బొగ్గు లారీపై నుంచి పడి డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-27T04:35:31+05:30 IST

లారీలో బొగ్గు లోడ్‌ చేసిన తర్వాత పరదా కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడటంతో డ్రైవర్‌ ఒకరు మృతిచెందాడు.

బొగ్గు లారీపై నుంచి పడి డ్రైవర్‌ మృతి
చికిత్స పొందుతూ మృతిచెందిన సురేష్‌

కిష్టారం ఓసీ మైన్‌లో ఘటన

సత్తుపల్లిరూరల్‌, అక్టోబరు 26 : లారీలో బొగ్గు లోడ్‌ చేసిన తర్వాత పరదా కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడటంతో డ్రైవర్‌ ఒకరు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కిష్టారం ఓసీలో విజయసాయి ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ ఒకటి యాదాద్రి సిమెంట్స్‌కు బొగ్గు లోడుతో వెళ్లేందుకు సిద్ధమైంది. డ్రైవర్‌ నీలపల్లి సురేష్‌ (29) లారీపై పైకి ఎక్కి పరదా కడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ జారి 10అడుగుల లోతులో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. సింగరేణి అధికారులు హుటాహుటీన పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్న క్రమంలో సత్తుపల్లిలోనే మృతిచెందాడు. మృతుడు సురేష్‌ ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనకూడి గ్రామానికి చెందిన నీలపల్లి పరిశుద్ధమ్మ, అబ్రహం దంపతుల కుమారుడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద స్థలంలో నిర్లక్ష్యం?

ప్రమాద విషయం తెలుసుకున్న కిష్టారం ఓసీ పీవో వీసమ్‌ కృష్ణయ్య ప్రైవేట్‌ ఆస్పత్రికి చేరుకుని క్షతగ్రాతుడిని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. అయితే మృతుడు సురేష్‌ లారీ పైకి ఎక్కి పరదా కడుతున్న సమయంలో సింగరేణి అధికారులు, సూపర్‌వైజర్లు గానీ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే విధంగా పలుమార్లు ప్రమాదాలు జరిగినా విచారణ చేపట్టకపోవడంతో ఇలాంటివి పునరావృతమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సరైన చికిత్స అందకపోగా, మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన తరలించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-10-27T04:35:31+05:30 IST