పండుగ పూట విషాదం

ABN , First Publish Date - 2022-10-04T06:22:52+05:30 IST

పండుగ పూట విషాదం

పండుగ పూట విషాదం

పూల కోసం వెళ్లి నీట మునిగి మృతి చెందిన యువకుడు

తొలి పండగకు అత్తారింటికి వచ్చి కానరాని లోకాలకు.. 

ఏటూరునాగారం, అక్టోబరు 3: సద్దుల బతుకమ్మ వేళ ఆ ఇంట విషాదం అలుముకుంది. తొలి పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు పూల కోసం వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ఎరవేణి శ్రీను (29)కు ఏటూరునాగారానికి చెందిన బాస బాబు కూతురు రమాదేవితో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు మొదటిసారి సద్దుల బతుకమ్మ, విజయదశమి వేడుకలకు ఏటూరునాగారం వచ్చారు.  సోమవారం సద్దుల బతుకమ్మ కావడంతో తన బామ్మర్ది రమేష్‌తో కలిసి శ్రీను తామర పూల కోసం రొయ్యూర్‌-చల్పాక గ్రామాల మధ్య ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో పూలు తెంచి తిరిగి ఒడ్డుకు చేరుకుంటున్న క్రమంలో నాచు గడ్డి కాళ్లకు చుట్టుకొని నీటమునిగాడు. అక్కడే ఉన్న రమేష్‌ అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. నీళ్లలో గల్లంతైన శ్రీను ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా కొన్ని గంటల తర్వాత శ్రీను మృతదేహం లభ్యమైంది.

Updated Date - 2022-10-04T06:22:52+05:30 IST