డీసీసీబీని ముంచేశారు

ABN , First Publish Date - 2022-08-19T06:38:05+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.మూడు కోట్లు నష్టం వచ్చేలా వ్యవహరించిన గత పాలకవర్గ సభ్యులతోపాటు ముగ్గురు సీఈవోలు, ఒక జనరల్‌ మేనేజర్‌ బాధ్యులుగా విచారణ అధికారి తేల్చారు.

డీసీసీబీని ముంచేశారు

పాలక వర్గం నిర్ణయంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు రూ.3 కోట్ల మేర నష్టం

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, తదితరాలు  బ్యాంకుకు చెల్లించకుండా లాభం వచ్చినట్టు చూపిన వైనం

...దాంతో రూ.కోట్లలో ఆదాయ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి

సభ్యుల పర్యటనలకు నాబార్డు ఇచ్చిన నిధులతో పాటు బ్యాంకు సొమ్ము వ్యయం

98 సంఘాల అధ్యక్షులకు బహుమతుల కోసం రూ.17 లక్షల వ్యయం

గత చైర్మన్‌ సుకుమారవర్మ, డైరెక్టర్లు, ముగ్గురు సీఈవోలు, జనరల్‌ మేనేజర్‌ బాధ్యులుగా పేర్కొంటూ విచారణ అధికారి నివేదిక

చర్యలకు సహకార శాఖ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.మూడు కోట్లు నష్టం వచ్చేలా వ్యవహరించిన గత పాలకవర్గ సభ్యులతోపాటు ముగ్గురు సీఈవోలు, ఒక జనరల్‌ మేనేజర్‌ బాధ్యులుగా విచారణ అధికారి తేల్చారు. ఈ మేరకు అప్పటి చైర్మన్‌ యు.సుకుమారవర్మతోపాటు 22 మంది డైరెక్టర్లు, రిటైర్డు సీఈవోలు పాపారావు, వీరబాబు, ప్రస్తుత సీఈవో డీవీఎస్‌ వర్మ, జనరల్‌ మేనేజర్‌ అన్నపూర్ణపై చర్యలు తీసుకోవలసిందిగా సహకార శాఖ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ ఉత్తర్వులు నాలుగు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్‌కు అందాయని తెలిసింది. వివరాలిలా ఉన్నాయి.

డీసీసీబీ చైర్మన్‌గా 2012 నుంచి 2018 వరకు ప్రస్తుత ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు సుకుమారవర్మ పనిచేశారు. ఆయనతోపాటు 22 మంది డైరెక్టర్లు ఉండేవారు. వీరి హయాంలో కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు జరిగినట్టు అప్పటి డీసీసీబీ డైరెక్టర్‌ గనగళ్ల వివేక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో టీడీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సహకార శాఖలో 51-విచారణకు డిప్యూటీ రిజిస్ట్రార్‌ గోవిందరావును నియమించారు. ఆయన డీసీసీబీలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయంలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. దీంతో నివేదిక విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే అప్పటి నివేదిక ఏమైంది?...అని కొందరు రాష్ట్ర సహకార శాఖను ప్రశ్నించడంతో 2019లో ఇచ్చిన నివేదికను సహకార శాఖ రిజిస్ట్రార్‌ బయటకు తీసి...క్రిమినల్‌, సివిల్‌ చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నివేదికలో పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే...జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులకు గ్రాట్యుటీ, సెలవు భత్యం, ఇతర పద్దుల కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ అవేవీ వారికి చెల్లించకుండా బ్యాంకుకు లాభాలు వచ్చినట్టు చూపించారు. లాభాల్లో 30 శాతం ఆదాయపన్ను శాఖకు చెల్లించడం వల్ల...బ్యాంకుకు రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విచారణలో నిర్ధారించారు. సీఈవోలుగా పనిచేసిన పాపారావు హయాంలో రూ.1.6 కోట్లు, వీరబాబు హయంలో రూ.90 లక్షలు, ప్రస్తుత సీఈవో వర్మ హయాంలో రూ.52 లక్షలు ఈ విధంగా నష్టం చేకూర్చినట్టు తేల్చారు. కాగా బ్యాంకు డైరెక్టర్లు కర్ణాటక, మహారాష్ట్ర పర్యటనకు నాబార్డు ఇచ్చిన నిధుల కంటే ఎక్కువగా ఖర్చు చేశారు. ఇలా ఖర్చు చేసిన మొత్తాన్ని బ్యాంకు భరించినట్టు విచారణలో తేలింది. అలాగే బ్యాంకు మహాజన సభ నిర్వహించినప్పుడు 98 ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులకు గిఫ్ట్‌లు ఇచ్చిన విషయం వాస్తవమేనని విచారణలో గుర్తించారు. దీనివల్ల బ్యాంకుకు రూ.17 లక్షలు నష్టం వాటిల్లిందని నిర్ధారించారు. వీటన్నింటికీ అప్పటి బ్యాంకు పాలకవర్గం, ముగ్గురు సీఈవోలదే బాధ్యత అంటూ విచారణాధికారి నివేదిక సమర్పించారు. కాగా తాజాగా విచారణ నివేదిక కలెక్టర్‌కు చేరింది. తక్షణమే క్రిమినల్‌, సివిల్‌ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా సహకార శాఖాఽధికారి ఎండీ మిల్టన్‌ను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. 


చర్యల బాధ్యత డీసీవోకు అప్పగింతపై ఆక్షేపణ

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గంలో జిల్లా సహకార అధికారి ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఉంటారు. ఇంకా బోర్డు సభ్య కార్యదర్శిగా బ్యాంకు సీఈవో వ్యవహరిస్తారు. నాబార్డు, ఆప్కాబ్‌ నుంచి ఒక్కొక్క అధికారి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అయితే డీసీసీబీలో నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో అప్పటి పాలకవర్గంలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రస్తుత విశాఖ డీసీవో ఎండీ మిల్టన్‌ ఉన్నారు. అంటే నిధుల దుర్వినియోగానికి చైర్మన్‌, 22 మంది డైరెక్టర్లతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, సభ్య కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాబార్డు, ఆప్కాబ్‌ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. ఈ నేపథ్యంలో గత పాలకవర్గం, ముగ్గురు సీఈవోలు, ఒక జీఎంపై  చర్యలు తీసుకునే బాధ్యతను ప్రస్తుత డీసీవో మిల్టన్‌ను అప్పగించడంపై సహకార శాఖలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకునే బాధ్యతను మరో అధికారికి అప్పగించాలన్న వాదన వినిపిస్తోంది. 


చర్యలపై స్టే

డీసీసీబీకి ఆర్థికంగా నష్టం తీసుకువచ్చిన వ్యవహారంలో పాలకవర్గం, ముగ్గురు సీఈవోలు, జనరల్‌ మేనేజర్‌లపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి స్టే ఇచ్చారు. ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి వినతి మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి ఆదేశాలతో ఈ స్టే ఇచ్చినట్టు చెబుతున్నారు. డీసీసీబీపై చేపట్టిన 51-విచారణకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను సహకార శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. కాగా గత పాలక వర్గంలో చైర్మన్‌, 22 మంది డైరెక్టర్లు...మొత్తం 23 మందిలో ప్రస్తుతం 20 మంది అధికార పార్టీలో ఉండగా, ఇద్దరు టీడీపీ, ఒకరు జనసేనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సూచన మేరకు స్టే విధించారనే వాదన వినిపిస్తోంది. 



Updated Date - 2022-08-19T06:38:05+05:30 IST