అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు! అక్రమంగా అస్మదీయులకు కొలువులు!

Published: Fri, 27 May 2022 13:06:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు! అక్రమంగా అస్మదీయులకు కొలువులు!

పారిశుధ్య కార్మికురాలిగా నిర్మల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ కూతురు

అల్లుడిది కూడా అదే పోస్టు

అక్రమంగా అస్మదీయులకు కొలువులు

జిల్లా ఉపాధి అధికారి లిస్టు బేఖాతరు

పదోన్నతులు వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యోగాలకు డిమాండ్‌

ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో వసూలు


నిర్మల్‌ (ఆంధ్రజ్యోతి): అది నిర్మల్‌ మునిసిపాలిటీ..! లక్షన్నర జనాభాతో గ్రేడ్‌-2 కేటగిరీకి చెందిన ఆ పురపాలికకు చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌..! ఆయన రోజూ మునిసిపాలిటీకి కారులో వస్తారు..! కానీ, అతని కూతురు రమ్య(పోస్టుగ్రాడ్యుయేట్‌), ఆమె భర్త రాజేందర్‌(పదోతరగతి విద్యార్హత) మాత్రం అదే మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులు..! నిజానికి చైర్మన్‌ కారులో వస్తుంటే.. వీళ్లిద్దరూ రోడ్లు ఊడ్వాలి..! కానీ, అలా జరగదు. కారణం..! వాళ్లిద్దరూ అడ్డదారిలో పర్మినెంట్‌ కొలువులు కొట్టేశారు. తమ బదులు వేరొకరితో పనిచేయిస్తూ.. నెలకు రూ. 24 వేల చొప్పున సర్కారీ జీతం తీసుకుంటున్నారు. రమ్య, రాజేందర్‌ ఇద్దరే కాదు.. ఇటీవల మునిసిపాలిటీలో జరిగిన పారిశుధ్య కార్మికుల(పర్మినెంట్‌) నియామకాల్లో.. 44 పోస్టులకు గాను.. 43 మంది ఈ బాపతులోనే ఉద్యోగాలు కొట్టేశారు. అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికార పార్టీ నాయకులు ఒక్కో పోస్టును రూ. లక్షల్లో బేరం పెట్టి మరీ అడ్డదారి నియామకాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కాసుల కక్కుర్తితో ఏడోతరగతి విద్యార్హతలున్న వారితో భర్తీ చేయాల్సిన పోస్టులను.. పట్టభద్రులు, ఫార్మసీ చదువులు చదివిన వారితో నింపేశారు. నియామకాల్లో నిబంధనలను పూర్తిగా అటకెక్కించినా.. జిల్లా కలెక్టర్‌ ఆమోదముద్ర వేయడం గమనార్హం..! పురపాలక సంఘాల్లో పారిశుధ్య కార్మికులకు డ్రెస్‌కోడ్‌ ఉంటుంది. రోజూ వీధులను శుభ్రపరచడం, డ్రైనేజీలను క్లీన్‌ చేయడం, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం వారి విధులు. తాజాగా నియమితులైన పట్టభద్ర పారిశుధ్య కార్మికులు మాత్రం ఆ విధులను నిర్వర్తించడం లేదు. తమ బదులు, ఇతరులతో పనికానిస్తున్నారు. కూర్చుని నెలకు రూ. 24 వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారు. విధులకు హాజరైనట్లుగా రోజూ పారిశుద్ధ్య విభాగం రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. ఇన్ని లక్షలు కుమ్మరించి పారిశుధ్య కార్మికుల కొలువులను కొనుక్కోవడానికి కారణాలున్నాయి.


పదోన్నతులొస్తాయనే..

పారిశుధ్య కార్మికులు, అటెండర్లు, డ్రైవర్లు.. ఇలా పలు కేటగిరీల కొలువులను ‘తెలంగాణ లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ ప్రకారం భర్తీ చేస్తారు. రెండేళ్ల ప్రొబేషనరీ తర్వాత.. మరో సంవత్సరం సర్వీసును పూర్తిచేసుకుంటే.. విద్యార్హతలను బట్టి పదోన్నతులు ఇవ్వొచ్చని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంటే.. ఇప్పుడు పారిశుధ్య కార్మికులుగా ఎంపికైన వారు మూడేళ్ల తర్వాత శానిటరీ విభాగంలో ‘జవాన్‌’గా పదోన్నతి పొందే అవకాశాలుంటాయి. ఈ ఒక్క కారణంతోనే తాజా నియామకాల్లో ఎంపికైన వారు లక్షలు గుమ్మరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మునిసిపల్‌ చైర్మన్‌, కొందరు కౌన్సిలర్లు, నియోజకవర్గానికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు తమ వారికి పర్మినెంట్‌ ఉద్యోగం దొరుకుతుందనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. ఒక ఇంటికి చెందిన ఇద్దరికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా.. మునిసిపల్‌ చైర్మన్‌ కూతురు రమ్య, అల్లుడు రాజేందర్‌కు ఏకకాలంలో కొలువులు దక్కడం గమనార్హం. కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేసిన రమ్య.. సుమారు రూ.30 వేల వేతనాన్ని వదులుకుని.. పర్మినెట్‌ కొలువు కావడంతో పారిశుధ్య కార్మికురాలి పోస్టును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అటు రాజేందర్‌కు కూడా నగరంలో మొబైల్‌షాప్‌ ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం ఉన్నా.. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీ్‌సలో కార్మికుడి పోస్టును ఎంచుకున్నారు.


