సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి కాంటిలాల్ పాఠిల్
చుంచుపల్లి, మార్చి 25: వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని సన్యాసీబస్తీకి చెందిన మల్లెల సునీల్ (48) గురువారం రాత్రి బంధువుల నూతన గృహప్రవేశానికి వెళ్తున్నానని తన భార్యకు చెప్పి వెళ్లాడు. కానీ అతడు రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన మున్నాలాల్, పెనుబల్లి ప్రాంతానికి చెందిన వెంకటప్పయ్యలతో కలిసి పెనుబల్లి అటవీ ప్రాంతానికి జంతువులను వేటాడేందుకు వెళ్లాడు. అయితే ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలను అమర్చి ఉండగా వైర్లను గుర్తించని తాము వాటికి తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యామని, దాంతో ముల్లెల సునీల్ మృతి చెందాడని అతడితో వచ్చిన మున్నాలాల్, వెంకటప్పయ్యలు కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం తెలిపారు. దాంతో టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేసేందుకు సంఘటన స్థలానికి వెళ్లగా అక్కడ సునీల్ మృతదేహం అదృశ్యమైంది. అతడి మృతదేహం కోసం పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వెతికారు. అనంతరం డ్వాగ్ స్క్వౌట్స్తో తనిఖీలు చేసినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఆ ఇద్దరు వేటగాళ్లతో పాటు పెనుబల్లి ప్రాంతంలో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ట్రైనీ ఐపీఎస్ అధికారి కాంటిలాల్ పాఠిల్, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, వన్‌టౌన్, టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, రాజు, పోలీస్ అధికారులు, సిబ్బం ది సందర్శించి వివరాలు సేకరించారు.