Woman Mistake: తల్లికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న కూతురికే షాకింగ్ అనుభవం.. నెలజీతాన్ని పొరపాటున వేరే వాళ్లకు పంపించిన యువతి.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-05T16:36:19+05:30 IST

ఒక చిన్న పొరపాటు ఓ మహిళకు కన్నీళ్ళు పెట్టించింది. అసలు ఆమె చేసిన తప్పేంటి??

Woman Mistake: తల్లికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న కూతురికే షాకింగ్ అనుభవం.. నెలజీతాన్ని పొరపాటున వేరే వాళ్లకు పంపించిన యువతి.. చివరకు..

కష్టపడి సంపాదించే డబ్బు మీద అందరికీ ప్రేమ ఉంటుంది. పది రూపాయలు ఎక్కడైనా జారిపోతే ఎంతో బాధపడతాం. అలాంటిది ఒక మహిళ నెలంతా కష్టపడి సంపాదించిన  డబ్బు మొత్తం తనకు దూరమైతే పాపం ఆ మహిళ  ఎంత బాధపడుతుంది?? ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు ఆమెకు కన్నీళ్ళు పెట్టించింది. అసలు ఆమె చేసిన తప్పేంటి?? ఆమె ఎవరు??


మలేషియాకు చెందిన ఫహదా అనే మహళ కొత్తగా ఉద్యోగంలో చేరి నెల రోజుల పని పూర్తి చేసింది. ఆమె నెల జీతంగా కొంత మొత్తం డబ్బును చెక్కు రూపంలో ఇచ్చారు. మొదటి నెల సంపాదనను తన తల్లి అకౌంట్ కు జమచేసి ఆమెను ఆశ్చర్యపరచాలని అనుకుంది. అయితే ఆమె అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. ఆమె తన తల్లికి డబ్బు పంపాలనుకుని పొరపాటున ఇంకొక వ్యక్తి ఖాతాకు డబ్బును పంపేసింది. అలా పంపేముందు ఆమె డిపాజిట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను క్రాస్ చెక్ చేయకపోవడమే ఆమె కొంప ముంచింది. ఆమె తన తల్లికే పంపానని అనుకుని డిపాజిట్ చేసిన రశీదు పేపర్ ను తన తల్లికి పంపింది. అయితే ఆ రశీదు చూసిన ఆమె తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది. "నా అకౌంట్ లో ఎలాంటి డబ్బు పడలేదు, నువ్వు వేరే వారి అకౌంట్ కు డబ్బు జమచేసినట్టు రశీదులో ఉంది" అనే చావు కబురును మెల్లగా కూతురుకు చెప్పింది. ఆ విషయం వినగానే ఫహాదా చాలా ఖంగారు పడిపోయింది. 


అయితే ఆ అమ్మాయి పొరపాటున పంపేసిన మరొక ఖాతా గురించి వివరాలు తెలుసుకుని అతని ఫోన్ నంబర్ సంపాదించిన ఆ అమ్మాయి తల్లి ఆ నంబర్ ను తన కూతురుకు ఇచ్చింది. ఆ అమ్మాయి అవతల వ్యక్తితో ఫోన్ లో మట్లాడినపుడు ఆమెకు అతని నుండి తల తిరిగిపోయే సమాధానం ఎదురయ్యింది. "పొరపాటున డబ్బు పంపేశాను ఆ డబ్బు తిరిగి ఇవ్వండి ప్లీజ్" అంటూ ఆమె ప్రాధేయపడి అడగ్గా అవతలి వ్యక్తి "మీరు పొరపాటున నాకు పంపిన డబ్బును నేను తిరిగి పంపను... మీరు దాన్ని నాకు సహాయం చేసానని అనుకోండి...." అంటూ సమాధానమిచ్చాడు.  అతని సమాధానమే ఫహదాను కన్నీళ్ళు పెట్టుకునేలా చేసింది.


ఫహాదా ఒక టిక్-టాక్ వీడియోలో జరిగిన విషయమంతా చెబుతూ కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తే అందరి మనసులూ బాధతో నిండిపోతాయి. కానీ  వీడియో చివరిలో మాత్రం అవతలి వ్యక్తి తనను ఆటపట్టించడానికి అలా అన్నాడని, ఫోన్ కాల్ తరువాత అతను డబ్బు పంపుతున్నట్టు మెసేజ్ పంపాడని ఫహాదా చెప్పడంతో హమ్మయ్య అనుకోవడం అందరి వంతు అవుతుంది. పాపం పోగొట్టుకున్న డబ్బు తిరిగి చేతికి అందేవరకు ఫహాదా, ఆమె తల్లి ఇద్దరూ ఎంత ఆందోళన పడి ఉంటారో!! డబ్బు ఎంత చిన్న మొత్తమయినా పోగొట్టుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది??


అందుకే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త చాలా అవసరం అనేది.

Updated Date - 2022-09-05T16:36:19+05:30 IST