ltrScrptTheme3

అబ్బురపరచిన ఆర్‌కె దౌత్య‘యుద్ధం’

Oct 17 2021 @ 00:51AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో 2004లో మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీ చర్చల తరువాత రామకృష్ణ (ఆర్‌కె) గురించి తెలియనివారుండరు. తెలుగు సమాజంలోనే కాదు దేశమంతటా ఆ చర్చలు ఎంతో సమర్థంగా నిర్వహించిన విప్లవోద్యమ నాయకుడుగా ఆయన గుర్తింపు పొందారు. అప్పటి మీడియా పరిశీలన ప్రకారం మధ్యవర్తిత్వం వహించిన కమిటీ ఫర్‌ కన్‌సర్డ్న్‌ సిటిజన్స్‌ సభ్యులు, దాని కన్వీనర్‌ ఎస్‌ఆర్‌ శంకరన్‌ని అలా ఉంచి తమ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పిన నాయకుడుగా ఆర్‌కె గుర్తింపు పొందాడు. ఒకటి, రెండు విషయాలను ఇక్కడ ప్రస్తావించాలి. మొదటిది ప్రభుత్వం తరఫున హోంమంత్రి జానారెడ్డి సిపిఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌కు మాత్రమే చర్చలకు ఆహ్వానం పంపారు. ఈ చర్చలు విప్లవోద్యమ పార్టీలతో జరగాలని, తమతో పాటు సిపిఐఎంఎల్‌ జనశక్తి నాయకత్వం కూడా వస్తుందని హోంమంత్రికి ఎ.పి. పీపుల్స్‌వార్‌ పార్టీ కార్యదర్శిగా రామకృష్ణ లేఖ రాశారు. తీరా అక్టోబర్‌ 11వ తేదీన నల్లమల నుంచి గుత్తికొండ బిలం మీదుగా హైదరాబాద్‌ చేరుకుని తమకు వసతి కల్పించిన మంజీరా గెస్ట్‌హౌస్‌లో జనశక్తి నాయకుడు అమర్‌, ఆయన సహ ప్రతినిధి రియాజ్‌లతో పాటు ఎఓబి పీపుల్స్‌వార్‌ కార్యదర్శి సుధాకర్‌, ఉత్తర తెలంగాణ పీపుల్స్‌వార్‌ ప్రతినిధి గణేశ్‌లతో అక్టోబర్‌ 12న నిర్వహించిన మీడియా కాన్ఫరెన్సులో తమది ఇప్పుడు సిపిఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ కాదని, అప్పటికే (సెప్టెంబరు 21నే) తమ పార్టీ ఎంసిసితో కలిసి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడిందని, తాము చర్చల్లో జనశక్తితో కలిసి మావోయిస్టు పార్టీగానే పాల్గొంటామని ప్రకటించారు. హోంమంత్రితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన ఏ సందర్భంలోనూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అయినా మీడియాతో ఈ ప్రకటన చేసిన తరువాత ప్రభుత్వం నుంచి గాని, మీడియా నుంచి గాని పిసిసి నుంచి గానీ ఏ సందేహం తలయెత్తలేదు. ఏ ప్రశ్నా రాలేదు. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.అరవిందరావు బహుశా పదవీ విరమణ చేసిన తర్వాత అనుకుంటాను ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో మాట్లాడుతూ పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పార్టీగా ఏర్పడడం వల్ల దానికి అఖిల భారత పార్టీ గుర్తింపు వచ్చినట్లయిందని, కనుక అంతర్జాతీయ ఘర్షణాయుత ప్రాంతాలలో ఇరుపక్షాల మధ్య శాంతి కోసం చేసే చర్చలకు అంతర్జాతీయ సూత్రాలను అన్వయించాల్సి వస్తుందని, అందువల్లే రెండో దశ చర్చలకు ప్రభుత్వం పిలవలేదని (ఇవే మాటలు కాకపోవచ్చు, ఈ భావం వచ్చేలా) చెప్పాడు. రెండవ అంశం చర్చలు ఆరంభం కాగానే ఒకరికి ఒకరం ఉత్తరాలు రాసుకుని ఆహ్వానం పొంది ఉన్నాము కానీ ఉభయులూ కలిసి చర్చల కోసం ఒక ఆమోదపత్రం రాసుకోవాలని ఆర్‌కె పట్టుబట్టాడు. చర్చలలో ప్రతిష్టంభన వచ్చిందని లంచ్‌ సమయానికి ఇంటెలిజెన్స్‌ వాళ్లు మీడియాకు ఉప్పందించారు. వాస్తవానికి అది మధ్యవర్తుల జోక్యం వల్ల చర్చల సమయానికే టీ కప్పులో తుఫానులా సమసిపోయింది.


