మృత్యు ఘంటికలు

ABN , First Publish Date - 2021-04-23T06:54:20+05:30 IST

రోనా సెకండ్‌వేవ్‌ ఉమ్మడి జిల్లాలో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. మొదటి దశతో పోలిస్తే రెండో దశ వైరస్‌ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉంది. దీంతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 22 రోజుల్లో 124మంది కరోనాతో ఇబ్బంది పడుతూ మృతిచెందారు.

మృత్యు ఘంటికలు

ఉమ్మడి జిల్లాలో 22 రోజుల్లో 124 మంది మృతి

ఒక్క రోజే ఆరుగురి మత్యువాత

ఆందోళన కలిగిస్తున్న మరణాలు

బాధితులతో ఏరియా ఆస్పత్రులు కిటకిట

పరీక్ష కిట్లు లేక చేతులెత్తేస్తున్న సిబ్బంది

రోజు రోజూకూ పెరుగుతున్న కేసుల సంఖ్య

కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా వ్యాప్తి

నల్లగొండ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా సెకండ్‌వేవ్‌ ఉమ్మడి జిల్లాలో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. మొదటి దశతో పోలిస్తే రెండో దశ వైరస్‌ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉంది. దీంతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 22 రోజుల్లో 124మంది కరోనాతో ఇబ్బంది పడుతూ మృతిచెందారు. అధికారిక లెక్కల ప్రకారం 44మంది కాగా, అనధికారికంగా మరో 80మంది ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లాలో అధికారికంగా 17మంది, అనఽధికారికంగా 25మంది, సూర్యాపేటలో అధికారికంగా 16, అనధికారికంగా 30, యాదాద్రి జిల్లాలో అధికారికంగా 11, అనధికారికంగా 25 మంది వరకు మృత్యువాతపడ్డారు. కరోనా మొదటి దశ, రెండో దశ కలిపి ఈ నెల 1వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 196 మంది మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో 74, సూర్యాపేటలో 34, యాదాద్రి జిల్లాలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే రోజు 146 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 1475 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, గురువారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో నలుగురు, యాదాద్రి జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. 3762 మందికి పరీక్షలు నిర్వహించగా, 746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 9630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


టెస్టింగ్‌ కిట్లు లేక నిలిచిన పరీక్షలు

నాగార్జునసాగర్‌ ప్రభుత్వాస్పత్రిలో రోజువారీ టెస్టుల కోటా 100 కాగా, మూడు రోజులుగా ఇక్కడికి 250 మందికిపైగా వస్తున్నారు. గురువారం కేవలం 100కిట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, సిబ్బందిపై 150 మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుతిరిగారు. స్టాక్‌ లేకపోవడంతో తామేం చేయలేమని సిబ్బంది సమాధానమిచ్చారు. పైనుంచి వాళ్లు సరఫరా చేస్తే రోజుకు 100 కాదు 500 అయినా పరీక్షలు చేస్తామని సిబ్బంది చెబుతుండగా, కిట్ల కొరత కారణంగా ఆస్పత్రుల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 43 కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం కొన్ని కేంద్రాల్లో కిట్లు లేక పరీక్షలే చేయలేదు. మరికొన్ని కేంద్రాల్లో ఉన్న కిట్లతోనే సరిపుచ్చారు. దీంతో పరీక్షలకు వచ్చినవారు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. నల్లగొండ జనరల్‌ ఆస్పత్రిలో నిత్యం 250 మంది వస్తుండగా, కిట్ల కొరత కారణంగా 150 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించగా, 2500లోపే జరుగుతున్నాయి. పరీక్షలకు వచ్చేవారి సంఖ్య నాలుగువేలకు పైగా ఉంటోంది. కిట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ స్టేట్‌ డ్రగ్స్‌ స్టోర్‌కు అక్కడి నుంచి జిల్లా సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌కు చేరుకుంటాయి. కేంద్రాల ఇండెంట్ల ఆధారంగా కిట్లను సరఫరా చేస్తారు. అయితే కిట్లు తెచ్చేందుకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది గురువారం హైదరాబాద్‌ వెళ్లారు. శుక్రవారం ఉదయానికి కిట్లు వస్తే పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. దేవరకొండ డివిజన్‌పరిధిలోని మర్రిగూడ, కొండమల్లేపల్లి, చింతపల్లి, పీఏపల్లి మండలాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా కిట్ల కొరతకారణంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. సూర్యాపేట జిల్లాలోని మోతె, నూతన్‌కల్‌, చివ్వెంల, సూర్యాపేట మండలం, సూర్యాపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కిట్ల కొరత ఏర్పడింది.


