Highcourt Warning: మృతదేహంతో చెలగాటమా?

ABN , First Publish Date - 2022-07-23T14:22:07+05:30 IST

కళ్ళకుర్చి సమీపం చిన్నసేలం ప్రైవేటు పాఠశాల విద్యార్థిని శ్రీమతి మృతదేహాన్ని స్వీకరించకుంటే పోలీసుల ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తామని

Highcourt Warning: మృతదేహంతో చెలగాటమా?

- స్వీకరించి అంత్యక్రియలు చేయకుంటే పోలీసుల చర్య

- తల్లిదండ్రులకు హైకోర్టు హెచ్చరిక

- పోస్టుమార్టంపై జిప్‌మర్‌ కమిటీ పరిశీలన


చెన్నై, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కళ్ళకుర్చి సమీపం చిన్నసేలం ప్రైవేటు పాఠశాల విద్యార్థిని శ్రీమతి మృతదేహాన్ని స్వీకరించకుంటే పోలీసుల ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తామని హైకోర్టు తల్లిదండ్రులను హెచ్చరించింది. ఇప్పటికి రెండుసార్లు ఆ విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ ఆమె మృతదేహాన్ని స్వీకరించేందుకు తటపటాయిస్తుండటం గర్హనీయమని పేర్కొంది. శ్రీమతి మృతి కేసుకు సంబంధించిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి సతీష్ కుమార్‌ విచారణ జరుపుతూ ఆ బాలిక మృతదేహానికి నిర్వహించిన రెండు పోస్టుమార్టం నివేదికల్లో ఎలాంటి తేడాలు లేవని ఫోరెన్సిక్‌ నిపుణులు తెలియజేస్తున్నారన్నారు. తొలిసారి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో రెండోసారి పోస్టుమార్టం జరిపించామని, ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే కారణంగా ఆ రెండు నివేదికలను పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యనిపుణుల కమిటీతో పరిశీలన చేయించేందుకు ఆదేశిస్తున్నామని ఆయన తెలిపారు. రెండుసార్లు జరిపిన పోస్టుమార్టం సందర్భంగా తీసిన వీడియోలను కూడా జిప్‌మర్‌  వైద్యనిపుణుల కమిటీకి సమర్పించాలని, ఆ కమిటీ పరిశీలించిన తర్వాత సమగ్రమైన వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వు జారీ చేశారు.


న్యాయమూర్తి ఆగ్రహం..

రీపోస్టుమార్టం పూర్తయినా శ్రీమతి మృతదేహాన్ని తల్లిదండ్రులు స్వీకరించి అంత్యక్రియలు జరిపేందుకు ముందుకురావటం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొనటంతో న్యాయమూర్తి సతీ్‌షకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని స్వీకరించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియటం లేదని, మృతదేహంతో చెలగాటమా అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశించినా మృతదేహాన్ని ఎందుకు స్వీకరించడం లేదని, ప్రతిసారీ ఏదో ఒక సమస్య లేవనెత్తుతున్నారన్నారు. విద్యార్థిని మృతి సాకుగా పెట్టుకుని కొందరు లబ్దిపొందాలని చూస్తున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ వ్యహారంలో అందరూ తామే న్యాయమూర్తులని, వైద్యనిఫుణులని, న్యాయవాదులనే భావనతో ఉంటూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో శ్రీమతి తల్లిదండ్రులకు న్యాయస్థానం ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తోందని, ఇకనైనా విద్యార్థినికి తగిన రీతిలో  అంత్యక్రియలు నిర్వహించాలని, అప్పుడే ఆమె ఆత్మశాంతించగలదన్నారు. విద్యార్థిని మృతదేహాన్ని స్వీకరించేందుకు తల్లిదండ్రులు అంగీకరించాలని, శనివారం ఉదయం 11 గంటల్లో వారు మృతదేహాన్ని స్వీకరిస్తారని భావిస్తున్నామని న్యాయమూర్తి సతీ్‌షకుమార్‌ పేర్కొన్నారు. తాము నిర్దేశించినట్లు విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు జరుపకుంటే పోలీసులే తదుపరి చర్యలు తీసుకుంటారని న్యాయమూర్తి హెచ్చరించారు.  


తల్లిదండ్రుల అంగీకారం...

 శ్రీమతి తల్లిదండ్రులు న్యాయమూర్తి ఆదేశం మేరకు కుమార్తె మృతదేహాన్ని స్వీకరించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల తరఫు న్యాయవాది శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టుకు తెలియజేశారు. న్యాయమూర్తి సతీష్‏కుమార్‌ ఈ సందర్భంగా ఓ ఉత్తర్వు జారీ చేశారు. శ్రీమతి మృతదేహాన్ని శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపున తల్లిదండ్రులకు అప్పగించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని, తరువాత సాయంత్రం ఆరుగంటల్లోగా  అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-07-23T14:22:07+05:30 IST