చర్చల ఎజెండా మీద జానారెడ్డి ఆర్‌కెను ఉద్దేశించి... ‘రామకృష్ణగారూ మీకేం కావాలో చెప్పండి’ అని రెండు పార్టీలు ఏవి చర్చించదలచుకున్నాయో అనే భావంతోనే అడిగాడు. దానికి ఆర్‌కె ప్రతిస్పందిస్తూ ‘మేము ప్రజల ఆకాంక్షలపై, ప్రజాస్వామ్యవాదులైన మేధావుల ప్రమేయం వల్ల ఈ చర్చలకు వచ్చాం. వీటి పట్ల మాకేమీ భ్రమలు లేవు. అయితే మాకేం కావాలని గానీ, మీకేం కావాలని గానీ అడగడానికి రాలేదు. వైరి శిబిరాలుగా ఉన్న మనం ఒక బల్లకిరువైపులా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితిని కల్పించిన ప్రజల కోసం ఏమైనా చెయ్యగలమా? అని చర్చించే ప్రతిపాదనతో వచ్చాం. మిమ్మల్ని మా సిద్ధాంతాన్ని అంగీకరించమని గాని, మా ఎజెండా ప్రకారం సమస్యలు పరిష్కరించమని గానీ అడగడానికి రాలేదు. మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం, ఆదేశికసూత్రాలు, ప్రాథమిక హక్కులకు ఏమాత్రం కట్టుబడి ఉన్నారు, ఏ మేరకు పాటించబోతున్నారు అనేవి చర్చించడానికి మాత్రమే వచ్చామ’ని అన్నాడు.


నాలుగు రోజుల పాటు ఎంతో అర్థవంతంగా జరిగిన చర్చల్లో పౌర, ప్రజాస్వామిక హక్కుల గురించి ఒకరోజు, భూసంస్కరణలు గురించి మూడు రోజులు చర్చలు జరిగాయి. గతంలో జరిగిన ఉల్లంఘనలపై విచారణ కాకుండా తమ ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లా (చట్టబద్ధ పాలన) అందిస్తుందని హోంమంత్రి హామీపడ్డాడు. ఇక మూడు రోజుల పాటు భూ సంస్కరణలపై చర్చ జరిగింది. అది కూడా దున్నే వారికే భూమి అని విప్లవ పార్టీ ఎజెండాగా కాకుండా ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, ఆ కుటుంబంలోని స్త్రీ యాజమాన్యాన్ని గుర్తిస్తూ ఇవ్వాలని విప్లవ పార్టీలు ప్రతిపాదించాయి. అలాగే ప్రభుత్వ భూములు, అన్యాక్రాంత భూములు ఎన్నో కేటగిరీలు కలుపుకొని ఒక కోటి ఇరవై లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని ప్రతిపాదించాయి. భూ సంస్కరణ చర్చల్లో రామకృష్ణతో పాటు జనశక్తి రియాజ్‌ కూడా జనశక్తి పోరాట అనుభవం నుంచి చాలా ప్రతిపాదనలు చేశాడు. ఈ ప్రతిపాదనలు చేస్తూనే తమ మాటే చివరి మాట కావాలని కోరుకోవడం లేదని దీనిపై ఒక కమిషన్‌ వేయమని కె.ఆర్‌. వేణుగోపాల్‌ నాయకత్వంలో ఆదివాసీ, దళిత సమస్యలపై పనిచేస్తున్న ముప్పై పేర్లతో ఒక జాబితా ఇచ్చారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు 30 శాతం రెవెన్యూ రికార్డులు లభించడం లేదని తాము ఈ ప్రతిపాదనని పరిశీలించి రెండో దఫా చర్చలకు పిలుస్తామని అన్నారు. 


చర్చలు నాలుగు రోజుల్లో ముగిశాయి గానీ మంజీరా గెస్ట్‌హౌస్‌లో ఆర్‌కెతో సహా రెండు పార్టీల నాయకులు 11 రోజులు ఉన్నారు. ఆ పదకొండు రోజులు ముఖ్యమంత్రి ప్రజాదర్బార్‌ నిర్వహించే లేక్‌ వ్యూ గెస్ట్‌హౌస్‌కి కాక–  నిరుద్యోగం, భూమి వంటి ప్రతి సమస్య మీద రామకృష్ణకు వినతిపత్రాలతో ప్రజలు, వివిధ సంఘాలు మంజీరా గెస్ట్‌హౌస్‌కు బారులు కట్టారు. మీడియాలో పనిచేస్తున్న వారందరూ వచ్చి పలకరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, మంజీరా గెస్ట్‌హౌస్‌లో ఉండి చెన్నారెడ్డి మానవవనరుల భవనానికి వెళ్లి విప్లవకారులు అడవిలో ఉండే కాదు, మహానగరం నుంచి కూడా కర్తవ్య నిర్వహణ చేయగలరని ఆర్‌కె చూపించారు. పారదర్శక పాలనకు సంబంధించి కూడా వాళ్ల దగ్గర ఒక బ్లూప్రింటు ఉన్నదని ఎందరో మేధావులు భావించారు. చర్చల సరళిపై ప్రజాస్వామ్యవాదులు సంతృప్తి ప్రకటించారు. ఇదంతా విప్లవపార్టీల ప్రతినిధివర్గ నాయకుడు రామకృష్ణ నిర్వహించిన దౌత్యానికి ఒక గుర్తింపుగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అయితే ఈ దౌత్యమైనా ఈ చర్చలైనా ఆయన ప్రజాయుద్ధ ఆచరణలో భాగంగా చూశాడు. విప్లవోద్యమంలోని యుద్ధం – విరామంలో భాగంగా చూశాడు. ఆయనకి ఈ జ్ఞానం అంతా విప్లవోద్యమ నిర్మాణ ఆచరణ నుంచి వచ్చింది.


