చంపేసి పడేశారు

ABN , First Publish Date - 2020-11-30T04:49:35+05:30 IST

మహిళ అనుమానాస్పద మృతి కేసును కొవ్వూరు పట్టణ పోలీసులు ఛేదించారు.

చంపేసి పడేశారు

 మహిళ అనుమానాస్పద మృతి కేసు  ఛేదించిన కొవ్వూరు పోలీసులు

 ముగ్గురి  అరెస్టు

కొవ్వూరు నవంబరు 29 : మహిళ అనుమానాస్పద మృతి కేసును కొవ్వూరు పట్టణ పోలీసులు ఛేదించారు. ఆదివారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ మూర్తి మాట్లాడుతూ కొవ్వూరు పట్టణ పరిధిలో 2019 డిసెంబరు 6వ తేదీన అవంతీ ఫ్యాక్టరీ–2 సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద పొదలలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై ఎస్‌ఐ కె.వెంకటరమణ అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేశారు. దర్యాప్తులో మృతురాలు కొవ్వూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న పోసంశెట్టి సత్యనారాయణ భార్య నాగలక్ష్మి (42)గా గుర్తించారు. కేసును సీఐ విచారణ చేపట్టి హత్యకేసుగా మార్పుచేశారు. 2019 నవంబరు 27న నాగలక్ష్మి పట్టణంలోని వరద గోపాలస్వామి గుడి వీధికి చెందిన చిల్లా అప్పలసూరి ఇంటికి తీసుకున్న అప్పు ఇవ్వడానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరువురు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అప్పలసూరి నాగలక్ష్మిని గట్టిగా నెట్టడంతో  కబోర్డు తలకు తగిలి గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. బయట నుంచి వచ్చిన భర్త శ్రీనివాసరెడ్డికి అప్పలసూరి విషయం చెప్పింది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అప్పుడే ఇంటికి వచ్చిన పోలవరానికి చెందిన శ్రీనివాసరెడ్డి మేనల్లుడు దుగ్గిరాల రమేష్‌ సహాయంతో ముగ్గురు కలిసి నాగలక్ష్మి మృతదేహాన్ని వేములూరు రోడ్‌ అవంతీ ఫ్యాక్టరీ–2 సమీపంలోని రైల్వేట్రాక్‌కు దగ్గరలో పొదల్లో పడవేశారు. ఫోన్‌కాల్స్‌ డేటా ఆధారంగా సీఐ మూర్తి ఈ కేసును చేదించారు. ఆదివారం ముగ్గురిని అరెస్ట్‌ చేశామన్నారు. కేసు విచారణలో ఎస్‌ఐలు కె.వెంకటరమణ,పి.రవీంద్రబాబు,హెచ్‌సి ప్రసాద్‌బాబు, స్టేషన్‌ సిబ్బంది అనిల్‌కుమార్‌, పి.వెంకటేశ్వరబాబు, డి.వి.రమణ,ఎం.నరేష్‌, రాజేష్‌లు సహకరించారన్నారు.

Updated Date - 2020-11-30T04:49:35+05:30 IST