రుషికొండ బీచ్‌ రాళ్ల సందుల్లో మృతదేహం

ABN , First Publish Date - 2022-08-12T06:35:55+05:30 IST

రుషికొండ బీచ్‌ ఏపీ టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ రూం సమీపంలోని సముద్ర కెరటాలు తాకే రాళ్ల మధ్య సందుల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉండడం స్థానికంగా సంచలనమైంది.

రుషికొండ బీచ్‌ రాళ్ల సందుల్లో మృతదేహం
ఏపీ టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద బీచ్‌ రాళ్లలో చిక్కుకుని ఉన్న మృతదేహం

గుర్తు తెలియని వ్యక్తి అని వెల్లడించిన పోలీసులు

ప్రమాదమా...హత్యా అన్న అనుమానాలు

విశాఖపట్నం, ఆగస్టు 11: రుషికొండ బీచ్‌ ఏపీ టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ రూం సమీపంలోని సముద్ర కెరటాలు తాకే రాళ్ల మధ్య సందుల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉండడం స్థానికంగా సంచలనమైంది. మృతుని వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా. తలకు గళ్లచొక్కా చుట్టి ఉంది. కూర్చునే స్థితిలో మృతదేహం కనిపిస్తోంది. ప్రమాద వశాత్తు చనిపోయిన వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆటు పోట్లు కారణంగా  రాళ్ల మధ్య ఇరుక్కుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే సదరు యువకుడిని ఎవరైనా చంపి మృతదేహాన్ని రాళ్ల మధ్య ఇరికించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతదేహం ఉన్న ప్రాంతాన్ని ద్వారకా ఏసీపీ ఆర్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, డీసీపీ నాగన్న పరిశీలించారు. శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.   


Updated Date - 2022-08-12T06:35:55+05:30 IST