ఉపాధ్యాయుడైన తండ్రి, ఆయనతో సమఉజ్జీగా సమాజసేవలో పాల్గొన్న తల్లి నుంచి ఆదర్శం, విలువలు, నీతినిజాయితీలు ఆర్‌కెకు అబ్బాయి. తాను కూడా ఒక ఉపాధ్యాయుడుగా ఒక సంవత్సరం పనిచేసే నాటికే ఆర్‌కె విప్లవాచరణలో భాగం అయ్యాడు. ఆయన గుంటూరు జిల్లాలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏర్పడిన రాడికల్‌ విద్యార్థి సంఘం, ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత గుంటూరులో ఏర్పడిన రాడికల్‌ యువజన సంఘంతో కలిసి 1978లో ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపుతో ప్రజల నుంచి నేర్చుకునే ఆయన విప్లవాచరణ ప్రారంభం అయింది. 1978–85 కాలంలో విశాల విస్తృత ఆచరణగా ఈ కార్యక్రమంలోనే ఆయన 1982లో పీపుల్స్‌వార్‌ పార్టీ సభ్యుడయ్యాడు. ఇక అక్కడి నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తంగా నల్లమల విప్లవోద్యమ నిర్మాణంలో ఆయన విప్లవ నిర్మాతల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటాడు. ఈ క్రమమంతా ఆయన ‘గ్రామాలకు తరలండి’ పిలుపులో చెప్పిన నిరుపేద దళితుల ఇళ్లల్లో ఉండి, వాళ్లతో తిని వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ల జీవితాలు పంచుకోవడంతో మొదలై అది తన సహచరిని ఎంచుకునే వ్యక్తిగత నిర్ణయం దాకా ఒక సంస్కృతిగా రూపొందింది. చర్చలకు వచ్చేప్పుడు నల్లమల శ్రీశైలం దిగువ చినఆరుట్ల నుంచి గుత్తికొండబిలం మీదుగా గుంటూరు జిల్లాలో ఆయన చేసిన ప్రయాణం అంతా దారిపొడుగునా ప్రతి పల్లెలో ముఖ్యంగా దళితవాడల్లో వేలాదిగా తరలివచ్చిన ప్రజలను చూస్తే వాళ్ల హృదయాల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని ఉన్నాడో అర్థం అయింది. చర్చల కాలానికే ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి అయ్యాడు. కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ ద్వారా చర్చలను విఫలం చేయడం జనవరి 8న ప్రారంభించడంతోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోనే చర్చల నుంచి వైదొలగి చేపట్టిన ప్రతిఘటనోద్యమానికి కూడా ఆయన నాయకత్వం వహించాడు. ప్రభుత్వం నల్లమలను రక్తసిక్తం చేసింది. విప్లవోద్యమం మిగిలిన నల్లమల నాయకత్వాన్ని, శ్రేణులను వేరే ప్రాంతాలకు తరలించి ఆర్‌కెను – ఏఓబి విప్లవోద్యమానికి నాయకత్వం వహించడానికి పంపించింది. ఏఓబి విప్లవోద్యమ నిర్మాణంలో రిక్రూట్‌మెంట్ల ద్వారానూ, విప్లవ ప్రచారం ద్వారానూ ఉన్నత దశకు తీసుకుపోవడం వరకే కాకుండా ప్రజారాజ్యపాలన ఎటువంటి పారదర్శక ప్రత్యామ్నాయం ఇస్తుందో ఆయన మార్గదర్శకత్వం చూపింది. అందుకే అమరుడయ్యే దాకా కూడా ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నప్పటికీ కూడా కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఏఓబి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు నేలలో ఇవాళ ఏఓబిలో భాగమైన ఉత్తరాంధ్రలో మాత్రమే విప్లవ నిర్మాణం, పోరాటం మిగిలి ఉండడం ఆర్‌కె నాయకత్వ పరిణతికి దాఖలాలు. ఆయన గెరిల్లా యుద్ధతంత్రానికి బలిమెల సంఘటన ఒక ఉదాహరణ. రామగూడ ఎన్‌కౌంటర్‌లో దళనాయకుడైన తన కుమారుడు మున్నాను కోల్పోవడమే కాకుండా తానూ బుల్లెట్‌ గాయానికి గురయ్యాడు. యవ్వనంలోనే కిడ్నీ వ్యాధికి చేయించుకున్న చికిత్స తర్వాత ఇంతకాలానికి మళ్లీ కిడ్నీలు విఫలమై ఆయన విప్లవం కన్నతల్లి ఒడిలోనే కన్నుమూశాడు. అదే ఆర్‌కె జీవన సాఫల్యం.

సాకీ

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.