దసపల్లా భూములకు రెక్కలు

ABN , First Publish Date - 2022-09-30T06:33:49+05:30 IST

నగర నడిబొడ్డునున్న సుమారు రూ.3,000 కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.

దసపల్లా భూములకు రెక్కలు
దసపల్లా భూములు

కోర్టు ఆదేశాల మేరకు ముందుకువెళ్లాలని ప్రభుత్వ ఆదేశం

కలెక్టర్‌ నిర్ణయమే తరువాయి

విలువ సుమారు రూ.3,000 కోట్లు

ఆ భూములను టీడీపీ నాయకులు కొట్టేయబోతున్నారని ప్రతిపక్షంలో ఉండగా నానాయాగీ చేసిన వైసీపీ నేతలు

సిట్‌కు కూడా ఫిర్యాదు

తాము అధికారంలోకి వస్తే భూములను కాపాడతామని ఎన్నికల సమయంలో పార్టీ పెద్దల హామీ

ఇప్పుడు అవే భూములను అస్మదీయులైన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర నడిబొడ్డునున్న సుమారు రూ.3,000 కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ భూములపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి ముందుకువెళ్లాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

నగరంలో టౌన్‌ సర్వే నంబర్లు 1027, 1028, 1196, 1197లో వున్న దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 2014లో అప్పటి పాలకుల ఆదేశాలతో కలెక్టర్‌ యువరాజ్‌ వాటిని ప్రభుత్వ భూముల జాబితా 22-ఎలో చేర్చారు. ఆ తరువాత ఆ తీర్పుపై అప్పీల్‌ చేశారు. దీంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన సుమారు 76 వేల చదరపు గజాలకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కీలక నేత సాయంతో నగరంలో ఒక బిల్డర్‌, వ్యాపారి కలిసి డెవలప్‌మెంట్‌కు ఆ భూముల కొనుగోలుదారులతో అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. అందులో భారీ బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేశారు. ఆ భూములు 22-ఏలో వున్నందున వాటిపై డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్టర్‌ చేయడం కుదరదని అధికారులు చెప్పినా వినకుండా ఒత్తిళ్లు తెచ్చి పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కొంతకాలం ఆగాక రిజిస్ట్రేషన్ల శాఖ వాటిని తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే వాటిని అస్మదీయులకు అప్పగించేందుకు పాత తీర్పులను ప్రామాణికంగా తీసుకుని ముందుకువెళ్లాలని కలెక్టర్‌కు సూచించింది. దాంతో ఆ భూములు చేతులు మారిపోయే పరిస్థితి ఏర్పడింది.


యూఎల్‌సీ దళారి కీలక పాత్రం

దసపల్లా భూముల వ్యవహారంలో నగరంలో యూఎల్‌సీ భూములను దిగమింగిన వ్యక్తి ఒకరు దళారిగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రాణి కమలాదేవికి అనుకూలంగా వచ్చిన తీర్పులను చూపించి నగరంలోని ప్రముఖులతో 300 గజాల నుంచి వేయి గజాల చొప్పున కొనిపించారు. వాటిని రిజిస్టర్‌ చేయడానికి అధికారులు నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వులు చూపించి భయపెట్టారు. ఆ తరువాత వాటిని 22-ఏలో చేర్చడంతో నిర్మాణాలు సాధ్యం కాలేదు. అయితే ఆయన మాత్రం కోర్టు తీర్పులను బూచిగా చూపించి భారీ భవనం నిర్మించేసుకున్నారు. 


నాడు ఫిర్యాదులు...నేడు ఆదేశాలు

దసపల్లా భూములను తెలుగుదేశం పార్టీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారంటూ...నాడు ప్రతిపక్షంలో వున్న ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన చేశారు. ప్రభుత్వ భూముల కుంభకోణంపై ఏర్పాటుచేసిన సిట్‌ ముందుకువెళ్లి దసపల్లా భూములను కాపాడాలని లేఖలు అందించారు. తాము అధికారంలోకి వస్తే దసపల్లా భూములు కాపాడతామని వైసీపీ నేతలు గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అదే పెద్దలు ఆ భూములను అస్మదీయులకు కట్టబెట్టేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నెల మొదట్లోనే ప్రభుత్వం దసపల్లా భూములపై నివేదిక కోరగా కలెక్టర్‌ అన్ని వివరాలు పంపించారు. ఈ విషయం బయటకు రావడంతో మరోసారి వివాదం చెలరేగింది. ప్రభుత్వం డైలామాలో పడింది. చివరకు పార్టీలో కీలక నేత ప్రమేయంతో కలెక్టర్‌ రాసిన నివేదికను సీసీఎల్‌ఏ పరిశీలించి, రెండు రోజుల క్రితం కొత్త ఆదేశాలు జారీచేశారు. ఈ భూముల విషయంలో అడ్వకేట్‌ జనరల్‌, న్యాయ విభాగంతో చర్చించిన తరువాత హైకోర్టు, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన భూములపై కలెక్టర్‌ నిర్ణయమే కీలకంగా మారనుంది. ఇంతకు ముందు పనిచేసిన కలెక్టర్లలా ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని, న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తామని చెబుతారా?...లేదంటే అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి...అవి ప్రైవేటుపరం కావడానికి అనుకూలంగా వ్యవహరిస్తారా? అనేది తేలాల్సి ఉంది. 

దసపల్లా భూముల్లోనే నాడు బ్రిటీష్‌ ప్రభుత్వం సర్‌ క్యూట్‌ అనే అధికారికి ఓ బంగ్లా నిర్మించింది. ఆ తరువాత అదే ప్రభుత్వ అతిథిగృహంగా మారింది. అది ఇప్పటికీ ప్రభుత్వ అతిథిగృహం (సర్క్యూట్‌ హౌస్‌)గా కొనసాగుతోంది. ఇప్పుడు వీటిని ప్రైవేటుకు కట్టబెడితే..సర్క్యూట్‌ హౌస్‌, వెనుక జీవీఎంసీ వాటర్‌ ట్యాంకులు, మధ్యలో 100 అడుగుల రహదారి కూడా వారి ఖాతాలోకి వెళ్లిపోతాయి.

Updated Date - 2022-09-30T06:33:49+05:30 IST