మహోగ్రరూపిణీ..

ABN , First Publish Date - 2022-10-05T06:10:27+05:30 IST

మహోగ్రరూపిణీ..

మహోగ్రరూపిణీ..
క్యూలైన్లలో భక్తుల రద్దీ

మహిషాసురమర్దినీ దేవిగా కనకదుర్గమ్మ

భారీగా తరలివచ్చిన భక్తులు.. క్యూలన్నీ కిటకిట

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి భారీగా చేరుతున్న భవానీలు

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి పరిసరాలు

నేడు పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు

వరద ఉధృతి కారణంగా నదీ విహారం రద్దు

తెప్పోత్సవంపై పూజలతో సరి


విజయవాడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : దుర్గమ్మ మహోగ్రరూపిణిగా దర్శనమిచ్చింది. మహార్నవమి రోజు మహిషాసురమర్దినీ దేవి అవతారంలో భక్తులను కటాక్షించింది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూల్లో బారులు తీరారు. ఘాట్లు సందడిగా కనిపించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. 

నేడు పూర్ణాహుతి

దశమి ఘడియలు ప్రవేశించడంతో మంగళవారం రాత్రి 11 గంటలకు ఆలయ అర్చకులు ఆయుధ పూజ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు చండీహోమం, పూర్ణాహుతి జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఉన్న హంసవాహనంపై పూజలు చేస్తారు. వరద ఉధృతి కారణంగా నదీ విహారాన్ని రద్దు చేశారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ దిల్లీరావు, కమిషనర్‌ కాంతిరాణా, ఈవో భ్రమరాంబ, రివర్‌ కన్జర్వేటర్‌ కృష్ణారావు పరిశీలించారు. తెప్పోత్సవంలో వేదపండితులు, అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులే పాల్గొంటారు. భక్తులను అనుమతించబోరు.

భారీగా చేరుతున్న భవానీలు

భవానీ మాలధారుల రాక మంగళవారం బాగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులు ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కర్నాటక, ఒడిశా నుంచి భవానీలు అధిక సంఖ్యలో వస్తున్నారు. మొత్తంగా దసరా నాటికి 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా. వందల కిలోమీటర్ల దూరం నుంచి విజయవాడ వచ్చే భవానీలతో 16వ నెంబరు జాతీయ రహదారి ఎరుపెక్కింది. చాలామంది కాలినడకన, కొంతమంది సైకిళ్లు, మోటార్‌ సైకిళ్లపై వస్తున్నారు. నడిచి వచ్చే వారిలో మహిళలు, పిల్లలు కూడా అధికంగా ఉన్నారు. కాళ్లు నొప్పులు, బొబ్బలు కట్టినా లెక్కచేయకుండా దీక్షగా ముందుకు సాగారు. మార్గంమధ్యలో దేవాలయాలను దర్శించుకున్నారు. 






Updated Date - 2022-10-05T06:10:27+05:30 IST