అది చాలా నీచమైన పని.. అంత దిగజారుడుతనానికి నేను పాల్పడే అవకాశమే లేదు..!

Aug 3 2021 @ 02:11AM
హెలికాప్టర్‌లో‌ నుంచి దిగుతున్న ఎమ్మెల్యే వేణుగోపాల్‌

దర్శిని అగ్రస్థానంలో నిలుపుతున్నా

సంక్షేమ ఫలాలకు తోడు అభివృద్ధీ సాధించా

ఈ తృప్తితో మరింత కష్టపడి పనిచేస్తా

పార్టీలో నాకేమీ ఇబ్బందులు లేవు

ఇన్‌చార్జ్‌ల వ్యవస్థ సక్సెస్

ఆ విషయంలో తమ్ముడు శ్రీధర్ తప్పు లేదు

ఆ హెలికాప్టర్ స్నేహితుడిది

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): ‘అన్ని రంగాల్లోను దర్శి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలుపుతున్నా.. జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు అందుకు నిదర్శనం. ఈ విజయాలతో తృప్తిగా ఉన్నా. రానున్న రెండున్నరేళ్లు మరింత కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా’.. ఇవి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ చెప్పిన మాటలు. నియోజకవర్గంలో ఆయన జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. అందుకోసం ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు విస్పష్ట సమాధానాలిచ్చారు.


ఈసారి జన్మదిన వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లున్నారు కదా?

అదేమి లేదు. ఎప్పటిలాగే ప్రజలు కలవటం, శుభాకాంక్షలు తెలపటం జరుగుతుందే తప్ప.. ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమీ లేవు.

 

ఎన్నడూ లేనిది ప్రత్యేక హెలికాప్టర్‌లో రావటం విశేషమే కదా?

కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలను కలవటం, అదే సమయంలో బెంగళూరులో కుటుంబ సభ్యులు, మిత్రులు, తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావటంతో హెలికాప్టర్‌ వినియోగించాల్సి వచ్చింది. 


మీకు సొంత హెలికాప్టర్‌లు ఉన్నాయా? 

(నవ్వి) హెలికాప్టర్‌లో రాకను కూడా విభిన్న కోణాలలో చూస్తారని నాకు తెలుసు. కానీ నా మిత్రునికి హెలికాప్టర్‌ ఉన్నందున దానిని వినియోగించుకున్నాను. నిర్వహణ వ్యయం తప్ప దానికి అద్దె చెల్లించే దేమీ లేదు.


ఈసారి మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కారణం ఏమిటో? 

నియోజకవర్గంలో ప్రభుత్వ ముఖ్యంగా సీఎం జగన్‌ ప్రాధాన్యమిచ్చిన నవరత్నాలలోని సంక్షేమ పథకాలను అమలు చేయటంలోను, క్లిష్ట సమయంలో కూడా అభివృద్ధి పథకాలకు నిధులు రాబట్టడంలోను చాలా సంతృప్తిగా ఉన్నా. 


ప్రత్యేకంగా సాధించిన అభివృద్ధి పనులు ఏమిటో?  

దర్శికి డిగ్రీ కాలేజీని మంజూరుచేయించా. దర్శి నుంచి తాళ్లూరు అలాగే దొనకొండకు డబుల్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు ఇటీవలే సీఎం చేత ఆమోదం పొందాను. దర్శి నుంచి కురిచేడు వరకు రెండులైన్లు రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొగలిగుండాలకు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయించా. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభం కాబోతున్నాయి. దొనకొండ మండలంలో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇలాంటివి చాలా ఉన్నాయి.


దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ విషయాన్ని విస్మరించారు కదా?

లేదు లేదు. ఈ విషయంలో సీఎం సీరియస్‌గా ఉన్నారు. నావంతుగా నేను కేంద్రంలో పలువురు పెద్దలను పలుసంస్థల అధిపతులను కలిసి దొనకొండ వద్దకు వచ్చి పరిశ్రమలు పెట్టాలని కోరాను. 3వేల ఎకరాలలో నేవీ సంస్థ వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. 


అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం మూలన పడింది కదా? 

ఈ విషయంలో నావైపు నుంచి కానీ మా ప్రభుత్వం వైపు నుంచి కానీ తప్పులేదు. తప్పంతా కాంట్రాక్టర్‌దే. అందుకే అతనిని తొలగించి వేరే కాంట్రాక్టర్‌ ద్వారా పనులు చేయించే ఏర్పాట్లు చేస్తున్నా.


ఇటీవల రాజకీయ విద్వేషాలతో లబ్ధిదారులను తొలగిస్తున్నారు కదా? 

అది చాలా నీచమైన పని. రాజకీయంగా అంత దిగజారుడుతనానికి నేను పాల్పడే అవకాశమే లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. పింఛన్లు, ఇళ్లస్థలాలు, అమ్మ ఒడి లాంటి చేయూతనిచ్చే పథకాలన్నింటినీ పార్టీ రహితంగా అందరికీ అందజేస్తున్నా. ఉదాహరణకు తూర్పు వీరాయపాలెంలో మాపార్టీ స్థానిక నాయకులు టీడీపీ వారి పింఛన్లు ఆపుచేయిస్తే నేను జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పి పునరుద్ధరణ చేయించా.


పార్టీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉంది.

అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం పార్టీలో నాకెలాంటి సమస్యలు లేవు.


ఇన్‌చార్జ్‌ల వ్యవస్థ ద్వారా పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్న మాట నిజం కాదా?

అలాంటిదేమీ లేదు. ఇన్‌చార్జ్‌ల వ్యవస్థ విజయవంతమైంది. తద్వారా ఇటు పార్టీ శ్రేణుతో పాటు అటు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇటీవల గ్రామానికి సర్పంచ్‌లొచ్చారు, మండలంలో ఎంపీపీలు రాబోతున్నారనే ఉద్దేశంతో కురిచేడు ఇన్‌చార్జ్‌ని తొలగించాను. అయితే కొద్దికాలానికే ఇటు పార్టీశ్రేణులతో పాటు అటు ప్రజల నుంచి ఇన్‌చార్జ్‌ కావాలని నాపై ఒత్తిడి తెచ్చారు. అందుకోసం ధర్నాలు కూడా చేశారంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చు.

 

తమ్ముడు శ్రీధర్‌ షాడో పాత్ర పోషిస్తున్నాడన్న విమర్శలపై మీరేమంటారు? 

నాకు మద్దతుగా ప్రజలకు తోడుగా ఆయన ఉన్నాడు. మాకు నియోజకవర్గంలో వ్యాపారాలు లేవు, సొంత పనులు లేవు. బెంగళూరులో వ్యాపారాల పనుల మీద వారానికి ఒకటి రెండు రోజులు నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పార్టీశ్రేణులు, ప్రజలకు తోడుగా ఆయన తిరుగుతున్నారు. ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడటం లేదు.


ఇటీవల డీఈఈని దుర్భాషలాడటం నిజం కాదా? 

ఆ విషయంలో శ్రీధర్‌ తప్పే లేదు. సొంత భూమికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 90వేలు డీడీ చెల్లించి నెలలు గడుస్తున్నా కనెక్షన్‌ ఇవ్వకపోతే అడగటం ఎలా తప్పవుతుంది. దీనికితోడు ఒక అధికారి పనిపై ఫోన్‌చేసిన వారి మాటలను రికార్డు చేయటం, దానిని బయటకు పంపటం నిబంధనల ప్రకారం తప్పు. అందుకే ఆయనపై చర్యలు తీసుకున్నారు.  


మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి?

ఇప్పటికన్నా మరింతగా కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచటమే నా లక్ష్యం. గడచిన ఏడాదికాలంలో కరోనాతో వచ్చిన ఇబ్బందులను అధిగమించి మరింత సమయాన్ని కేటాయించి మరింత కష్టపడి లక్ష్యాన్ని సాధిస్తా.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.