ముఖ్య అతిథిగా బ్యాంకు దోపిడీదారు!

ABN , First Publish Date - 2022-01-18T10:39:02+05:30 IST

ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌ వివాదంలో చిక్కుకుంది. బ్యాంకు దోపిడీదారుగా అపఖ్యాతిపాలైన నార్వేకు చెందిన డేవిడ్‌ టోస్కాను ఈ టోర్నీ..

ముఖ్య అతిథిగా బ్యాంకు దోపిడీదారు!

టాటా స్టీల్‌ చెస్‌లో వివాదం


విక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌ వివాదంలో చిక్కుకుంది. బ్యాంకు దోపిడీదారుగా అపఖ్యాతిపాలైన నార్వేకు చెందిన డేవిడ్‌ టోస్కాను ఈ టోర్నీ మ్యాచ్‌ల విశ్లేషణకు అతిథిగా ఆహ్వానించడం వివాదానికి ఆజ్యం పోసింది. నార్వేకు చెందిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌లాంటి టాప్‌స్టార్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఈనెల 14న మొదలైంది. ఈనెల 30న ముగియనున్న ఈ టోర్నీకి ప్రసారదారైన నార్వే టీవీ ఒక్కో సెలెబ్రిటీని ఒక్కో రోజు తమ షోకు అతిథిగా ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం, మంగళవారం జరిగే రౌండ్లకు డేవిడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.


అయితే, 2004లో నార్వేలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడి వెనక ప్రధాన సూత్రధారైన డేవిడ్‌.. ఈ కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అలాంటి నేరచరితుడిని అంతర్జాతీయ టోర్నీ మ్యాచ్‌ల విశ్లేషణకు అతిథిగా ఆహ్వానిస్తారా అంటూ చెస్‌ వర్గాలు మండిపడుతున్నాయి. కాగా స్వతహాగా చెస్‌ ఆటగాడైన డేవిడ్‌ గతంలో నార్వే అండర్‌-14 చాంపియన్‌షిప్‌లో నాలుగోస్థానంలో నిలిచాడు. అంతేకాదు.. యుక్త వయసులో అతడు అనేక చెస్‌ టైటిళ్లు కూడా గెలిచాడట. ఈ కారణంతోనే అతడిని ఆహ్వానించినట్టు నిర్వాహకులు తప్పును సమర్ధించుకోవడం గమనార్హం. 

Updated Date - 2022-01-18T10:39:02+05:30 IST