కొమ్ముగూడెంలో పెరుమళ్ళు మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
సోదరి కుటుంబంపై కత్తులతో సోదరుల దాడి
చికిత్స పొందుతూ సోదరి భర్త కన్నుమూత
నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు
కొమ్ముగూడెంలో పోలీసుల బందోబస్తు
జూలూరుపాడు, మార్చి24: తోడ బుట్టిన సోదరి కుటుంబంపై విచక్షణ రహితంగా ఇద్దరు సోదరులు, కుటుంబ సభ్యులు కత్తులతో దాడులకు దిగడంతో తీవ్రంగా గాయపడిన ఆంగోత్ పెరుమాళ్లు (47) కొత్తగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మండలంలోని కొమ్ముగూడేనికి చెందిన ఆంగోత్ పుత్లీబాయి, బాణోత్ భోజ్యాలాల్, సేవా సొంత అక్కాతమ్ముళ్ళు. ఇరు కుటుంబాల మధ్య భూ వివాదంలో ఘర్షణ ఏర్పడటంతో బాణోత్ భోజ్యాలాల్, సేవాలతో పాటు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి పుత్లీబాయి కుటుంబ సభ్యులపై కత్తులతో మంగళవారం అర్ధరాత్రి దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటనలో పెరుమాళ్లకు పొట్టలో కత్తి లోతుగా దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించి వైద్య సేవలను అందిస్తు న్నారు. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. కాగా పెరుమాళ్లు నిమ్మగూడెం మండలంలోని రామచంద్రునిపేట ఆశ్రమ బాలికల పాఠ శాల లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సొంత బావ, అక్క, మేన మామలపై దాడికి పాల్పడిన బాణోత్ భోజ్యాలాల్ జూలూరుపాడు మండ లంలోని వాగొడ్డుతండా పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అతడి భార్య బాణోత్ విజయ కొమ్ముగూడెం అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తుండగా, మరో సోదరుడైన సేవా ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగు లుగా పని చేస్తున్న వీరు భూమి విక్రయానికి సంబంధంచి సోదరికి రూ.70 వేల నగదు ఇచ్చే విషయంలో ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో సహనం కోల్పోయి కత్తులతో దాడికి పాల్పడి సొంత బావ మృతికి కారకులైయ్యారు. దాడిలో గాయపడిన పుత్లీబాయి, ఆమె కుమార్తె సుమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వసంత్‌కుమార్ తెలిపారు. పెరుమాళ్లు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కొమ్ముగూడేనికి తీసుకొచ్చారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వసంత్‌కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.