డెడ్‌లైన్‌ మూడో తేదీ

ABN , First Publish Date - 2022-07-01T06:14:37+05:30 IST

జూలై మూడవ తేదీ వరకు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని సర్పంచులు హెచ్చరిస్తున్నారు.

డెడ్‌లైన్‌ మూడో తేదీ
కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రణీల్‌చందర్‌, సంఘం సభ్యులు, సర్పంచులు

- మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు

- సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌ 

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 30 : జూలై మూడవ తేదీ వరకు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని సర్పంచులు హెచ్చరిస్తున్నారు. గురువారం స్థానిక రెడ్‌క్రాస్‌ భవనంలో జిల్లా సర్పంచుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌ ప్రసంగిస్తూ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానమంత్రి, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మూడవ తేదీ లోగా స్పష్ణమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులం మూడవ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు వెంటనే చెల్లించాలని, ఈ పనులకు వచ్చే రోజువారి కూలీలకు, గ్రామ పంచాయతీ నర్సరీలకు, వాచర్‌లకు ప్రతీ వారం పేమెంట్‌ తప్పక చెల్లించాలని కోరారు. గ్రామ పంచాయతీలలో జరిగే పనులకు బిల్లులపై వేస్తున్న జీఎస్‌టీని రద్దు చేయాలని, జీఎస్‌టీ ద్వారా గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నాయని తెలిపారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 2011 సెన్సెస్‌ ప్రకారం వస్తున్నాయని, కానీ 2021 జనాభా ప్రకారం ప్రతి గ్రామంలో గణనీయంగా జనాభా పెరుగుదల ఉన్నదని. ఆర్థిక సంఘం నిధులను విడుదల 2021 జనాభా ప్రకారం వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశం అనంతరం పెద్ద ఎత్తున్న సర్పంచులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తరలివెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ద్వారా కేంద్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు పంపించాలని వారు కోరారు. 

Updated Date - 2022-07-01T06:14:37+05:30 IST