ఆరుగురి మృత్యువాత

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వీటీనగర్‌లో ఓ ఫొటో గ్రాఫర్‌గా కరోనాతో గురువారం మృతి చెందాడు. నాగార్జునసాగర్‌ విజయవిహార్‌ అతిథి గృహంలో పనిచేసే ఓ ఉద్యోగి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. పెద్దవూర మండలం సంగారం గ్రామంలో ఒకరు, గుర్రంపోడు మండలంలో ఒకరు, యాదాద్రి జిల్లాలో రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామానికి  చెందిన ఒకరు, రఘునాధపూర్‌ గ్రామానికి చెందిన మరొకరు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 3762 మందికి పరీక్షలు నిర్వహించగా, 746 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 168, సూర్యాపేట జిల్లాలో 267, యాదాద్రి జిల్లాలో 311 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) తహసీల్దార్‌ పి.జ్యోతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లను నిలిపి హైపోక్లోరైడ్‌తో శానిటైజ్‌ చేశారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబి చైర్మన్‌, టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి కరోనా లక్షణాలు కనిపించడంతో హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వారు ప్రకటించారు. భువనగిరి మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఆయన హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.


నిండుతున్న ఆస్పత్రులు

కరోనా కేసులతో ఆస్పత్రులు నిండుతున్నాయి. గురువారం ఒక్కరోజే మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రిలో 24 మంది చేరారు. సాగర్‌ ఆస్పత్రిలో 30, దేవరకొండ ఆస్పత్రిలో 14 మంది చికిత్స కోసం చేరారు. సాగర్‌ ఏరియా ఆస్పత్రిలో 60 పడకలు ఉండగా, ఒక్కరోజే సాగర్‌లో 30 మంది చేరారు. కరోనా కోటాకు మించి రోగులు ఏరియా ఆస్పత్రులకు వస్తుండటంతో సాధారణ రోగులను ఇళ్లకు పంపుతున్నారు. నాలుగు రోజుల్లో నల్లగొండ జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండనున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తామేం చేయలేమని సూపరింటెండెంట్లు చెబుతున్నారు. ఇక వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండటం, మృతుల సంఖ్యపై ప్రచారం జరుగుతుండటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నారు. 10 పడకలు, ఐసీయూ సామర్థ్యం ఉన్న ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 20 చిన్నా, పెద్ద ఆస్పత్రులు ఉండగా, 11 ఆస్పత్రులకు కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్పత్రుల్లో ఇప్పటికే 60శాతం పడకలు నిండాయి. లక్షల్లో బిల్లులు అవుతున్నా ప్రాణ భయంతో జనం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.


టెస్టింగ్‌ కిట్లకొరత ఉంది : డాక్టర్‌ మాతృనాయక్‌, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి

కరోనా టెస్టింగ్‌ కిట్ల కొరత వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారులను అడగ్గా, విదేశాల నుంచి రావడంలోనే జాప్యం జరిగిందని చెప్పారు. స్థానికంగా మేం ఏం చేయగలం. వచ్చే రోజులు అన్ని బెడ్స్‌ కరోనా రోగులతో నిండుతాయి. రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌, కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇబ్బంది లేదు. రోగులు అనవసరంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనాపై అతిగా ప్రచారం కూడా మృతులకు కారణమవుతోంది. దీంతో గుండెపోటుకు గురవుతున్నారు. అన్ని బెడ్స్‌ కరోనాకు కేటాయించాలని ఆస్పత్రుల వైద్యులకు సూచించాం.


