వ్యాక్సిన్‌ పడితేనే డేటింగ్‌!

ABN , First Publish Date - 2021-04-28T05:30:00+05:30 IST

ఇప్పుడంతా కరోనా కాలం. చేయి చేయి కలపలేం... మాస్క్‌ లేకుండా మాట్లాడలేం. మనిషిని మనిషి ముట్టుకోవాలంటేనే ‘చచ్చేంత’ భయం. అది బయటవారినైనా... మనసుకు నచ్చినవారైనా భౌతిక దూరం

వ్యాక్సిన్‌ పడితేనే డేటింగ్‌!

ఇప్పుడంతా కరోనా కాలం. చేయి చేయి కలపలేం... మాస్క్‌ లేకుండా మాట్లాడలేం. మనిషిని మనిషి ముట్టుకోవాలంటేనే ‘చచ్చేంత’ భయం. అది బయటవారినైనా... మనసుకు నచ్చినవారైనా భౌతిక దూరం తప్పనిసరైపోయిన దుస్థితి. ఇప్పటికే ‘లిప్‌ లాక్‌’లు తగ్గి... ‘లాక్‌డౌన్లు’ ఎంటరయ్యి ఏడాది దాటిపోయింది. ప్రేమ జంటలు... కొత్త జతగాడిని కోరుకొనేవారు... ఓ ముద్దూ ముచ్చట లేకుండా ఎన్ని రోజులని విరహ తాపంతో నెట్టుకొస్తారు..! అందుకే మళ్లీ డేటింగ్‌ యాప్‌ల్లో బిజీ అయిపోయారు. సరైన జతగాడిని వెతుక్కొనే పనిలో సరికొత్త నిబంధనలనూ తీసుకొచ్చారు. అదేంటంటే... ‘వ్యాక్సిన్‌ వేయించుకొంటేనే డేటింగ్‌’ అని! లండన్‌కు చెందిన ‘ఎలేట్‌ డేట్‌’ తాజా పరిశోధన ప్రకారం... వ్యాక్సిన్‌ తీసుకోనివారితో డేటింగ్‌ చేసేది లేదని 60 శాతం మంది  తేల్చి చెప్పేశారట! మెచ్చినవారితో సరదాగా డిన్నర్‌కు వెళ్లాలన్నా... సహజీవనం చేయాల నుకున్నా... లేదంటే జీవిత భాగస్వామి కోసం వెతకాలన్నా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారితోనట! డేటింగ్‌ యాప్స్‌లో ఈ ట్రెండ్‌ ఇటీవల అనూహ్యంగా 238 శాతం పెరిగిందట! 


దీంతో ‘టిండర్‌, ఓకే కుపిడ్‌, కాఫీ మీట్స్‌, బంబుల్‌’ తదితర చాలా డేటింగ్‌ యాప్స్‌ యూజర్స్‌ అభిరుచులు, ఆశిస్తున్న అంశాల్లో ‘వ్యాక్సిన్‌’కు కూడా చోటు కల్పించాయి. అంటే ‘వ్యాక్సిన్‌ తీసుకున్నారా..? తీసుకోవాలనుకొంటున్నారా? లేదా?’ అనే డ్రాప్‌డౌన్‌ తరహా బాక్స్‌లు జతచేసినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘గార్డియన్‌’ తన కథనంలో పేర్కొంది. ‘‘అరవై శాతానికి పైగా యూజర్లు వ్యాక్సిన్‌ వేసుకొంటేనే డేటింగ్‌కు సై అంటున్నట్టు మా పరిశోధనలో తేలింది. ‘వ్యాక్సినేషన్‌, యాంటీబీడీస్‌, షాట్స్‌’... పదాలు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరాయి’’ అంటారు ‘ఎలేట్‌ డేటింగ్‌’ యాప్‌ యజమాని సంజయ్‌ పాంచాల్‌. 


అమెరికాలో అయితే సిరంజి ఎమోజీ బాగా ట్రెండ్‌ అవుతుందట. ఇక ‘డబుల్‌ డోస్‌’ వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు మీ ప్రొఫైల్‌లో ఉంటే ప్రపోజల్స్‌ కూడా రెట్టింపు స్థాయిలో వస్తున్నాయట. అలాగే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న యూజర్లకు లైక్‌లు కూడా అధికంగా ఉంటున్నాయని ‘ఓకే కుపిడ్‌’ సంస్థ తెలిపింది. అసలు వేక్సినే వద్దనేవారి వంక ఎవరూ చూడడంలేదట. మొత్తంమీద డేటింగ్‌ యాప్స్‌ యూజర్లు ‘వ్యాక్సిన్‌ వేసుకున్నావారు’... ‘వేసుకోనివారు’గా విడిపోయారు. మరి మీరు?

Updated Date - 2021-04-28T05:30:00+05:30 IST