
కువైత్ సిటీ: కువైత్‌లో తాజాగా జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు కూతుళ్లు కన్నతల్లినే అత్యంతదారుణంగా హతమార్చారు. తల్లిని చంపి ఏకంగా తలను మొండెం నుంచి వేరుచేసేశారు. అనంతరం తలను ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఇంటి బయట చెత్తడబ్బాలో పడేశారు. కువైత్‌లోని దోహా ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోహాలో నివాసం ఉండే ఓ కుటుంబంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
తల్లితో ఒక చిన్న విషయమై ఇద్దరు కూతళ్లకు తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది. ఇంట్లో కూరగాయలు కొయడానికి వినియోగించే కత్తితో మొదట కన్నతల్లిని కూతుళ్లు ఇద్దరు విచక్షణరహితంగా పొడిచారు. దాంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అదే కత్తితో ఆమె తలను మొండెం నుంచి వేరుచేశారు. అనంతరం ఓ ప్లాస్టిక్ కవర్‌లో తలను చుట్టి ఇంటి బయట ఉన్న చెత్తడబ్బాలో పడేశారు. ఈ విషయం కాస్తా చుట్టుపక్కల వారికి తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అసలు వారిద్దరూ కన్నతల్లిని ఇంతదారుణంగా హతమార్చడం వెనుక కారణమెంటనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, ఈ ఘటన కువైత్ వ్యాప్తంగా ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసిందని పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి