పక్షం రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-09-17T06:20:24+05:30 IST

పక్షం రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌

పక్షం రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌
నవాబుపేటలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

- విపత్కర పరిస్థితుల్లోనూ పథకాలు నడిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది.. 

- రాష్ట్రంలో గాడిన పడుతున్న ఆర్థికవ్యవస్థ

- పంచాయతీ రాజ్‌ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

లింగాలఘణపురం సెప్టెంబరు 16 : కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు 15 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నిర్దేశించారని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నవాబుపేటలో గురువారం జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కారణంగా తెలంగా ణ ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుబంధు కొనసాగింపుపై మాకు కాస్త అనుమానాలున్నప్పటికీ ముఖ్యమంత్రి వాటిని పటాపంచలు చేసి, రూ.10 వేలకోట్లను రైతులకు ఇచ్చారన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 18 ఏళ్లు పైబడ్డ రెండు కోట్లమందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని.. ఇంకా 2.80 కోట్ల మందికి ఇవ్వాల్సి ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. 15 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి ప్రతీ ఇంటికి 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లుగా డోర్‌స్టిక్కర్లను అతికించేందుకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పని చేస్తోందన్నారు. 

జనగామ జిల్లాలో 18 ఏళ్లు పైబడ్డవారు 3.89 లక్షల మంది ఉండగా, 1.61 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నారు. వారిలో 48 వేల మంది సెకండ్‌ డోస్‌ కూడా పూర్తి చేసుకున్నారన్నారు. 

ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌, డీపీవో రంగాచారి, డీఆర్‌డీవో రాంరెడ్డి, స్పెషలాఫీసర్‌ లత, సర్పంచ్‌ బూడిద జయరాజేశ్వర్‌, ఎంపీటీసీ సిద్ధుగౌడ్‌, నాయకులు సేవెల్లి సంపత్‌, బొల్లంపల్లి నాగేందర్‌ పాల్గొన్నారు. 

అందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి.. 

పాలకుర్తి : కొవిడ్‌ బారినపడి అనేకమంది సన్నిహితులు, బంధువులు మృతి చెందితే రక్తసంబంధీకులు కూడా దగ్గరకు రాలేని సమయంలో, దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తొర్రూరులో మెగా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్‌ శివలింగయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నివారించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్నీ గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, స్థానిక సంస్థల సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌వేసి, వారి జాబితా తయారు చేయాలని అన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ మహేందర్‌, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచు నాయిని మల్లారెడ్డి, తహసీల్దార్‌ విజయభాస్కర్‌, ఎంపీడీవో అశోక్‌కుమార్‌, ఎంపీవో దయాకర్‌రావు, డాక్టర్‌ యామిని, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-09-17T06:20:24+05:30 IST