కంగనపై రాష్ట్రపతికి డీసీడబ్ల్యూ లేఖ

ABN , First Publish Date - 2021-11-14T20:30:28+05:30 IST

బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు ఇచ్చిన పద్మశ్రీ

కంగనపై రాష్ట్రపతికి డీసీడబ్ల్యూ లేఖ

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనుకకు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కోరారు. భారత దేశ స్వాతంత్ర్యం గురించి కంగన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు ఇచ్చిన పురస్కారాన్ని ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాశారు. 


కంగన చికిత్సకు అర్హురాలని, మహాత్మా గాంధీ, భగత్ సింగ్ ఆత్మ బలిదానాలను, వేలాది మంది త్యాగాల ద్వారా సాధించిన స్వాతంత్రాన్ని అగౌరవపరచినందుకు పురస్కారం ఇవ్వకూడదని అన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు, ఖిలాఫత్ ఉద్యమం, చంపారన్ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలను కంగన తక్కువ చేసి చూపుతున్నారని చెప్పారు. ఆమె మానసిక స్థితి సక్రమంగా లేనట్లు కనిపిస్తోందన్నారు. ఆమె తన సొంత దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఓ అలవాటుగా విషం చిమ్ముతున్నారన్నారు. దేశ అత్యున్నత పురస్కార గ్రహీతకు తగిన ప్రవర్తన ఆమెకు లేదన్నారు. ఆమె ప్రవర్తన ఈ పురస్కారాలను పొందినవారికి అవమానకరమని పేర్కొన్నారు. 


గత వారం కంగన వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. 1947లో భారత దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం ఓ స్వాతంత్ర్యం కాదని, భిక్షమని అన్నారు. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.  


Updated Date - 2021-11-14T20:30:28+05:30 IST