కరోనా మృతుల సమాచారంపై దృష్టి పెట్టాం : ఏ.కొండల్‌రావు, జిల్లా వైద్యాధికారి

వ్యాక్సిన్‌ తీసుకోనివారు, షుగర్‌, బీపీ వంటి రోగాలతో ఇబ్బందిపడుతున్నవారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కరోనాతో మృత్యువాతపడుతున్నారు. అది కూడా 20 శాతం మందే. మాకు సమాచారం లేకుండానే చాలామంది పాజిటివ్‌లు జిల్లా నుంచి హైదరాబాద్‌ ఆస్పత్రులకు ఆందోళనతో వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. మృతదేహాలు కూడా జిల్లాకు రావడం లేదు. అక్కడే అంత్యక్రియలు పూర్తవుతున్నాయి. దీంతో కరోనా మృతులపై స్పష్టమైన సమాచారం రావడం లేదు. అందుకే ఈ వివరాలను అన్ని తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టాం. మొదటి దశలో రోగులను గుర్తించడం, శాంపిల్స్‌ సేకరించడం, చికిత్స చేసేందుకు సమయం ఉండేది. సెకెండ్‌ వేవ్‌లో అలా లేదు.


కొవిడ్‌ పరీక్షల పేరుతో దోపిడి : ల్యాబ్‌సీజ్‌

మిర్యాలగూడ అర్బన్‌: కొవిడ్‌ పరీక్షల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మిర్యాలగూడ పట్టణం డాక్టర్స్‌ కాలనీ సమీపంలోని అంకిత ఆస్పత్రికి అనుసంధానంగా పనిచేస్తున్న ల్యాబ్‌ను టాస్క్‌ఫోర్స్‌ బృందం గురువారం సీజ్‌ చేసింది. ఆస్పత్రిని తనిఖీచేసిన టాస్క్‌ఫోర్స్‌ పలువురు రోగులను ఆరా తీయగా, కొవిడ్‌ పరీక్షల పేరుతో రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసినట్టు వారు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి ఆరోపణ వాస్తవమని తేలడంతో ల్యాబ్‌ను సీజ్‌చేసి కేసు నమోదు చేశారు. అదేవిధంగా స్థానిక నటరాజ్‌ థియేటర్‌కు సమీపంలోని మరో రెండు ల్యాబుల్లో అనధికారికంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు అధికారులు రాగా, విషయం తెలుసుకున్న సదరు నిర్వాహకులు ల్యాబ్‌కు తాళాలు వేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు రూ.70 మాత్రమే వసూలు చేయాల్సి ఉన్నా ప్రైవేటు వైద్యులు బేఖాతర్‌ చేస్తున్నారు.


మాస్క్‌ లేనివారిపై పోలీసుల కొరడా : 3,264 కేసులు నమోదు 

నల్లగొండ క్రైం: జిల్లాలో మాస్క్‌లు లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్న వ్యక్తులపై ఏప్రిల్‌ నెలలో 3264 కేసులు నమోదుచేశారు. ఈ-పెట్టి కేసులు 1023 ఉండగా, ఈ-చలాన్లు 2241 ఉన్నాయి. అత్యధికంగా మిర్యాలగూడ ట్రాఫిక్‌ పరిధిలో 402, నల్లగొండ రూరల్‌లో 362, ట్రాఫిక్‌లో 217, వన్‌టౌన్‌లో 202 టూటౌన్‌లో 102, కట్టంగూరులో 164, కొండమల్లేపల్లిలో 135, తిప్పర్తిలో 115 కేసులు నమోదు చేశారు. కేతేపల్లిలో 109, నకిరేకల్‌లో 105, మిర్యాలగూడ వన్‌టౌన్‌లో 96, వాడపల్లి లో 89, మాడ్గులపల్లిలో 79, దేవరకొండ మండలంలో 72, చండూరులో 69, చింతపల్లిలో 64, నాంపల్లిలో 63, కనగల్‌లో 64, మిర్యాలగూడ టూటౌన్‌లో 61, నార్కట్‌పల్లిలో 60, శాలిగౌరారంలో 59, మునుగోడులో 56, చిట్యాలలో 56, తిరుమలగిరి సాగర్‌లో 55, హాలియాలో 54 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-04-23T06:54:20+05:30 IST