మహాలక్ష్మీ నమోస్తుతే..

ABN , First Publish Date - 2022-10-02T06:35:50+05:30 IST

మహాలక్ష్మీ నమోస్తుతే..

మహాలక్ష్మీ నమోస్తుతే..

ఇంద్రగిరికి మరింత పెరుగుతున్న భక్తుల రద్దీ

శనివారం తండోపతండాలుగా రాక

కిక్కిరిసిన అన్ని క్యూ మార్గాలు

నేడు మూలానక్షత్రానికి భారీ ఏర్పాట్లు

తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనం

అన్ని క్యూలైన్లు ఉచితమే..

నేడు సీఎం పట్టువస్త్రాల సమర్పణ

ఆ సమయంలో అన్ని దర్శనాలకు బ్రేక్‌


దుర్గమ్మ దర్శనానికి భక్తులు వెల్లువలా తరలివస్తూనే ఉన్నారు. ఎండా వానను లెక్కచేయకుండా కాలినడకన కొండెక్కి అమ్మ దర్శనం చేసుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నారు. శనివారం మహాలక్ష్మీదేవిగా కొలువైన కనకదుర్గమ్మను దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రగిరి కిక్కిరిసిపోయింది. అన్ని క్యూలైన్లు కళకళలాడాయి. ఇక ఉచిత దర్శనానికి వచ్చే భక్తులైతే అమ్మను మదిలో తలచి కిలోమీటర్లు సునాయాసంగా నడిచేసి భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు.


విజయవాడ/చిట్టినగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రి జనసంద్రమవుతోంది. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ నిండిపోతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. మహాలక్ష్మిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్న, మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ తదితర ప్రముఖులు శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి నాటికి సుమారు 60వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా. కాగా, శుక్రవారం కేవలం టికెట్ల ద్వారానే అమ్మవారికి రూ.49 లక్షల ఆదాయం వచ్చింది. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్సవాల్లో అమ్మవారికి ఆదాయం భారీగా పెరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

నేడు మూలానక్షత్రం

ఆదివారం కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం. సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరే అమ్మ దర్శనానికి తెల్లవారుజామున రెండు గంటల నుంచే అనుమతించారు. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల వరకు ఈ దర్శనం ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. దాదాపు 2లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. భక్తులందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారన్న లెక్క తేల్చడం కోసం ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గాల్లో కౌంటింగ్‌ సెన్సార్లు ఏర్పాటు చేశారు. కాగా, కనకదుర్గమ్మకు ఆదివారం సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం ఇంద్రకీలాద్రి వస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఆ సమయంలో అన్ని క్యూల్లో భక్తులను దర్శనానికి అనుమతించబోమని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.














Updated Date - 2022-10-02T06:35:50+05:30 IST