మృత్యు గుంత

ABN , First Publish Date - 2022-09-27T04:52:07+05:30 IST

రోడ్డు మరమ్మతుల కోసం, వెంచర్ల ఏర్పాటు కోసం ఎక్కడ పడితే

మృత్యు గుంత
ప్రమాదానికి కారణమైన నీటి గుంత, కుమారుల మృతదేహాల వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు

  • చిన్నారుల ప్రాణాలను తీస్తున్న మట్టి తవ్వకాలు
  • మట్టి గుంతలు పూడ్చకపోవడంతో ప్రమాదాలు
  • షాద్‌నగర్‌ మండలం సోలిపూర్‌లోని నీటి గుంతలోపడి ముగ్గురు చిన్నారుల మృతి 
  • అధికారుల నిర్లక్ష్యమే చిన్నారుల ప్రాణం తీసిందని ఆరోపణలు


షాద్‌నగర్‌, సెప్టెంబరు 26 : రోడ్డు మరమ్మతుల కోసం, వెంచర్ల ఏర్పాటు కోసం ఎక్కడ పడితే అక్కడ భారీ గుంతలు తవ్వి వదిలేస్తున్నారు. వర్షాలకు భారీ గుంతల్లో నీరు నిలిచి చిన్నారుల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. రియల్‌ వ్యాపారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు బలై పోతున్నారు. విచ్చలవిడిగా రోడ్ల వెంట భారీ గుంతలు తవ్వుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. క్వారీ గుంతలు, వెంచర్ల సమీపంలోని నీటి గుంతల వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో యువకులు, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు.. ఆ తర్వాత సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పాలక వర్గం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని సోలిపూర్‌ గ్రామం వద్ద జరిగిన సంఘటన.

దసరా సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు ఆ ప్రాణస్నేహితులు.. తమ గ్రామ శివారులోని ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి కొంత సమయం సరదాగా గడిపారు. ఇంతలోనే వారి కంట పడింది ఒక నీటి గుంత. అందులో ఈత కొడుదామనుకున్నారో.. లేక చేపలను పట్టాలనుకున్నారో తెలియదు కానీ.. నీటి గుంతలో దిగిన తర్వాత ఒకరిని కాపాడబోయి.. ఒకరు ఇలా మృత్యవాతపడ్డారు. మరణంలోనూ తమ స్నేహం శాశ్వతమని నిరూపించుకున్నారంటూ సోలిపూర్‌ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. 


నాన్న కొత్త బట్టలు కొనివ్వరా.. 

దసరా పండుగకు కొత్తబట్టలు కొనివ్వరా నాన్న అని తన కుమారుడు ఈ రోజే అడిగాడని, బట్టలు కొనుక్కురావడానికి బయటకు వెళ్లానని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందం టూ అక్షిత్‌ గౌడ్‌ తండ్రి బిక్షపతిగౌడ్‌ విలపించాడు. ఈ విషాదకరమైన ఘటనను చూసి అక్కడ ఉన్నవారందరినీ కన్నీళ్లు పెట్టించింది. బిక్షపతి, శివలీల దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా అక్షిత్‌ అందరి కన్న చిన్నవాడు. 


ఫరీద్‌, సయిఫ్‌ అన్నదమ్ముల పిల్లలు 

సోలిపూర్‌ గ్రామానికి చెందిన ఫరీద్‌, సయీ్‌ఫలు వరుసకు అన్నదమ్ముల పిల్లలు అవుతారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నయిమ్‌, ఖాతిజా దంపతుల కుమారుడు ఫరీద్‌ కాగా.. సలీం ఏకైక కుమారుడు సయీఫ్‌. ఉన్న ఒక్క కొడుకు మరణించడంతో సలీమ్‌ దంపతుల రోదనలను ఆపడం వారి కుటుంబ సభ్యులకు కష్టతరంగా మారింది.


బాధ్యత ఎవరిది ?

షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని సోలిపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు అక్షిత్‌గౌడ్‌ (8). సయిఫ్‌ (7), ఫరీద్‌ (12) నీటి గుంతలో పడి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణ మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు మరణించారని తల్లిదండ్రులు, వారి బంధువులు, గ్రామస్థులు ఆరోపించారు. తమ గ్రామ పరిస్థితుల గురించి పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు.


మట్టి తవ్వకాలతోనే ..

షాద్‌నగర్‌ నుంచి సోలిపూర్‌ గ్రామానికి వెళ్లే సర్వీస్‌ రోడ్డు మరమ్మతు కోసం వెంచర్‌లో మున్సిపల్‌ సిబ్బంది మట్టి తవ్వకాలు చేపట్టారని గ్రామస్థులు తెలిపారు. మట్టి తవ్విన తర్వాత ఏర్పడిన గుంతను పూడ్చకపోవడంతో వర్షపు నీరు అందులో చేరిందని తెలిపారు. అలాగే వెంచర్‌ నిర్వాహకులు కూడా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో రోడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టారు. దాంతో వెంచర్‌ కొంతభాగంలో వర్షపు నీరు నిలిచి చెరువును తలపించేలా మారింది. వెంచర్‌ చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సెలవురోజుల్లో విద్యార్థులు అందులో ఆడుకోవడానికి వెళుతుంటారని గ్రామ ప్రజలు తెలిపారు. అందులో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. 


పదేళ్లలో 12 మంది మృత్యువాత 

పదేళ్లలో సోలిపూర్‌ చెరువులో పడి 12 మంది మరణించినట్లు తెలిసింది. తాజాగా నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మరణించడంతో ఒకే గ్రామానికి చెందిన 15మంది మరణించడం గమనార్హం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. 


ఆస్పత్రివద్ద ఆందోళన 

బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంతవరకు చిన్నారులకు పోస్టుమార్టం జరపరాదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం చెల్లించాలని బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత వీర్లపల్లి శంకర్‌తో పాటు బీఎస్పీ నాయకులు డిమాండ్‌ చేశారు. 


విచారించి చర్యలు తీసుకుంటాం : ఏసీపీ 

ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ తెలిపారు. ప్రస్తుతం ఎవరి మీద కేసు నమోదు చేయలేదన్నారు.  



Updated Date - 2022-09-27T04:52:07+05:30 IST