బీజేపీలో చేరిన వివాదాస్పద మౌలానా కోడలు

ABN , First Publish Date - 2022-01-30T22:19:30+05:30 IST

హిందువులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మౌలానా

బీజేపీలో చేరిన వివాదాస్పద మౌలానా కోడలు

లక్నో : హిందువులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మౌలానా తౌకీర్ రజా ఖాన్ కోడలు నిడా ఖాన్ ఆదివారం బీజేపీలో చేరారు. బీజేపీ పరిపాలనలో మాత్రమే ఉత్తర ప్రదేశ్‌ ముస్లిం మహిళలకు రక్షణ ఉందని ఆమె చెప్పారు. ఆమె ట్రిపుల్ తలాక్ బాధితురాలనే విషయం గమనార్హం. గతంలో ఆమె మాట్లాడినపుడు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరి అని చెప్పిన సంగతి తెలిసిందే. 


నిడా ఖాన్ ఆదివారం లక్నోలో బీజేపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడటం వల్ల కీలక మలుపు వచ్చిందని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చట్టం చేసిందని, ఈ ఎన్నికల్లో ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. 


కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ‘‘నేను మహిళను, పోరాడగలను’’ అనే నినాదాన్ని వినిపిస్తోందని, అయితే మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. అయితే బీజేపీ మహిళల రక్షణకు హామీ లభించేవిధంగా మహిళా సాధికారత కోసం కృషి చేసిందని చెప్పారు. అందుకే తాను బీజేపీలో చేరానని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2022-01-30T22:19:30+05:30 IST