అంతటా నిబంధనలకు నీళ్లు

‘తెలంగాణ లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ ప్రకారం ఈ పోస్టుల నియామకానికి జిల్లా ఉపాధి అధికారి నుంచి జాబితా తెప్పించాలి. ఆయన రోస్టర్‌ ప్రకారం సూచించిన వారికే కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు చేసి, నియామకపత్రాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఎంత మందిని ఎంపిక చేశారో పేర్కొంటూ.. మునిసిపాలిటీ జిల్లా ఉపాధి అధికారికి ఓ లేఖను పంపాలి. ఆయన సిఫారసుతో జిల్లా ట్రెజరీ విభాగం ఎంపికైన వారికి ఎంప్లాయీ కోడ్‌ ఇచ్చి, నెలనెలా వేతనాలను విడుదల చేయాల్సి ఉంటుంది. నిర్మల్‌ మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికుల నియామకాల్లో జిల్లా ఉపాధి అధికారి ఇచ్చిన జాబితాను బుట్టదాఖలు చేశారు. అస్మదీయుల జాబితాను కలెక్టర్‌కు పంపారు. ఆయన దానికి ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత జిల్లా ఉపాధి అధికారికి వివరాలు వెల్లడించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ట్రెజరీ నుంచి ఎంప్లాయీ కోడ్‌ ఇప్పించారు. మూడు నెలలుగా వేతనాలు కూడా విడుదలవుతున్నాయి. అసలు ఎంతమందిని నియమించారో చెప్పాలంటూ మునిసిపల్‌ కమిషనర్‌కు జిల్లా ఉపాధి అధికారి లేఖలు రాస్తున్నా.. దానికి స్పందన శూన్యం..!


ఈ ప్రశ్నలకు బదులేది?

  • ఇంతటి కుంభకోణం వెలుగులోకి వచ్చినా.. ఇంకా జిల్లా కలెక్టర్‌గానీ, మునిసిపల్‌ అధికారులు గానీ క్రిమినల్‌ కేసులు ఎందుకు నమోదు చేయలేదు?
  • ప్రభుత్వాన్ని మోసగించిన అభియోగాలపై మునిసిపల్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోరా?
  • జిల్లా ఉపాధి అధికారి ఆమోదముద్ర లేకుండానే.. ట్రెజరీ నుంచి నెలనెలా జీతాలు ఎలా విడుదలవుతున్నాయి? ట్రెజరీ సిబ్బంది/అధికారుల పాత్రపై చర్యలుండవా?
  • అడ్డదారిలో కొలువులు పొందినవారిని అనర్హులుగా ఎందుకు ప్రకటించడం లేదు?


బహిరంగ వేలంలా ఉద్యోగాలు అమ్ముకున్నారు

మంత్రి సమక్షంలోనే బేరాలు: ఏలేటి

నిర్మల్‌ మున్సిపాలిటీలో ఇటీవల భర్తీ చేసిన 43 ఉద్యోగాలను బహిరంగ వేలంలా అమ్ముకున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలోనే ఈ ఉద్యోగాల అక్రమ నియామకాలకు బేరసారాలు సాగాయని మండిపడ్డారు. మంత్రి అల్లోల, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌కు నిర్మల్‌ జిల్లా నిరుద్యోగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు. అసైన్డ్‌, ప్రభుత్వ భూములు, రాళ్లు, గుట్టలు, ఇసుకలాంటి ప్రకృతి వనరులను దోచుకున్నది చాలక.. ఇప్పుడు మంత్రి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఉద్యోగాల నియామకం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి, మున్సిపల్‌ చైర్మన్‌  రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా భర్తీ చేసిన 43 ఉద్యోగాలను వెంటనే రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి అర్హులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా శుక్రవారం నిర్మల్‌ కలెక్టరేట్‌ ముందు దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.

అడ్డదారిలో పోస్టులు ఊడ్చేశారు! అక్రమంగా అస్మదీయులకు కొలువులు!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.