
1.
అలా అలా
మూతిని సున్నాలా చుట్టుకుంటూ
గుండ్రటి నవ్వుల్ని, గాల్లో వదలాలని
వున్నది
2.
ఒంటికాలి మడిమ మీద గిర్రున
తిరుగుతూ
చూర్ణమైన ఇసుక పొడిని ప్రేమ
భస్మంలా
లోకం నలువైపులా చల్లాలని వున్నది
3.
తప్పయిన కన్నాలలోంచి
తప్పిపోయిన పతంగి ఎగురుల్ల లోంచి
ఎగిరొచ్చి,
తిప్పే పేజీలలో
నిమగ్నమైన జిజ్ఞాస ముద్రలను
ముద్రించాలని వున్నది
4.
రెండు హస్తాల మధ్య
శూన్యగోళాన్ని బంధిస్తూ
రివ్వున గువ్వపిట్టలా
పైపైకి ఎగరేయాలని వున్నది
5.
అలల పైన గంతులేస్తూ
చెదిరిపోయిన మేఘాల చిత్రపటాలతో
ఆకాశాన్ని అందంగా అలంకరించాలని
వున్నది
6.
రాస్తూ రాస్తూ రాస్తూ
రాత్రిని వెలిగించి
జగత్తంతా చూపాలని వున్నది
7.
కదిలిన తేనెతుట్టె
పొలాల వెంబడి ఉరికిస్తూ
ఒళ్ళంతా ముళ్ళు దించితే
బాధ అంటే ఏమిటో ప్రకటించాలని
వున్నది
8.
చిరుగుతున్న, వెలిసిపోతున్న
పుటలను
ఒక్కటొక్కటిగా చింపివేస్తూ
మిగిలిన
ఆఖరిపుట లోని ఆఖరి వాక్యాన్ని
ఒకటో ఎక్కం నేర్చినంత
సులువుగా, సంబరంగా
చదవాలని వున్నది
9.
కాడమల్లెలను ఏరుకొచ్చి
ముక్కులను తుంచివేస్తూ
పీకలుగా ఊదుతూ
బాల్యాన్ని పిలవాలని వున్నది
10.
గదువకు అరచేయి ఆనిస్తూ
తెరచిన కళ్ళలోంచి
చూపులెక్కడెక్కడికో ఎగిరిపోతూ
కాలం జరుగని బండరాయౌతూ
మనసు లేచి, పురాణం మొదలు
పెట్టుతుంటే
ఏం సాధించావని అడగాలని
వున్నది
11.
చెర్లోకి రాళ్ళు విసురుతూ
నీటి వలయాలను లెక్కగడుతూ
పదను ఊహల అదను కోసం
ఎదురు చూడాలని వుంది
12.
ఎత్తిన పిడికిలి మీద పూసిన
పువ్వులా
నింగిని తాకే వాక్యం మీద
రెపరెపలాడే పతాకంలా
నాలుగు దిక్కుల ప్రపంచ గుమ్మటం
మీద
ప్రతిధ్వనించే ఆవాజ్లా
ఎల్లకాలాలూ జీవించాలని వున్నది
దాసరాజు రామారావు