేసి వాటిలో తిరుగుతున్నారు. వెలుగులో కిందిస్థాయిలో పనిచేసే వారి కన్నా మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో పనిచేసే వారే ఎక్కువమంది అక్రమాలకు పాల్పడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఉద్యోగుల అవినీతి కారణంగా ప్రభుత్వం ఆశిస్తున్న మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి లక్ష్యం నీరుగారిపోతోంది.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.