నాసిరకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. మండిపడ్డ దాసోజు

ABN , First Publish Date - 2022-01-09T22:41:09+05:30 IST

డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణం నాణ్యత చూస్తుంటే బాధతో కన్నీళ్ళు వస్తున్నాయని ఏఐసిసి అధికారి ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

నాసిరకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. మండిపడ్డ దాసోజు

హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణం నాణ్యత చూస్తుంటే బాధతో కన్నీళ్ళు వస్తున్నాయని ఏఐసిసి అధికారి ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలింనగర్‌లో ఉన్న రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ‘‘ ప్రజలు తమ కష్టార్జితంతో ఇచ్చిన టాక్స్ లతో కడుతున్న ఇల్లు నాణ్యత చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. వందేళ్ళు ఉండాల్సిన ఇల్లు.. పిల్లర్లు వేసిన పది రోజులకే కూలిపోయిన దారుణమైన పరిస్థితి. టీఆర్ఎస్ డబుల్ బెడ్ ఇళ్ళ పేరుతో మోసం చేయడమేకాక నాసిరకం నిర్మాణంతో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఇది అత్యంత దుర్మార్గం'' అని మండిపడ్డారు. పిల్లరు వేసిన పదిరోజులకే వంగిపోవడం, చేతితో వూపితే సిమెంటు పెచ్చులుగా రాలిపోవడంతో తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. వందేళ్ళు ఉండాల్సిన ఇళ్ళని ఇంత నాసిరకంగా నిర్మిస్తారా ? ఇళ్ళ నిర్మాణాలకు సిమెంట్ వాడుతున్నారా ? లేదా మట్టితో కడుతున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్లు వ్యవహరించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది'' అని దాసోజు ధ్వజమెత్తారు. 


''ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇరవై వేల డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ .. ఓట్లు వేయించుకున్న తర్వాత హామీని తుంగలో తొక్కారు.  పోని కడుతున్న వంద ఇళ్ళకి నాణ్యత పాటిస్తున్నారా‌?. అంటే లేదు. అప్పుడే పిల్లర్లు వంగిపోయాయి. సిమెంట్ మట్టిలా రాలిపోతుంది. మీ ఇల్లు ఇలానే కట్టుకుంటారా ? ఎందుకు పేదోళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు?. ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే  ఉన్నట్లు వుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరగలేదు. కట్టిన కొన్ని ఇల్లు కూడా పేదలకు కేటాయించడం లేదు. 20 వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారో దానం నాగేందర్ చెప్పాలి. కేసీఆర్‌ని అడగడానికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి  ధైర్యం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలి'' అని శ్రవణ్ డిమాండ్ చేశారు. 



'నిర్మాణాలు మట్టి లెక్క రాలిపోతున్నాయి. పిల్లరు పట్టుకొని ఊపితే సిమెంట్ రాలిపోతుంది. కాంట్రాక్ట్‌ని అడిగితే తనకి మూడు నెలలుగా సైట్ కి రాలేదని చెబుతున్నాడు. సైట్ ఇంజనీర్ లేడు.. కనీస పర్యవేక్షణ లేకుండా, పేదల జీవితాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్మాణాలు చేస్తున్నారు. పేదల ప్రాణాలే కదా పొతే ఏంటి? అనే ధోరణి‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కంట్రాక్టర్‌కి వందల కోట్ల రూపాయిలు కట్టబెడుతున్న ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మొద్దు నిద్రపోతున్నారా ? టీఆర్ఎస్ నాయకులు, దానం నాగేందర్ ఇల్లు ఇలానే కట్టుకుంటారా ?.’’ అని దాసోజు నిలదీశారు. 

Updated Date - 2022-01-09T22:41:09+05:30 IST