ఈ కామర్స్‌ సైట్ల నుంచి నేరగాళ్ల చేతుల్లోకి డేటా

ABN , First Publish Date - 2022-06-23T17:04:33+05:30 IST

ఈ-కామర్స్‌ సైట్లలోని వినియోగదారుల డేటా బహిరంగ మార్కెట్లో అమ్ముడవుతోంది. ఈ సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల

ఈ కామర్స్‌ సైట్ల నుంచి నేరగాళ్ల చేతుల్లోకి డేటా

బహుమతి గెలుచుకున్నారంటూ మోసాలు  

ఆన్‌లైన్‌ షాపింగ్‌తో జర భద్రం : పోలీసులు


హైదరాబాద్‌ సిటీ: ఈ-కామర్స్‌ సైట్లలోని వినియోగదారుల డేటా బహిరంగ మార్కెట్లో అమ్ముడవుతోంది. ఈ సైట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు సైబర్‌ నేరగాళ్లు డబ్బు చెల్లించి పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌, ఆర్డర్‌ చేసిన వస్తువులతోపాటు కస్టమర్స్‌ డేటా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల మన్ననలు పొందిన ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్లలో డేటాను డెలివరీ పాయింట్స్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత టెలీకాలర్స్‌తో కస్టమర్లకు ఫోన్‌ చేయిస్తున్నారు. పలానా సైట్‌ ద్వారా మీరు వస్తువు కొనుగోలు చేశారు. కంపెనీ తీసిన లక్కీడి్‌పలో ఖరీదైన కారు, అందుకు సమానమైన నగదు బహుమతి గెలుచుకున్నారంటూ నమ్మిస్తున్నారు. జీఎస్టీ, ఇన్సూరెన్స్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ ఇలా వివిధ చార్జీలు చెల్లించాలని, అవన్నీ తిరిగి రిఫండ్‌ చేస్తామంటూ బురిడీ కొట్టించి లక్షల రూపాయలు కాజేసి ఫోన్‌లు స్విచ్చాఫ్‌ చేస్తున్నారు.


ఇలా దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసంచేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా వందలమందిని మోసం చేసి రూ. 2 కోట్లు కాజేసిన  జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ సైబర్‌ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తరహా మోసాలు మళ్లీ జరుగుతుండడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అంటున్నారు.


యువకుడి నుంచి రూ.3.21 లక్షలు కాజేత

కూకట్‌పల్లికి చెందిన యువకుడు ఆన్‌లైన్‌లో రూ. 432 పెట్టి టీషర్టు ఆర్డర్‌ చేశాడు. రెండు రోజుల్లో డెలివరీ చేస్తామంటూ మెసేజ్‌ వచ్చింది. తర్వాత ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను మాట్లాడుతున్నానంటూ ఫోన్‌ వచ్చింది. కంగ్రాట్స్‌.. మీరు కస్టమర్స్‌ లక్కీడి్‌పలో రూ. 6.20 లక్షలు బహుమతి గెలుచుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్న కస్టమర్స్‌ నుంచి ప్రతిరోజూ లక్కీడిప్‌ ద్వారా ఒకరిని ఎంపికచేసి వారు గెలుచుకున్న ప్రైజ్‌ మనీ బహుమతిగా ఇస్తున్నామంటూ నమ్మించారు. హెచ్‌ఎ్‌సబీసీ బ్యాంకు చెక్‌ను వాట్సా్‌పలో పంపి బహుమతి గెలుచుకున్నది నిజమేనని బురిడీ కొట్టించారు. బహుమతి డబ్బులు మీ ఖాతాలో జమ చేయాలంటే పాన్‌, ఆధార్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతా వివరాలు కావాలంటూ వాటిని వాట్సాప్‌ ద్వారా తెప్పించుకున్నారు. జీఎస్టీ, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సూరెన్స్‌ చార్జీలు చెల్లించాలంటూ దశలవారీగా రూ. 3.21 లక్షలు తీసుకున్నారు. అవి తిరిగి మీ ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. రోజులు గడుస్తున్నా డబ్బులు ఖాతాలో జమ కాకపోగా.. టీడీఎస్‌ పేరుతో మరో రూ. 1.09 లక్షలు చెల్లించాలని, అవి కూడా రిఫండ్‌ చేస్తామన్నారు. బాధితుడికి అనుమానం వచ్చి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


కారు గెలుచుకున్నారంటూ..

సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌లో రూ.228తో ఆలు కట్టర్‌ (పొటాటో కట్టర్‌) కొనుగోలు చేసింది. నెలరోజుల తర్వాత ఆమెకు మెసేజ్‌ వచ్చిం ది. మీరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిందుకు లక్కీడ్రాలో టాటా నెక్సాన్‌ కారు గిఫ్ట్‌గా గెలుచుకున్నారంటూ మెసేజ్‌ పంపారు. కారు తీసుకోవడానికి అందులో ఉన్న టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయమని ఉంది. యువతి ఫోన్‌ చేయగా.. సత్యప్రకాశ్‌ అలియాస్‌ సందీప్‌ పాశ్వాన్‌, మాణిక్‌ చంద్‌ పాశ్వాన్‌ ఆమెను మాయమాటలతో బురిడీ కొట్టించారు. కారు తీసుకోవడానికి కొంత నగదు చెల్లించాలని, తర్వాత తిరిగి చెల్లిస్తామని నమ్మించారు. దశలవారీగా రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ. 6,500, ఆర్టీవో చార్జీల పేరుతో 18,500, జీఎస్టీ పేరుతో రూ. 31,000, ఇన్సూరెన్స్‌ అంటూ రూ. 74,000, ట్రాన్స్‌పోర్టేషన్‌ పేరుతో రూ. 50,000, డెలివరీ కోసం డ్రైవర్‌ చార్జీ అంటూ రూ. 25,000 వేలు కాజేశారు. డబ్బులు పంపించే వరకు రెండు రోజులు పగలు, రాత్రి ఒకరి తర్వాత ఒకరు ఫోన్‌ చేశారు. కారు పంపించకపోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2022-06-23T17:04:33+05:30 IST